12 నుంచి ఇంటర్‌ మూల్యాంకనం

Intermediat evaluation Start From 12th May Mahabubnagar - Sakshi

కరోనా వైరస్‌ ప్రభావంతో నిలిచిన వాల్యువేషన్‌

శుక్రవారం ముగిసిన కోడింగ్‌ ప్రక్రియ

న్యూరిషి, బాలికల కళాశాలలో అదనపు కేంద్రాలు

భౌతిక దూరం పాటించేలా చర్యలు

మహబూబ్‌నగర్‌ ఎడ్యుకేషన్‌: లాక్‌డౌన్‌ ఇంటర్మీడియట్‌ మూల్యాంకనంపై తీవ్ర ప్రభావం చూపింది. ప్రతి ఏడాది మార్చిలో పరీక్షలు పూర్తయి మే నెలలో   ఫలితాలు వెల్లడించేవారు. కానీ ఈ ఏడాది ఇప్పటి వరకు మూల్యాంకన ప్రక్రియ పూర్తికాలేదు. ఈ క్రమంలో విద్యాసంవత్సరానికి అంతరాయం కలగకుండా కనీసం జూన్‌లోనైనా ఫలితాలు వెల్లడించేందుకు ప్రభుత్వం చర్యలు ప్రారంభించింది. ఇందులో భాగంగా రెండురోజుల క్రితం జవాబు పత్రాల కోడింగ్‌ ప్రక్రియను ప్రారంభించిన అధికారులు శుక్రవారం సాయంత్రం వరకు పూర్తి చేశారు. 12వ తేదీ నుంచి పూర్తిస్థాయిలో మూల్యాంకనం ప్రారంభించేందుకు సంబంధిత అధికారులు కసరత్తు చేస్తున్నారు. అధ్యాపకులు భౌతిక దూరం పాటించేలా చర్యలు చేపట్టారు. వివిధ జిల్లాల నుంచి మహబూబ్‌నగర్‌ క్యాంపునకు 4.20 లక్షల జవాబు పత్రాలు చేరుకున్నాయి.  

కేంద్రాల పెంపు..
ప్రతి ఏడాది ఉమ్మడి జిల్లావ్యాప్తంగా మహబూబ్‌నగర్‌లోని బాలుర జూనియర్‌ కళాశాలలో మాత్రమే మూల్యాంకన క్యాంపును ఏర్పాటు చేసేవారు. కరోనా ప్రభావంతో ఈ ఏడాది మరిన్ని కేంద్రాల ఏర్పాటునకు అధికారులు చర్యలు చేపట్టారు. బాలుర జూనియర్‌ కళాశాలతో పాటు అదనంగా బాలికల జూనియర్‌ కళాశాల, న్యూరిషి జూనియర్‌ కళాశాలలో కేంద్రాలను ఏర్పాటుచేశారు. సబ్జెక్టుల వారీగా పేపర్లను విభజించి ఆయా కేంద్రాలకు అధ్యాపకులను కేటాయించి మూల్యాంకనం చేపట్టనున్నారు. ప్రతి అధ్యాపకుడు మాస్క్‌ ధరించడం, శానిటైజర్‌ వినియోగించేలా అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. ఈ మేరకు డీఐఈవో వెంకటేశ్వర్లు శుక్రవారం జిల్లాలోని వివిధ ప్రభుత్వ, ప్రైవేటు కళాశాలల ప్రిన్సిపాళ్లతో సమావేశం ఏర్పాటు చేసి మూల్యాంకనానికి అధ్యాపకులను పంపించాలని ఆదేశించారు.  

భౌతిక దూరం తప్పనిసరి..
లాక్‌డౌన్‌ కారణంగా ఇంటర్మీడియట్‌ జవాబు పత్రాల మూల్యాంకనం మార్చిలో మధ్యలోనే ఆగిపోయింది. ఈ ప్రక్రియ తిరిగి ప్రారంభమైంది. శుక్రవారం సాయంత్రం నాటికి జవాబు పత్రాల కోడింగ్‌ విధానం పూర్తయింది. ఈ నెల 12 నుంచి పూర్తిస్థాయిలో ప్రారంభించేందుకు కసరత్తు చేస్తున్నాం. భౌతిక దూరం పాటిస్తూ మూల్యాంకనం చేసేందుకు మరో రెండు కేంద్రాలను అదనంగా కేటాయిస్తున్నాం.
– వెంకటేశ్వర్లు, జిల్లా ఇంటర్మీడియట్‌ అధికారి, మహబూబ్‌నగర్‌

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top