
కాలేజీ యాజమాన్యం తన పరీక్ష చెల్లించలేదంటూ ఇంటర్ బోర్డు వద్ద విలపిస్తున్న విద్యార్థిని స్నేహ
రాష్ట్రంలో ఇంటర్మీడియట్ పరీక్షలు ఈ నెల 9వ తేదీ నుంచి ప్రారంభం కానున్నాయి. ఈ మేరకు అవసరమైన అన్ని ఏర్పాట్లను ఇంటర్ బోర్డు పూర్తి చేసింది.
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో ఇంటర్మీడియట్ పరీక్షలు ఈ నెల 9వ తేదీ నుంచి ప్రారంభం కానున్నాయి. ఈ మేరకు అవసరమైన అన్ని ఏర్పాట్లను ఇంటర్ బోర్డు పూర్తి చేసింది. 9వ తేదీ నుంచి 27వ తేదీ వరకు ఆయా రోజుల్లో ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు జరుగుతాయి. రాష్ట్రవ్యాప్తంగా 1,251 కేంద్రాల్లో జరిగే ఈ పరీక్షలకు 9,73,237 మంది విద్యార్థులు హాజరుకానున్నారు. అందులో ప్రథమ సంవత్సర విద్యార్థులు 4,66,448 మంది, ద్వితీయ సంవత్సరం వారు 5,06,789 మంది. ఈ పరీక్షలను సజావుగా నిర్వహించేందుకు ఇంటర్మీడియట్ బోర్డు 24 గంటలు పనిచేసే కంట్రోల్ రూంను ఏర్పాటు చేసింది. 040-24601010 నంబర్‌కు కాల్ చేయడంతో పాటు 040-24655027 నంబర్‌కు ఫ్యాక్స్ చేయవచ్చు. మొత్తం పరీక్షా కేంద్రాల్లో 502 ప్రభుత్వ కాలేజీల్లో ఉండగా... 749 కేంద్రాలు ప్రైవేటు కాలేజీల్లో ఉన్నాయి. మరో 37 సెల్ఫ్ సెంటర్లను ఏర్పాటు చేశారు.
జిల్లా స్థాయిలో కమిటీలు..
పరీక్షలను సజావుగా నిర్వహించేందుకు జిల్లా స్థాయిల్లో జిల్లా పరీక్షల కమిటీ, జిల్లా కలెక్టర్ చైర్మన్‌గా హైపవర్ కమిటీలను బోర్డు ఏర్పాటు చేసింది. విద్యాశాఖ, రెవెన్యూ, పోలీసు విభాగాల అధికారులతో ఫ్లైయింగ్ స్క్వాడ్‌లను, సమస్యాత్మక కేంద్రాల్లో సిట్టింగ్ స్క్వాడ్‌లను నియమించింది. పరీక్ష కేంద్రాలకు రవాణా సదుపాయం, పరీక్షల సమయాల్లో నిరంతర విద్యుత్ సదుపాయం కల్పించాలని ఆయా శాఖలను కోరింది.
యాజమాన్యాల నిర్లక్ష్యం..
విద్యార్థులకు శాపం
ఒకవైపు ఇంటర్ పరీక్షలు ప్రారంభం కావడానికి ఒక్క రోజే గడువుండగా... మరోవైపు కాలేజీల యాజమాన్యాల నిర్లక్ష్యం పలువురు విద్యార్థులకు శాపంగా మారింది. దీంతో ఆ విద్యార్థులకు హాల్‌టికెట్లు రాక పరీక్ష రాయలేని పరిస్థితి ఏర్పడింది. హాల్‌టికెట్లు ఇంకా ఎందుకు ఇవ్వలేదని విద్యార్థుల తల్లిదండ్రులు యాజమాన్యాలను నిలదీస్తే... తాము అసలు పరీక్ష ఫీజులే కట్టని విషయాన్ని చెప్పకుండా ఇంటర్ బోర్డు నుంచే హాల్‌టికెట్లు రాలేదన్నాయి. దీనిపై ఆందోళన చెందిన పలువురు విద్యార్థుల తల్లిదండ్రులు శనివారం ఇంటర్ బోర్డు కార్యాలయానికి రావడంతో అసలు విషయం బయటపడింది. అయితే యాజమాన్యాల తప్పిదానికి విద్యార్థులు నష్టపోవాల్సి వస్తోందంటూ తల్లిదండ్రులతోపాటు తెలంగాణ విద్యార్థి పరిషత్ నేతృత్వంలో ఇంటర్ బోర్డు ఎదుట ఆందోళనకు దిగారు. కనీసం ఆలస్య రుసుముతో ఫీజులు తీసుకొని అయినా హాల్‌టికెట్లు ఇచ్చి న్యాయం చేయాలని కోరారు. పరీక్షలు రాయకపోతే తమ భవిష్యత్తు నాశనం అవుతుందని ఎస్‌ఆర్ నగర్ సీఎంఎస్ కాలేజీకి చెందిన ద్వితీయ సంవత్సర విద్యార్థిని స్నేహ వాపోయింది. మరో విద్యార్థిని షేక్ ఖాదర్‌బీ కూడా తనకు న్యాయం చేయాలని కోరింది.
అధికారులే పట్టించుకోవడం లేదు..
ఫీజు చెల్లింపు, హాల్‌టికెట్ల కోసం తాము వారం, పది రోజులుగా తిరుగుతున్నామని.. ఎంతగా అడుగుతున్నా అధికారులే పట్టించుకోవడం లేదని కాలేజీల యాజమాన్య ప్రతినిధులు ఆరోపించారు. మరోవైపు ఆలస్య రుసుముతో గతేడాది పరీక్షలకు రెండు రోజులు ముందు వరకు ఫీజు తీసుకున్నారని, ప్రస్తుతం ఏపీ ఇంటర్ బోర్డు కూడా తీసుకుంటోందని వారు చెప్పారు. తెలంగాణ ఇంటర్ బోర్డు అధికారులు మాత్రం తిరస్కరిస్తున్నారని వివరించారు.
ఆదివారం నిర్ణయిస్తాం..
సాధారణ ఫీజు చెల్లింపు గడువును ఒకటి రెండు సార్లు పొడిగించామని, ఫీజు చెల్లించిన వారందరి హాల్‌టికెట్లను ఫిబ్రవరిలో ప్రాక్టికల్ పరీక్షల ప్రారంభానికి ముందు కాలేజీలకు పంపామని ఇంటర్ బోర్డు కార్యదర్శి శైలజారామయ్యార్ తెలిపారు. యాజమాన్యాలు ఫీజు చెల్లించలేదంటూ అప్పటి నుంచి ఎవరు రాలేదని, రెండు రోజుల్లో పరీక్షలు ప్రారంభం అవుతున్నాయనగా ఇపుడు వచ్చారని పేర్కొన్నారు. అయినా విద్యార్థుల ఆవేదన నేపథ్యంలో దీనిని పరిలిశీస్తున్నామని, ఆదివారం ఓ నిర్ణయం తీసుకుంటామని శైలజా రామయ్యార్ తెలిపారు.
ఇవి గుర్తుంచుకోండి...
15 నిమిషాల ముందుగానే పరీక్ష హాల్లోకి చేరుకోవాలి.
సెల్‌ఫోన్లు, క్యాలిక్యులేటర్లు, ఇతర ఎలక్ట్రానిక్ వస్తువులను పరీక్ష కేంద్రంలోకి అనుమతించరు.
విద్యార్థులు తమ పేరు, మీడియం, సబ్జెక్టు తదితర వివరాలు ఓఎంఆర్ జవాబు పత్రాల్లో సరిగా ఉన్నాయా? లేదా? చూసుకోవాలి. అది విద్యార్థుల బాధ్యతే.
పొరపాట్లు ఉంటే వెంటనే పరీక్షా కేంద్రంలోని అధికారులకు తెలియజేయాలి. పొరపాట్లు ఉంటే జవాబు పత్రాన్ని మూల్యాంకనం చేయరు.
పరీక్ష పూర్తయ్యాక జవాబు పత్రం ఇన్విజిలేటర్‌కు ఇచ్చినపుడు తమ హాల్‌టికెట్‌ను తిరిగి తీసుకోవడం మర్చిపోవద్దు.
ప్రథమ సంవత్సరంలో కామర్స్, ఎకనామిక్స్, సివిక్స్, హిస్టరీ, పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్, లాజిక్, జియోగ్రఫీ, సోషియాలజీ, సైకాలజీ సబ్జెక్టుల్లో పార్ ్ట-3లో పాత, కొత్త పేపర్లు ఉన్నాయి. ముందుగానే సరిచూసుకోవాలి.
ద్వితీయ సంవత్సరంలో తెలుగు, హిందీ, ఉర్దూ, సంస్కృత ం, అరబిక్, ఫ్రెంచ్, మరాఠి, కన్నడ, ఒరియా భాషల్లోనూ రెండు రకాల పేపర్లు ఉన్నాయి. వాటిని సరిచూసుకోవాలి.
మొదటిసారిగా పరీక్షలు రాస్తున్న విద్యార్థులు కొత్త సిలబస్ పరీక్షలే రాయాలి. మాల్ ప్రాక్టీస్‌కు పాల్పడితే క్రిమినల్ కేసులు తప్పవు.
విద్యార్థులు 8.45 కే పరీక్ష హాల్లో ఉండాలి
‘‘విద్యార్థులు ఉదయం 8:45 గంటలకే పరీక్ష హాల్లో ఉండేలా చూసుకోవాలి. 9 గంటలకు పరీక్ష ప్రారంభం అవుతుంది. ఆ తరువాత విద్యార్థులను అనుమతించరు. 45 నిమిషాలు ముందుగానే పరీక్ష కేంద్రానికి వెళ్లడం మంచిది. ఓఎంఆర్ పత్రాలపై వివరాలను విద్యార్థులు ముందుగానే సరిచూసుకోవాలి’’
- శైలజా రామయ్యార్, ఇంటర్ బోర్డు కార్యదర్శి