కరోనా వ్యాప్తిపై జల్లెడ | Sakshi
Sakshi News home page

కరోనా వ్యాప్తిపై జల్లెడ

Published Fri, Apr 24 2020 3:18 AM

Indian Medical Research Council Decided To Do Rapid Antibody Tests in India - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: దేశాన్ని గడగడలాడిస్తున్న కరోనా వైరస్‌ క్షేత్రస్థాయిలో ఏ మేరకు వ్యాపించిందో తెలుసుకోవడానికి భారతీయ వైద్య పరిశోధన మండలి (ఐసీఎంఆర్‌) శ్రీకారం చుడుతోంది. దేశవ్యాప్తంగా 25 రాష్ట్రాల్లోని 82 జిల్లాల్లో వ్యాధి ఉధృతి, జాడ తెలుసుకునేందుకు ‘ర్యాపిడ్‌ యాంటీ బాడీ టెస్టులు’నిర్వహించనుంది. ఇందులో భాగంగా ఎక్కువ కేసులు, ఓ మాదిరి కేసులు, ఒక్క కేసూ నమోదుకాని లేదా అతితక్కువ కేసులు నమోదైన జిల్లాలను ఎంపిక చేసింది. ఐసీఎంఆర్‌ ఎంపిక చేసిన వాటిలో తెలుగు రాష్ట్రాల నుంచి ఆరు జిల్లాలు ఉన్నాయి. తెలంగాణలో కామారెడ్డి, జనగామ, నల్లగొండ జిల్లాల్లో ఐసీఎంఆర్‌ ఈ నమూనాలను సేకరించనుంది. అలాగే ఆంధ్రప్రదేశ్‌లో కృష్ణా, విజయనగరం, నెల్లూరు జిల్లాల్లో ఈ పరీక్షలు చేపట్టనుంది. ఎంపిక చేసిన జిల్లాలే కాకుండా మిగతా జిల్లాల్లోనూ ఈ పరీ„ýక్షలు నిర్వహించేందుకు ఆయా రాష్ట్రాలకు ఐసీఎంఆర్‌ అనుమతి ఇచ్చింది.

వైరస్‌ సంక్రమణపై ఆరా... 
దేశంలో ఇప్పటివరకు దాదాపు 21 వేల మంది కరోనా బారినపడగా 650 మందికిపైగా మృత్యువాత పడ్డారు. వైరస్‌ సోకిన బాధితుల్లో అధిక శాతం మంది కుటుంబ సభ్యులు, సన్నిహితులే ఉంటున్నారు. అయితే ఇటీవల వెలుగు చూసిన కొన్ని కేసుల్లో ఎలాంటి లక్షణాలు, కాంటాక్టులు లేకుండానే కొందరికి వైరస్‌ సంక్రమించినట్లు తేలింది. దీంతో ఈ వైరస్‌ ఎలా సంక్రమించిందనే విషయమై ఆరా తీసేందుకు ర్యాండమ్‌గా ర్యాపిడ్‌ టెస్టులు నిర్వహించాలని ఐసీఎంఆర్‌ నిర్ణయించింది. తద్వారా కరోనా సామాజిక వ్యాప్తి (కమ్యూనిటీ స్ప్రెడ్‌) చెందిందా లేదా అనే విషయంపై అంచనాకు రావచ్చని భావిస్తోంది. అదే సమయంలో వైరస్‌ సోకిన వారిలోనూ నిరోధకశక్తి బాగా ఉన్న కొందరికి ఎలాంటి చికిత్స లేకుండానే వ్యాధి తగ్గినట్లు తేలిన నేపథ్యంలో అలాంటి వారిని కూడా ఈ నమూనా పరీక్షల ద్వారా గుర్తించే వీలు కలుగుతుంది.

400 మందికి పరీక్షలు.. 
ప్రతి జిల్లాలో 18 ఏళ్లు పైబడిన 400 మందికి ర్యాపిడ్‌ యాంటీబాడీ టెస్టులు నిర్వహించనున్నారు. ఇందుకోసం ఐసీఎంఆర్‌ ఇప్పటికే టెస్ట్‌ కిట్లను పంపింది. ఈ పరీక్షల నిర్వహణకు జిల్లాకు పది వైద్య బృందాలను ఏర్పాటు చేశారు. ఐసీఎంఆర్‌ మార్గనిర్దేశంలో పనిచేసే ఈ బృందాలు 40 మంది చొప్పున నమూనా పరీక్షలు జరుపుతాయి. ఈ బృందాలను సమన్వయపరిచేందుకు ప్రతి జిల్లాకు ఒక కో–ఆర్డినేటర్‌ను నియమించారు. వైద్య పరీక్షల సమాచారాన్ని వెంటనే తమకు పంపాలని ఐసీఎంఆర్‌ ఆదేశించింది. వైద్య పరీక్షల నిర్వహణలో గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో సమ నిష్పత్తి ఉండేలా చూడాలని నిర్దేశించింది. ఈ పరీక్షల అనంతరం దేశవ్యాప్తంగా కరోనా వైరస్‌ ప్రబలుతున్న తీరుపై స్పష్టత ఏర్పడుతుందని, అంతేగాకుండా లాక్‌డౌన్‌ ఎత్తివేత, సడలింపులపైనా ఒక అంచనాకు రాగలుగుతామని కేంద్ర ప్రభుత్వం అంచనా వేస్తోంది.   

Advertisement

తప్పక చదవండి

Advertisement