నేటి నుంచి ఐపీపీబీ

India Post Payment Bank Starts From Today In Khammam - Sakshi

సుజాతనగర్‌ : తపాలా శాఖ సేవలు నేటి నుంచి మరింతగా అందుబాటులోకి రానున్నాయి. ఖాతాదారుల ఇళ్ల వద్దకే బ్యాంకింక్‌ సేవలను తీసుకెళ్లేలా ప్రభుత్వం ఇండియా పోస్ట్‌ పేమెంట్స్‌ బ్యాంకు (ఐపీపీబీ)కి రూపకల్పన చేసింది. ఇందులో భాగంగా నేటి నుంచి దేశవ్యాప్తంగా 650 బ్రాంచీల్లో ఐపీపీబీని ఒకేసారి ప్రారంభించనున్నారు. పోస్టల్‌ సేవలు అందుబాటులో ఉన్న ప్రధాన పోస్టాఫీస్, సబ్‌ పోస్టాఫీస్, బ్రాంచి పోస్టాఫీస్‌ల ద్వారా బ్రాంచ్‌ పోస్ట్‌ మాస్టర్, పోస్ట్‌మన్‌లు ఈ సేవలు అందించనున్నారు. పోస్టాఫీస్‌కు వెళ్లలేని వృద్ధులు, మహిళలు, దివ్యాంగులు, పని ఒత్తిడి ఉండేవారికి ఈ సేవలు మరింతగా ఉపయోగపడనున్నాయి.  

వేలిముద్ర ద్వారా లావాదేవీలు
పోస్టాఫీస్‌లో ఖాతా తెరిచిన వారు వేలిముద్రల ద్వారా ఈ సదుపాయాన్ని పొందవచ్చు. ఇందుకుగాను పోస్టాఫీస్‌లో జీరో అకౌంట్‌ తెరిచేందుకు సెప్టెంబర్‌ 10 వరకు గడువు ఇచ్చారు. తమ ఆధార్, మొబైల్‌ నంబర్లను ఇచ్చి ఖాతాను ప్రారంభించాల్సి ఉంటుంది. ఖాతా ప్రారంభించగానే మొబైల్‌కు ఓటీపీ వస్తుంది. లావాదేవీల అనంతరం వెంటనే సెల్‌కు ఎస్‌ఎంఎస్‌ వస్తుంది. ఇందు లో సేవింగ్స్‌ ఖాతా(ఎస్‌బీ) తెరిచేవారు రూ.100 డిపాజిట్‌ చేయాల్సి ఉంటుంది. కరెంట్‌ ఖాతా తెరవాలనుకున్నవారు రూ.1000 డిపాజిట్‌ చేయాలి. సేవింగ్స్‌ ఖాతాలో రూ.ఒక లక్ష వరకు డిపాజిట్‌ చేసుకునే సౌకర్యం ఉంది. అంతకంటే ఎక్కువగా డిపాజిట్‌ చేయాలనుకునేవారు దీనికి అనుబం ధంగా మరో ఖాతాను తెరవాల్సిఉంటుంది.

సేవలు ఇలా..
ఇండియా పోస్ట్‌ పేమెంట్స్‌ బ్యాంకు ద్వారా ఖాతాదారులు అనేక రకాల సేవలు ఇంటివద్దనుంచే పొందే వీలుంది. తమఖాతా నుంచి నగదును తీసుకోవాలంటే కేటాయించిన నంబర్‌కు ఫోన్‌ చేసి ఎంత కావాలో చెపితే ఆ మొత్తాన్ని ఇంటికే తీసుకొస్తారు. సంబందిత పరికరం సహాయంతో వేలిముద్ర ద్వారా ఖాతా నుంచి నగదును చెల్తిస్తారు. గరిష్టంగా రూ.20 వేల వరకు ఇంటి వద్దకే తీసుకొస్తారు. అంతకంటే ఎక్కువ కావాలనుకుంటే వారు పోస్టాఫీస్‌కు వెళ్ళాల్సిందే. ఖాతాదారులకు ఇచ్చే క్యూఆర్‌ (క్విక్‌ రెస్పాన్స్‌) కార్డు స్కాన్‌ చేయడం ద్వారా నగదు బదిలీ చేసుకోవచ్చు. ఖాతాదారులు విద్యుత్, ఫోన్, తదితర బిల్లులు చెల్లింపులు చేసుకోవచ్చు.

నెఫ్ట్, ఆర్‌టీజీఐ, ఐఎంపీఎస్‌ వంటి చెల్లింపులు చేయవచ్చు. మొబైల్‌ బ్యాంకింగ్‌ సదుపాయం కూడా అవకాశం ఉంది. ఎస్‌ఎంస్, మిస్డ్‌కాల్‌ బ్యాంకింగ్‌ సేవలు కూడా ఉన్నాయి. కేంద్ర ప్రభుత్వం అందించే వివిధ రాయితీలు, పథకాల చెల్లింపులు, విద్యార్ధులకు చెల్లించే స్కాలర్‌షిప్‌లు కూడా ఈ ఖాతాల ద్వారా జరిపే అవకాశాలు ఉన్నాయి. చిరువ్యాపారులు, కిరాణ వర్తకులు, రైతులు క్యూఆర్‌ కార్డు ద్వారా నగదు రహిత సేవలను పొందవచ్చు. ప్రయాణంలో నగదు భద్రతపై ఎలాంటి దిగులు ఉండదు. ఎరువులు, విత్తనాల కొనుగోలుకు క్యూఆర్‌ కార్డును వినియోగించవచ్చు. రుణాలూ పొందవచ్చు.   

రెండో దశలో అవకాశం
ఇండియా పోస్ట్‌ పేమెంట్స్‌ బ్యాంకు సదుపాయం మొదటి దశలో ఖమ్మం టౌన్‌ పరిధిలోని 11 సబ్‌ పోస్టాఫీస్‌లు, ఒక హెడ్‌ ఆఫీస్, 02 బ్రాంచ్‌ ఆఫీసులు మొత్తం 13 పోస్టాఫీస్‌లకు మాత్రమే ఇచ్చారు. రెండవ దఫాలో మరో 1000 పోస్టాఫీస్‌లకు ఈ అవకాశం కల్పిస్తారు. అప్పుడు భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని కొన్ని పోస్టాఫీసుల్లో ఐపీపీబి సదుపాయం అందుబాటులోకి వస్తుంది.  
–టి.శివరామ ప్రసాద్, కొత్తగూడెం హెడ్‌ పోస్ట్‌ మాస్టర్‌

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top