దేవరకద్రలో ఎక్కువ.. పాలమూరులో తక్కువ!

Increasing And Decreasing Votes CountsOf Devarakadra And Palamur - Sakshi

  అత్యధికంగా దేవరకద్రలో పోలింగ్‌ శాతం నమోదు 

  84.6 శాతం ఓటింగ్‌ నమోదైనట్లు వెల్లడి 

  మహబూబ్‌నగర్‌లో 73.5 శాతమే..  

మహబూబ్‌నగర్‌ న్యూటౌన్‌ / దేవరకద్ర : జిల్లాలోని ఐదు నియోజకవర్గాల్లో పోలిస్తే దేవరకద్రలో అత్యధికంగా పోలింగ్‌ నమోదైంది. ఈ నియోజకవర్గంలో 84.6 శాతం పోలింగ్‌ నమోదైనట్లు అధికారులు వెల్లడించారు. ఇక ఐదు నియోజకకవర్గాల్లో పోలిస్తే అతి తక్కువగా మహబూబ్‌నగర్‌లో 73.5 శాతం నమోదైంది. కాగా, రెండో స్థానంలో జడ్చర్ల నియోజకవర్గంలో 82 శాతం, నారాయణపేటలో 80.7 శాతం పోలింగ్‌ నమోదు కాగా.. మక్తల్‌ 77.7 శాతం పోలింగ్‌తో నాలుగో స్థానంలో నిలిచింది. ఇక దేవరకద్ర నియోజకవర్గంలోని పలు కేంద్రాల్లో రాత్రి 8.10 గంటల వరకు పోలింగ్‌ కొనసాగింది. సాయంత్రం 5 గంటల వరకు 76 శాతం పోలింగ్‌ నమోదైనట్లు అధికారులు వెల్లడించారు. అప్పటికే పలు పోలింగ్‌ కేంద్రాలకు ఓటర్లు చేరుకుని ఉండడంతో టోకెన్లు జారీ చేశారు.

భూత్పూర్‌ మండలంలోని 28, 36 కేంద్రాలకు చివరి నిముషాల్లో ఇతర ప్రాంతాల ఉండే ఓటర్లు రావడంతో పోలింగ్‌ రాత్రి వరకు కొనసాగింది. ఈ మండలంలోని 28వ పోలింగ్‌ కేంద్రంలో 82 శాతం, 36వ కేంద్రంలో 86 శాతం పోలింగ్‌ నమోదైంది. ఇక చిన్నచింతకుంట మండలంలోని 160, 191 పోలింగ్‌ కేంద్రాల్లో కూడా రాత్రి వరకు పోలింగ్‌ జరిగింది. తద్వారా చివరకు ఈ నియోజకవర్గం 84.6 శాతం పోలింగ్‌తో జిల్లాలోనే అగ్రస్థానంలో నిలిచింది. ఇక జడ్చర్ల నియోజకవర్గం రాజాపూర్‌ మండలంలోని పలు కేంద్రాల్లో కూడా 6 గంటల వరకు పోలింగ్‌ కొనసాగింది. కాగా, పోలింగ్‌ ఆలస్యం కావడానికి ఓటర్లు చివరి సమయంలో ఎక్కువగా రావడం ఓ కారణమైతే.. మరికొన్ని కేంద్రాల్లో ఈవీఎంలు మొరాయించడం ఇంకో కారణంగా చెబుతున్నారు. 
పట్టణ ప్రాంతమైనా.. 
మహబూబ్‌నగర్‌ నియోజకవర్గ కేంద్రం జిల్లా కేంద్రంగా కూడా ఉంది. ఇక్కడ విద్యావంతులు, ఉద్యోగులే ఎక్కువ. అయినప్పటికీ జిల్లాలోనే తక్కువ పోలింగ్‌ శాతం నమోదు కావడం గమనార్హం. ఈసారి ఎలాగైనా పోలింగ్‌ శాతం పెంచాలన్న లక్ష్యంతో అధికారులు అనేక చర్యలు చేపట్టారు. అవగాహన సదస్సులు, చైతన్య ర్యాలీలు చేయించడంతో పాటు ఫ్లెక్సీలు, వీడియోల ద్వారా విస్తృతంగా ప్రచారం చేశారు. అయినప్పటికీ ఈ నియోజకవర్గంలోనే జిల్లాలోని అన్ని నియోజకవర్గాల్లో పోలిస్తే తక్కువ పోలింగ్‌ శాతం నమోదు కావడం విస్మయాన్ని కలిగిస్తోంది. 

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top