అజ్ఞాతం వీడిన రామన్న.. పార్టీ మార్పుపై క్లారిటీ | Im Not Change Party Say Former Minister Jogu Ramanna | Sakshi
Sakshi News home page

అజ్ఞాతం వీడిన రామన్న.. పార్టీ మార్పుపై క్లారిటీ

Sep 10 2019 11:58 AM | Updated on Sep 10 2019 12:56 PM

Im Not Change Party Say Former Minister Jogu Ramanna - Sakshi

సాక్షి, ఆదిలాబాద్‌:  రాష్ట్ర మంత్రివర్గ విస్తరణలో చోటు దక్కకపోవడంతో అసంతృప్తి గురైన మాజీ మంత్రి.. ఆదిలాబాద్‌ ఎమ్మెల్యే జోగు రామన్న అజ్ఞాతం వీడారు. ఆదివారం మంత్రివర్గ విస్తరణ అనంతరం కనిపించకుండాపోయిన ఆయన మంగళవారం నాడు మీడియా ముందుకు వచ్చారు. ‘నేను అజ్ఞాతంలోకి వెళ్లలేదు. మంత్రిపదవి రాకపోవడంతో మినిస్టర్ క్వార్టర్స్ ఖాళీ చేస్తున్నాం. రెండు రోజులుగా నా పిల్లలు ఆ పనిలో ఉన్నారు. నాకు కొంత ఆరోగ్యం బాగాలేక, లోబీపీ వల్ల రెస్ట్ తీసుకుందాం అని స్నేహితుడు ఇంటికి వెళ్ళాను. మంత్రి పదవి దక్కలేదని అలగలేదు. పార్టీ మరే ప్రసక్తే లేదు. చివరి వరకూ టీఆర్‌ఎస్‌లోనే ఉంటా. మా నాయకుడు, ముఖ్యమంత్రి కేసీఆర్ నాకు మంచి గౌరవం కల్పించారు. గత ప్రభుత్వంలో మంతత్రిగా ప్రజలకు సేవ చేసే అవకాశం లభించింది. కేసీఆర్‌కు ఎప్పటికీ రుణపడి ఉంటా’ అని వ్యాఖ్యానించారు.

కాగా ఆదివారం ఉదయం హైదరాబాద్‌ వెళ్లిన ఆయన.. కేబినెట్‌ విస్తరణ అనంతరం అదేరాత్రి మినిస్టర్‌ క్వార్టర్స్‌లో ఉన్నారు. సోమవారం ఉదయం నుంచి ఎవరికీ అందుబాటులో లేకుండాపోయిన విషయం తెలిసిందే.  గన్‌మెన్‌లను, డ్రైవర్‌ను, చివరికి వాహనాన్ని కూడా క్వార్టర్స్‌ వద్దే ఉంచి ఆయన చెప్పా పెట్టకుండా అజ్ఞాతంలోకి వెళ్లారు. ఆయన మొబైల్‌ఫోన్‌ స్విచ్‌ ఆఫ్‌ వస్తుండడంతో సమాచారం తెలియలేదు. కుటుంబ సభ్యులు కూడా ఎటువెళ్లారో తెలీదని చెప్పడంతో రామన్న అనుచరుల్లో గతరెండు రోజులు ఆందోళనకు గురయ్యారు. తాజాగా ఆయన బయటకు రావడంతో అంతా ఊపిరిపీల్చుకున్నారు.

మనస్తాపం..
టీఆర్‌ఎస్‌ సర్కార్‌ తొలిసారి అధికారంలోకి వచ్చిన తర్వాత జోగు రామన్నకు రాష్ట్ర అటవీ, పర్యావరణ, బీసీ సంక్షేమ శాఖ అమాత్య పదవిని కట్టబెట్టారు. ముందస్తు ఎన్నికల్లో భాగంగా సర్కార్‌ను రద్దుచేసే వరకూ ఆయన మంత్రిగా కొనసాగారు. ఆ సమయంలో ఉమ్మడి జిల్లా నుంచి జోగు రామన్నతోపాటు ఇంద్రకరణ్‌రెడ్డి కూడా మంత్రిగా ఉన్నారు. రెండోసారి అధికారంలోకి వచ్చిన టీఆర్‌ఎస్‌ మొదటి మంత్రివర్గ విస్తరణలోనే అమాత్య పదవి వస్తుందని జోగు రామన్న గంపెడాశలు పెట్టుకున్నారు. కానీ.. ఉమ్మడి జిల్లా నుంచి నిర్మల్‌ ఎమ్మెల్యే అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డిని మాత్రమే మంత్రి పదవి వరించింది. ఈ క్రమంలో మలివిడతలో తనకు తప్పకుండా మంత్రి పదవి వస్తుందని రామన్న ఆశించారు. ఆ మేరకు అధినేత కూడా తనకు భరోసా ఇచ్చారని తన అనుచరుల వద్ద వ్యక్తం చేశారు. మున్నూరు కాపు సామాజిక వర్గానికి చెందిన ఈయన మంత్రివర్గ కూర్పులో పేరుంటుందని భరోసా పెట్టుకున్నారు. అదే సామాజిక వర్గానికి చెందిన కరీంనగర్‌ ఎమ్మెల్యే గంగుల కమలాకర్‌కు మంత్రి పదవి రావడం, రామన్నకు చుక్కెదురు కావడంతో ఆయన తీవ్ర మనస్తాపం చెందినట్లు సమాచారం. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement