‘రేషన్‌’కు రెక్కలు

illegal Trade Of PDF Rice Seized In Medak - Sakshi

సాక్షి, మెదక్‌ : అక్రమాలకు తావు లేకుండా ఈ–పాస్‌ విధానాన్ని అమలు చేస్తున్నా.. పేదలకు అందాల్సిన రేషన్‌ బియ్యం పక్కదారి పడుతున్నాయి. పలువురు అక్రమార్కులు మాఫియాగా ఏర్పడి పీడీఎస్‌ రైస్‌ను ఇతర రాష్ట్రాలకు తరలిస్తున్నారు. సివిల్‌ సప్లయీస్‌ శాఖ పట్టింపులేని తనం.. ఎన్‌ఫోర్స్‌మెంట్‌ అధికారుల వైఫల్యం.. అక్రమార్కులకు కాసుల వర్షం కురిపిస్తోంది. అయినప్పటికీ ఉన్నతాధికారులు పట్టించుకోకపోవడంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

పక్కదారి పడుతున్న పీడీఎస్‌ బియ్యం
 రేషన్‌ బియ్యం దందా జిల్లాలో మూడు పువ్వులు.. ఆరు కాయలు అన్నట్లుగా సాగుతోంది. దారిద్య్ర రేఖకు దిగువన ఉన్న పేద, మధ్యతరగతి వర్గాలు మూడు పూటలా అన్నం తినేలా రూపాయికి కిలో చొప్పున బియ్యం అందజేసే ఆహార భద్రత పథకం అధికారుల నిర్లక్ష్యంతో అభాసుపాలవుతోంది. అక్రమార్కులు యథేచ్ఛగా దందా నడిపిస్తూ రేషన్‌ బియ్యాన్ని రాష్ట్ర సరిహద్దులు దాటిస్తున్నారు. పొరుగు రాష్ట్రాల్లో అధిక ధరలకు విక్రయిస్తూ సొమ్ము చేసుకుంటున్నారు. 

అధికారులకు మామూళ్ల ఎర..
జిల్లా పరిధిలోని 20 మండలాల్లో మొత్తం 521 రేషన్‌ దుకాణాలు ఉన్నాయి. జిల్లాలో ఆహార భద్రత కార్డులు 2,01,100 ఉండగా.. కిలోకు రూపాయి చొప్పున ఒక్కొక్కరికి ఆరు కిలోల చొప్పున బియ్యం అందజేస్తున్నారు. అంత్యోదయ కార్డులు 13,013 ఉండగా.. వారికి 35 కిలోలు ఇస్తున్నారు. అన్నపూర్ణ కార్డుదారులు 84 మంది ఉండగా.. వారికి ఉచితంగా ఒక్కొక్కరికి పది కిలోల చొప్పున రేషన్‌ బియ్యాన్ని ప్రతి నెలా పంపిణీ చేస్తున్నారు. ఈ మేరకు ప్రభుత్వం ప్రతి నెలా 4,432.173 మెట్రిక్‌ టన్నుల బియ్యాన్ని సరఫరా చేస్తోంది. బియ్యం దొడ్డుగా ఉండడం, జీర్ణం కాకపోవడంతో చాలా మంది వాటిని తినేందుకు ఆసక్తి చూపడం లేదు. దీన్ని ఆసరాగా చేసుకున్న అక్రమార్కులు గ్రామాలు, మండలాలు, జిల్లాల వారీగా సిబ్బందిని నియమించుకుని పీడీఎస్‌ బియ్యాన్ని పక్కదారి పట్టిస్తున్నారు. అవినీతికి అలవాటు పడ్డ పలువురు సివిల్‌ సప్లయీస్, ఎన్‌ఫోర్స్‌మెంట్, పోలీస్‌ అధికారులు, సిబ్బందికి నెలవారీగా మామూళ్ల ఎర వేసి.. వారి అండదండలతో తమ అక్రమ వ్యాపారాన్ని నిరాటంకంగా కొనసాగిస్తున్నారు.

దందా సాగుతుందిలా..
అక్రమార్కులు నియమించుకున్న వారు.. డబ్బు ఆశతో దళారులుగా మారిన కొందరు గ్రామంలో ఇంటింటా తిరుగుతూ రేషన్‌ బియ్యాన్ని సేకరిస్తున్నారు. కిలోకు రూ.ఏడు నుంచి రూ.ఎనిమిదితో కొనుగోలు చేసి.. ఓ చోట డంప్‌ చేస్తున్నారు. వారి స్థోమతను బట్టి వివిధ రకాల వాహనాల ద్వారా మండల కేంద్రానికి తరలిస్తున్నారు. ఆ తర్వాత రాత్రి 9 నుంచి 11 మధ్యలో గానీ.. తెల్లవారు జాము నాలుగు నుంచి ఆరు గంటల సమయంలో గానీ ఎంచుకున్న చోటుకు పంపిస్తున్నారు. ఈ విధంగా చేయడం వల్ల గ్రామం, మండలంలో రేషన్‌ సేకరించిన వారికి కిలోకు రూ.12 నుంచి రూ.15 సమకూరుతున్నాయి. పెద్దమొత్తంలో పీడీఎస్‌ రైస్‌ జమ అయిన తర్వాత లారీ, డీసీఎం వాహనాల్లో అక్రమార్కులు పొరుగు రాష్ట్రానికి తరలిస్తున్నట్లు విశ్వసనీయవర్గాల ద్వారా తెలిసింది. ప్రధానంగా తూప్రాన్‌ , నర్సాపూర్, మెదక్‌ పట్టణ శివారు ప్రాంతాల కేంద్రంగా పీడీఎస్‌ బియ్యం ఇతర రాష్ట్రాలకు తరలుతున్నట్లు సమాచారం.

50 శాతం మహారాష్ట్రకు..
జిల్లావ్యాప్తంగా గ్రామాల్లోని డీలర్లు, లబ్ధిదారుల నుంచి సేకరించిన రేషన్‌ బియ్యంలో సుమారు 50 శాతానికి పైగా మహారాష్ట్రకు తరలుతున్నట్లు తెలుస్తోంది. మహారాష్ట్రలోని నాగపూర్, వీరూర్‌లో బియ్యం దందా జోరుగా సాగుతున్నట్లు సమాచారం. అక్కడ కిలో బియ్యానికి రూ.50 నుంచి రూ.65 వరకు పలుకుతోంది. బియ్యానికి బదులుగా గోధుమలు, చక్కెర, తెల్ల జొన్నలు ఇస్తారు. ఈ నేపథ్యంలో జిల్లా నుంచి అక్రమార్కులు మాఫియాగా ఏర్పడి దందా నడిపిస్తున్నట్లు తెలిసింది. డీసీఎంలు, లారీల్లో రెండు, మూడు రోజులకోసారి అక్కడికి వేల క్వింటాళ్ల మేర రేషన్‌ బియ్యాన్ని తరలించి సొమ్ము చేసుకుంటున్నట్లు విశ్వసనీయ వర్గాల ద్వారా తెలిసింది.  

ఫలితం ఇవ్వని ఈ–పాస్‌.
రేషన్‌ బియ్యం పంపిణీలో అక్రమాలను అరికట్టేందుకు రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వం ఈ–పాస్‌ విధానాన్ని అమలు చేస్తోంది. కార్డుదారుడు తన వేలిముద్ర పెడితే తప్ప బియ్యం ఇచ్చేందుకు అవకాశం లేదు. కొంతమంది వేలిముద్రలు పడుతలేవనే కారణంలో డీలర్లు మ్యానువల్‌ అందజేస్తున్నారు. ఈ క్రమంలో డీలర్లు మాయ చేస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. 

విచారణ చేపట్టి చర్యలు తీసుకుంటాం 
రేషన్‌ బియ్యం అక్రమ తరలింపుపై ఇప్పటి వరకు ఎలాంటి సమాచారం మా దృష్టికి రాలేదు. అక్రమ బియ్యం సరఫరాను ఉపేక్షించేది లేదు. అలాంటి వాటిపై ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లి విచారణ జరిపి చర్యలు తీసుకుంటాం.
– సాధిక్, సివిల్‌సప్‌లై, డిప్యూటీ తహసీల్దార్, మెదక్‌  

అక్రమార్కుల దందా ఇలా..
► ఇంటింటా సేకరించే బియ్యం (కిలోకు)  రూ.7 నుంచి రూ.8
► మిల్లర్లు లేదా మాఫియాకు అమ్మకం (కిలోకు)  రూ.12 నుంచి రూ.15
► మహారాష్ట్రలో అమ్మగా వచ్చే సొమ్ము (కిలోకు)  రూ.50 నుంచి రూ.65  

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top