అనుమతులా.. మాకెందుకు..? | Illegal Registrations In Sub Registrar Office At Suryapet | Sakshi
Sakshi News home page

అనుమతులా.. మాకెందుకు..?

Published Wed, Mar 4 2020 9:39 AM | Last Updated on Wed, Mar 4 2020 9:39 AM

Illegal Registrations In Sub Registrar Office At Suryapet - Sakshi

సాక్షిప్రతినిధి, సూర్యాపేట: ‘నూతన మున్సిపల్‌ చట్టం మాకు వర్తించదు.. లే అవుట్, ఎల్‌ఆర్‌ఎస్‌ ఏ అనుమతి లేకున్నా ఫర్వాలేదు. బై నంబర్లతో సర్వే నంబర్లు ఉన్నా చాలు.. ఎంచక్కా రిజిస్ట్రేషన్‌ చేస్తాం.’ ఇదీ సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయాల్లో లే అవుట్‌ లేని వెంచర్లలో ప్లాట్లకు అధికారికంగా రిజిస్ట్రేషన్‌ చేస్తున్న వ్యవహారం. సూర్యాపేట సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయాన్ని కలెక్టర్‌ టి.వినయ్‌కృష్ణారెడ్డి మంగళవారం ఆకస్మిక తనిఖీ చేయడంతో ఇది బయట పడింది. మున్సిపల్‌ కమిషనర్‌ ఫలానా వెంచర్లకు లే అవుట్, ఎల్‌ఆర్‌ఎస్‌ అనుమతి లేదని లేఖ ఇచ్చినా ఎలా రిజిస్ట్రేషన్‌ చేశారని సబ్‌ రిజిస్ట్రార్‌ను ప్రశ్నించారు.

పుట్టగొడుగుల్లా వెంచర్లు..
జిల్లాలోని మున్సిపాలిటీల పరిధిలో పుట్టగొడుగుల్లా వెంచర్లు వెలిశాయి. సూర్యాపేట, కోదాడ, హుజూర్‌నగర్, నేరేడుచర్ల, తిరుమలగిరి మున్సిపాలిటీల్లో ఇటీవల రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారం జోరందుకుంది. గత ఏడాది సమీప గ్రామాలను మున్సిపాలిటీల్లో విలీనం చేశారు. ఇప్పుడు ఈ గ్రామాల్లో ఎక్కడ పడితే అక్కడ వెంచర్లు ఏర్పాటు చేస్తున్నారు. సూర్యాపేట పట్టణానికి సమీపంలో కుడకుడ రోడ్డు, హైదరాబాద్‌ రోడ్డు, జనగాం రోడ్డు, కోదాడ రోడ్డు, కోదాడలో ఖమ్మం, విజయవాడ రోడ్డు, మునగాల రోడ్డు, హుజూర్‌నగర్, నేరేడుచర్లలో మిర్యాలగూడ రోడ్డులో, తిరుమలగిరి మున్సిపాలిటీ పరిధిలో జనగామ, సూర్యాపేట రోడ్డులో వెంచర్లు వెలిశాయి. అయితే మున్సిపాలిటీ నుంచి ఎలాంటి అనుమతులు తీసుకోకుండానే రియల్టర్లు వెంచర్లు చేస్తుండడం గమనార్హం. మున్సిపల్‌ అధికారులు పలుమార్లు అక్రమ వెంచర్లపై కొరడా ఝుళిపించి ఈ వెంచర్లలో ప్లాట్ల హద్దు రాళ్లను జేసీబీలతో తీయించినా మళ్లీ కొన్నాళ్లకే రియల్టర్లు హద్దురాళ్లు పెడుతున్నారు.

నూతన మున్సిపల్‌ చట్టం అస్త్రం ప్రయోగించినా..
అనుమతులు లేకున్నా రియల్టర్లు ప్లాట్లు చేస్తుండడంతో మున్సిపల్‌ అధికారులు కొత్త మున్సిపల్‌ చట్టాన్ని అస్త్రంగా చేసుకున్నారు. 2019 జూలైలో తెలంగాణ నూతన మున్సిపల్‌ చట్టం ప్రకారం లే అవుట్, ఎల్‌ఆర్‌ఎస్‌ అనుమతి లేని ప్లాట్లను సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయాల్లో రిజిస్ట్రేషన్‌ చేయవద్దు. అనుమతి లేని ప్లాట్లలో భవనాలు నిర్మించినా రిజిస్ట్రేషన్‌ చేయవద్దని ఈ చట్టం స్పష్టం చేస్తుంది. దీని ప్రకారం జిల్లాలోని మున్సిపల్‌ కమిషనర్లు తమ పరిధిలో అక్రమ వెంచర్ల జాబితాను సర్వే నంబర్లతో సహా సబ్‌ రిజిస్ట్రార్లకు పంపారు. అయినా ఇక్కడ అక్రమ తంతుకు అడ్డుకట్ట పడలేదు. కొత్త మున్సిపల్‌ చట్టం అమలుకు తిలోదకాలిచ్చి సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయాల్లో యథేచ్ఛగా అక్రమ వెంచర్ల ప్లాట్లు రిజిస్ట్రేషన్లు జరుగుతున్నాయి. లే అవుట్, ఎల్‌ఆర్‌ఎస్‌ లేకుంటే మా కెందుకు..? ఆదాయమే పరమావధిగా రిజిస్ట్రేషన్లు చేస్తున్నారు. కొందరు రియల్టర్లు సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయాల్లో అధికారుల చేతులు తడిపి మరీ హడావుడిగా రిజిస్ట్రేషన్లు చేయించుకుంటున్నట్లు ఆరోపణలున్నాయి.

అక్రమ వెంచర్లను పరిశీలించిన అనంతరం మున్సిపల్‌ అధికారులతో మాట్లాడుతున్న కలెక్టర్‌  వినయ్‌కృష్ణారెడ్డి

కలెక్టర్‌ తనిఖీతో బయటపడిన అక్రమ రిజిస్ట్రేషన్ల వ్యవహారం..
లే అవుట్, ఎల్‌ఆర్‌ఎస్‌ లేకుండా సూర్యాపేట మున్సిపాలిటీ పరిధిలో ఉన్న 36 వెంచర్లలో జేసీబీలతో ప్లాట్ల హద్దు రాళ్లను తొలగించారు. వీటిని కలెక్టర్‌ మున్సిపల్‌ అధికారులతో కలిసి పరిశీలించారు. ఈ వెంచర్లలో ప్లాట్లను రిజిస్ట్రేషన్లు చేశారా..? అని మున్సిపల్‌ అధికారులను ఆరా తీసిన కలెక్టర్‌ వెంటనే సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయాన్ని ఆకస్మిక తనిఖీ చేశారు. నూతన మున్సిపాలిటీ చట్టం ప్రకారం లే అవుట్, ఎల్‌ఆర్‌ఎస్‌ అనుమతి లేకుండా 36 వెంచర్లు వెలిశాయని వీటిలోని ప్లాట్లు రిజిస్ట్రేషన్‌ చేయవద్దని గత ఏడాడి నవంబర్‌ నుంచి మున్సిపల్‌ కమిషనర్‌ మూడు సార్లు సబ్‌ రిజిస్ట్రార్‌కు లేఖలు పంపారు. ఆయా వెంచర్ల సర్వే నంబర్లు, ఎంత విస్తీర్ణం అన్నది కూడా ఈ లేఖలో పేర్కొన్నారు.

మున్సిపల్‌ కమిషనర్‌ లేఖ ఇచ్చిన తర్వాత కూడా ఈ సర్వే నంబర్లలో రెండు ప్లాట్ల రిజిస్ట్రేషన్‌ ఎలా చేశారని కలెక్టర్‌.. సబ్‌ రిజిస్ట్రార్‌ను ప్రశ్నించారు. ఒక సర్వే నంబర్‌కు అనుమతి లేదని ఇస్తే.. అదే సర్వే నంబర్‌కు బై నంబర్లు వేసి రిజిస్ట్రేషన్‌ చేసినట్లు కలెక్టర్‌ తనిఖీలో బయటపడింది. ఇలా అనుమతి లేని వెంచర్లలో ప్లాట్లు రిజిస్ట్రేషన్‌ చేసిన వ్యవహారంపై కలెక్టర్‌ రిజిస్ట్రేషన్‌ శాఖ ఉన్నతాధికారులకు లేఖ రాయనున్నట్లు సమాచారం. నూతన మున్సిపల్‌ చట్టాన్ని పక్కన పెట్టి సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయాల్లో ఇష్టారీతిన వ్యవహరిస్తున్న తీరుపై ఆ శాఖ ఉన్నతాదికారులు కింది స్థాయి అధికారులకు ఇప్పటికే మొట్టికాయలు వేసినట్లు తెలిసింది.

లే అవుట్‌ ఉంటనే రిజిస్ట్రేషన్‌ చేయాలి 
2019 జూలైలో వచ్చిన నూతన మున్సి\ పల్‌ చట్టానికి అనుగుణంగా లే అవుట్లకు అనుమతి తీసుకోవాలి. మున్సిపాలిటీ నుంచి అనుమతి వచ్చిన లే అవుట్లకు మాత్రమే సబ్‌ రిజిస్ట్రార్లు రిజిస్ట్రేషన్లు చేయాలి. లే అవుట్‌ అనుమతి లేకున్నా కనీసం ఎల్‌ఆర్‌ఎస్‌ కచ్చితంగా ఉండాలి. సూర్యాపేట మున్సిపాలిటీ పరిధిలో 36 అనుమతి లేని వెంచర్లు ఉన్నట్లు ప్రస్తుతం గుర్తించాం. ఈ ప్రక్రియ ఇంకా కొనసాగుతోంది. కలెక్టరేట్‌లో ఒక టీంను ఏర్పాటు చేసి అన్ని మున్సిపాలిటీల్లో అనుమతి లేని వెంచర్లు గుర్తిస్తాం. సాధారణ ప్రజలకు ఇబ్బందులు కలగకుండా చట్ట ప్రకారం లే అవుట్లకు అనుమతి ఇస్తాం. మున్సిపాలిటీ అనుమతి లేనిదే రిజిస్ట్రేషన్లు చేయొద్దు.
– టి.వినయ్‌కృష్ణారెడ్డి, కలెక్టర్‌

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement
Advertisement
 
Advertisement
Advertisement