ప్రైవేటు రవాణావైపే మొగ్గు

IIT Bombay Survey On Transportation In Hyderabad - Sakshi

మార్చి మూడో వారం నుంచే మొదలైన జాగ్రత్తలు

లాక్‌డౌన్‌కు ముందే ఇళ్లకే పరిమితమైన జనాలు

ఐఐటీ హైదరాబాద్, ఐఐటీ బాంబే సర్వేలో వెల్లడి  

సాక్షి, హైదరాబాద్‌: లాక్‌డౌన్‌తో ఉద్యోగ, ఉపాధి అవసరాల కోసం రోజూవారీగా రాకపోకలు సాగించే వారిపై కరోనా ప్రమాద తీవ్రత తగ్గిందని ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీ నిర్వహించిన ఆన్‌లైన్‌ సర్వేలో వెల్లడైంది. దేశవ్యాప్తంగా లాక్‌డౌన్‌ ప్రకటించడానికి ముందు మార్చి మూడో వారంలో ప్రయాణికులు రాకపోకలు సాగించిన తీరుపై ఐఐటీ హైదరాబాద్, ఐఐటీ బాంబే సంయుక్త సర్వే నిర్వహించాయి. కరోనా లక్షణాలు బయటపడుతున్న సమయంలో ప్రయాణికులు తమ రాకపోకల్లో చేసుకున్న మార్పులకు ఈ సర్వే ఫలితాలు అద్దం పడుతున్నాయి. ఆన్‌లైన్‌ ప్రశ్నావళి ద్వారా దేశవ్యాప్తంగా 1,900 మందిని సర్వే చేసినట్లు ఐఐటీ విద్యార్థి బృందం ప్రకటించింది. ఇక ద్వితీయ, తృతీయ శ్రేణి నగరాలతో పోలిస్తే ప్రథమ శ్రేణి నగరాల్లో కరోనాపై ఎక్కువ అవగాహన ఉన్నట్లు సర్వేలో తేలింది. నిరుపేదలకు కరోనాపై అవగాహన కల్పించాల్సిన అవసరాన్ని కూడా సర్వే నొక్కి చెప్పింది..

సర్వేలో వెల్లడైన విషయాలు.. 
► దేశంలో కరోనా లక్షణాలు బయట పడుతున్న సందర్భంలో మార్చి మూడో వారంలో రెగ్యులర్‌గా రాకపోకలు సాగించే ప్రయాణికులు చాలా మంది ప్రజారవాణా వ్యవస్థకు బదులుగా ప్రైవేటు రవాణా వ్యవస్థ వైపు మొగ్గు చూపారు. ప్రథమ శ్రేణి పట్టణాల్లో 12 శాతం, ద్వితీయ శ్రేణి పట్టణాల్లో 9 శాతం, తృతీయ శ్రేణి పట్టణాల్లో 7 శాతం మంది ప్రజా రవాణా వ్యవస్థను వదిలేసి ప్రైవేటు రవాణా వ్యవస్థలో ప్రయాణించారు. 
► లాక్‌డౌన్‌ ప్రకటనకు ముందు మార్చి మూడో వారంలో 48 శాతం మంది ఉద్యోగాలకు వెళ్లకుండా ఇంటికే పరిమితం కాగా, 28 శాతం మంది మాత్రం ఎప్పటిలాగానే తమ విధులకు హాజరయ్యారు. మరో 24 శాతం మంది మాత్రం వారానికి రెండు, మూడు మార్లు మాత్రమే విధులకు వెళ్లి వచ్చారు. 
► కరోనా భయంతో మార్చి మూడో వారంలో 18 శాతం మంది విమాన ప్రయాణాలను రద్దు చేసుకున్నారు. మరో 20.2 శాతం రైలు ప్రయాణాలు, 11.6 శాతం మంది బస్సు ప్రయాణాలు రద్దు చేసుకున్నట్లు సర్వేలో తేలింది. 
► ప్రస్తుత పరిస్థితుల్లో ప్రజా రవాణా వ్యవస్థ కంటే ప్రైవేటు వాహనాల్లో ప్రయాణం సురక్షితం అని 93 శాతం మంది అభిప్రాయం వ్యక్తం చేశారు. ఇటు లాక్‌డౌన్‌కు ముందు ఏ తరహా వాహనాల్లో రాకపోకలు ఎక్కువగా సాగాయి. ట్రాఫిక్‌ రద్దీపై ప్రభావం వంటి అంశాలపైనా వివరాలు సేకరించినట్లు సర్వే బృందం వెల్లడించింది. 

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top