పానీకి పట్టం

Hyderabad People Wasting Water in Lockdown Time - Sakshi

కోర్‌సిటీకి తలసరిగా నిత్యం 135 లీటర్లు..

శివార్లలో ఒక్కో వ్యక్తికి 100 లీటర్ల సరఫరా

నీటి నాణ్యతపై జలమండలి ప్రత్యేక దృష్టి

కొరత ఉన్న ప్రాంతాలకు అదనపు ట్యాంకర్లు  

ఫిల్టర్‌ప్లాంట్ల నీటి విక్రయాలపై నియంత్రణ కరువు

శివార్లలో యథేచ్ఛగా ట్యాంకర్‌ మాఫియా దందా

లాక్‌డౌన్‌తో ఇళ్లకే పరిమితమైన ప్రజలు

నీళ్లు బాగా తాగితే మంచిదంటున్న వైద్యులు

సాక్షి, సిటీబ్యూరో: లాక్‌డౌన్‌ నేపథ్యంలో గ్రేటర్‌ సిటీజన్లు ఇళ్లకే పరిమితం కావడంతో నీటి వినియోగం అనూహ్యంగా పెరిగింది. వేసవి కావడం, ఇంట్లో ఉన్నా అధికంగా నీళ్లు తాగితేనే ఆరోగ్యానికి మంచిదని, రోగ నిరోధక శక్తి పెరుగుతుందని వైద్యులు సూచించడంతో నగరవాసులు ఇప్పుడు పానీకే అధిక ప్రాధాన్యమిస్తున్నారు. మహానగర దాహార్తిని తీరుస్తున్న జలమండలి నగరంలో నిత్యం 2059 మిలియన్‌ లీటర్ల (205 కోట్ల లీటర్లు) తాగునీటిని సరఫరా చేస్తోంది. ఈ నీటిని సుమారు 10.60 లక్షల నల్లాలకు సరఫరా చేస్తోంది. అంతర్జాతీయ ప్రమాణాల ప్రకారం తలసరిగా నిత్యం 135 లీటర్ల నీరు అవసరం. ఈ ప్రకారం పరిశీలిస్తే ప్రధాన నగరంలో నివసిస్తున్న వారికి ఈ ప్రమాణాల ప్రకారమే తాగునీరు సరఫరా అవుతోంది. ఇక శివారు ప్రాంతాల్లో నివసిస్తున్న ప్రతి వ్యక్తికీ నిత్యం 100 లీటర్ల చొప్పున తాగునీరు సరఫరా అవుతోంది. నగరంలో పుట్టగొడుగుల్లా వెలసిన సుమారు రెండువేల ఫిల్టర్‌ ప్లాంట్ల వద్ద పీవీసీతో తయారు చేసిన వాటర్‌బాటిళ్లను సరిగా శుద్ధి చేయకుండానే నీటిని నింపేస్తున్నా పట్టించుకునే నాథుడే కరువయ్యారు. లాక్‌డౌన్‌ నేపథ్యంలో తనిఖీలు చేపట్టాల్సిన బల్దియా, బ్యూరో ఆఫ్‌ ఇండియన్‌ స్టాండర్డ్స్, ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ ప్రివెంటివ్‌ మెడిసిన్‌ తదితర సంస్థలు తనిఖీలను గాలికొదిలేశాయి. మరోవైపు భూగర్భజలాలు వట్టిపోయిన శేరిలింగంపల్లి, చందానగర్, నిజాంపేట్‌ తదితర ప్రాంతాల్లో ట్యాంకర్‌ మాఫియా యథేచ్ఛగా దందా కొనసాగిస్తోంది. 

జలమండలి తాగునీటి సరఫరా ఇలా..
కోర్‌సిటీలో రోజు విడిచి రోజు.. శివార్లలో ప్రతి 3– 4 రోజులకోసారి తాగునీటిని జలమండలి సరఫరా చేస్తోంది. కోవిడ్‌ కలకలం నేపథ్యంలో కృష్ణా, గోదావరి, హిమాయత్‌సాగర్, ఉస్మాన్‌సాగర్‌ జలాలను శుద్ధిచేసే ఫిల్టర్‌ ప్లాంట్లు, నగరంలో శుద్ధి చేసిన నీటిని నిల్వ చేసే  300కుపైగా ఉన్న స్టోరేజీ రిజర్వాయర్ల వద్ద క్లోరినేషన్, బూస్టర్‌ క్లోరినేషన్‌ ప్రక్రియను పకడ్బందీగా నిర్వహిస్తున్నారు. ఈ విధుల్లో పాల్గొనే సిబ్బందికి బోర్డు మేనేజింగ్‌ డైరెక్టర్‌ ఎం.దానకిశోర్‌ ప్రత్యేక ప్రొటోకాల్‌ అమలు చేస్తున్నారు. నీటి శుద్ధి, నాణ్యత ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రమాణాల మేరకు ఉండాలని స్పష్టం చేశారు. ప్రతిరోజూ తాగునీరు సరఫరా అయ్యే ప్రాంతాల నుంచి ఐదు వేల నల్లా నీటి నమూనాలను సేకరించి ఐపీఎం, ఐహెచ్‌ఎస్, జలమండలి క్వాలిటీ విభాగం ఆధ్వర్యంలో పరీక్షిస్తున్నారు. కలుషిత జలాలపై ఫిర్యాదు అందిన వెంటనే సమస్య పరిష్కారమయ్యే వరకు ట్యాంకర్ల ద్వారా ఆయా ప్రాంతాలకు తాగునీరు అందిస్తుండడం విశేషం.

వేసవి కార్యాచరణ ఇదే..  
వేసవిలో తాగునీటి డిమాండ్‌ అనూహ్యంగా పెరుగుతుండడంతో ప్రస్తుతం జలమండలికి ఉన్న వెయ్యి ట్యాంకర్లకు తోడు మరో 200 అదనపు ట్యాంకర్లతో తాగునీటిని సరఫరా చేస్తున్నారు. ట్యాంకర్‌ బుక్‌ చేసిన 24 గంటల్లోపు నీటి సరఫరా జరగాలని ఎండీ ఆదేశించారు. శివారు ప్రాంతాల్లోనూ అదనపు నీటి ఫిల్లింగ్‌ కేంద్రాలను ఏర్పాటుచేసి మరో వంద ట్యాంకర్ల ద్వారా నీటి కొరత ఉన్న ప్రాంతాలకు తాగునీరందిస్తున్నట్లు బోర్డు వర్గాలు తెలిపాయి.

ఫిల్టర్‌ ప్లాంట్లపై కొరవడిన నియంత్రణ..
గ్రేటర్‌ పరిధిలో వీధికొకటి చొప్పున సుమారు 5వేలకుపైగా ఫిల్టర్‌ ప్లాంట్లున్నాయి. వీటిలో బ్యూరో ఆఫ్‌ ఇండియన్‌ స్టాండర్డ్స్‌ గుర్తింపు పొందినవి 1000 మాత్రమే. మిగతా ప్లాంట్ల వద్ద పీవీసీతో తయారు చేసిన ప్లాస్టిక్‌ బాటిళ్లను సక్రమంగా శుద్ధి చేయకుండానే తిరిగి నీటిని నింపి విక్రయిస్తున్నారు. మరోవైపు నీటిలో ఉన్న ఆవశ్యక లవణాలు, మినరల్స్‌ను తొలగించి బీఐఎస్‌ ప్రమాణాలను తుంగలోకి తొక్కుతున్నారు. ఈ నీటిని తాగినవారు తరచూ రోగాల పాలవుతున్నారు. ఫిల్టర్‌ ప్లాంట్ల నీటిని విధిగా కాచి వడబోసి తాగాలని వైద్యులు సూచిస్తున్నారు. ఫిల్టర్‌ ప్లాంట్ల ఆగడాలను కట్టడి చేయాల్సిన బల్దియా యంత్రాంగం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోంది.

విచ్చలవిడిగా తోడేస్తున్నా..
భూగర్భ జలాలు వట్టిపోయిన శేరిలింగంపల్లి, చందానగర్, నిజాంపేట్, కూకట్‌పల్లి తదితర శివారు ప్రాంతాల్లో ట్యాంకర్‌ మాఫియాలు వినియోగదారుల జేబులు గుల్ల చేస్తున్నాయి. నీటికి డిమాండ్‌ పెరగడంతో 5 వేల లీటర్ల ట్యాంకర్‌కు డిమాండ్‌ను బట్టి రూ.1000 నుంచి రూ.1500 వరకు విక్రయిస్తున్నారు. శివారు ప్రాంతాల్లో అపార్ట్‌మెంట్లలో నివసిస్తున్న ఒక్కో కుటుంబం ట్యాంకర్‌ నీళ్ల కోసం నెలకు రూ.3 వేల నుంచి రూ.5 వేల వరకు ఖర్చు చేయాల్సి వస్తోంది. చెరువులు, కుంటల్లో బోర్లు వేసి భూగర్భ జలాలను విచ్చలవిడిగా తోడేస్తున్నా.. రెవెన్యూ యంత్రాంగం నిద్ర మత్తులో జోగుతుండడం గమనార్హం. 

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top