ఆటోకు అడ్రస్‌

Hyderabad Auto Data Base Collecting For Safe Journey - Sakshi

నగరంలోని ఆటో రిక్షాల వివరాలతో డేటాబేస్‌

ప్రతి వాహనానికి ప్రత్యేక క్యూఆర్‌ కోడ్‌ కేటాయింపు

ఈ నెల 17 నుంచి రెండు కేంద్రాల్లో రిజిస్ట్రేషన్లు ప్రారంభం

కచ్చితంగా చేయించాల్సిందే: ట్రాఫిక్‌ చీఫ్‌ అనిల్‌కుమార్‌

ఇకపై ఆటో ప్రయాణం భద్రంగా సాగుతుంది. ఎలాంటి టెన్షన్‌ లేకుండా ప్రయాణికులు ఆటో ఎక్కేయొచ్చు. ఎందుకంటే నగరంలోని ప్రతి ఆటో వివరాన్నీ సేకరించి పోలీసులు భద్రపరుస్తున్నారు. ఇందుకోసం ప్రత్యేక డేటా బేస్‌ ఏర్పాటు చేస్తున్నారు. ప్రతి ఆటోకు ప్రత్యేకంగా క్యూఆర్‌ కోడ్‌ కేటాయిస్తున్నారు.

 

సాక్షి, సిటీబ్యూరో: నగర వ్యాప్తంగా దాదాపు 1.4 లక్షల ఆటోలు సంచరిస్తున్నట్లు అంచనా. అయితే వాటికి  సంబంధించి అధికారిక రికార్డుల్లో ఉన్న చిరునామాలు, ప్రస్తుతం వాటి యజమానులు/డ్రైవర్లు అడ్రస్‌లకు సంబంధం లేని కారణంగానే అనేక సమస్యలు ఉత్పన్నమవుతున్నాయి. ఈ–చలాన్లు పేరుకుపోవడంతో పాటు కొన్ని నేరాల్లో నిందితులు చిక్కట్లేదు. దీనిని దృష్టిలో పెట్టుకున్న నగర ట్రాఫిక్‌ చీఫ్‌ అనిల్‌ కుమార్‌ కీలక నిర్ణయం తీసుకున్నారు. నగరంలో సంచరిస్తున్న ఆటోలతో పాటు వాటిని నడుపుతున్న డ్రైవర్ల పూర్తి వివరాలతో డేటాబేస్‌ ఏర్పాటు చేయనున్నారు. ఈ మేరకు ఆయన శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు. ఈ డేటాబేస్‌ ఆధారంగా ప్రతి వాహనానికీ ప్రత్యేకంగా క్యూఆరో కోడ్‌తో కూడిన పోలీస్‌ నంబర్‌ కేటాయిస్తారు. వీటితో పాటు ఆటో లోపలి భాగంలో నేమ్‌షీట్ల ఏర్పాటు కోసమూ సన్నాహాలు చేస్తున్నారు. ఈ రిజిస్ట్రేషన్, కోడ్స్‌ జారీ విధానానికి ‘మై వెహికిల్‌ ఈజ్‌ సేఫ్‌’ అని నామకరణం చేశారు.

సగానికి సగం వేరే చిరునామాలే...
రాజధానిలోని ఆటోలకు సంబంధించి ఆర్టీఏ రికార్డుల్లో కనీసం 50 శాతం కూడా అసలైన చిరునామాలపై లేవు. ఫలితంగా ఏదైనా ఉదంతం జరిగినప్పుడు దర్యాప్తులో అనేక చిక్కులు ఎదురవుతున్నాయి. ఇక ఆటోవాలాల ఉల్లంఘనల విషయానికి వస్తే నగరంలోని వాహనాల్లో వీటి వాటా నాలుగు శాతం లోపే కాగా... పెండింగ్‌లో ఉన్న ఈ–చలాన్ల సంఖ్య మాత్రం 20 శాతం దాటుతోంది. నగరంలో ఎన్ని ఆటోలు ఉన్నాయి..? ఎన్ని సంచరిస్తున్నాయి? అంటూ ఆర్టీఏ అధికారులను అడిగితే ఠక్కున సమాధానం చెప్పలేని పరిస్థితి. నగరంలో డబుల్‌ రిజిస్ట్రేషన్‌ నెంబర్, బోగస్‌ నంబర్‌ ప్లేట్లతో తిరుగుతున్న వాహనాలు 40 శాతం వరకు ఉంటాయని పోలీసుల అంచనా. ఆర్టీఏలో రిజిస్ట్రేషన్‌ చేయించుకుంటున్న ఆటోడ్రైవర్లు, యజమానులు అందిస్తున్న పత్రాల విశ్వసనీయత, చిరునామా పక్కానా? కాదా? అనేవి క్రాస్‌ చెక్‌ చేసేందుకు ఆర్టీఏ వద్ద వనరులు లేవు. నగర వ్యాప్తంగా విస్తృత దాడులు చేసి ఇలాంటి వాటికి చెక్‌ చెప్పాలన్నా... ఉన్న సిబ్బందితో రోటీన్‌ పనులే కష్టంగా మారాయి.

ప్రత్యేక నంబరింగ్‌కు సన్నాహాలు...
ఈ పరిణామాలను పరిగణలోకి తీసుకున్న నగర ట్రాఫిక్‌ విభాగం అధికారులు ఆటో డ్రైవర్లు, యజమానుల తాజా వివరాలతో ప్రత్యేక డేటాబేస్‌ ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. ఇందులో వాహనం ఎవరి పేరుతో ఉన్నప్పటికీ ప్రస్తుత యజమాని ఎవరు? ఎవరు డ్రైవర్‌గా వ్యవహరిస్తున్నారు? వారి చిరునామా, సెల్‌ నెంబర్‌ తదితరాలను పొందుపరచనున్నారు. ఈ ప్రక్రియకు తొలుత ఆటోడ్రైవర్లే స్వచ్ఛందంగా ముందుకు వచ్చేలా ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ నెల 17 నుంచి గోషామహల్, బేగంపేట ట్రాఫిక్‌ ట్రైనింగ్‌ ఇన్‌స్టిట్యూట్స్‌లో ప్రత్యేక కేంద్రాలు పని చేయనున్నాయి. ఈ వివరాలను సర్వర్‌లో నిక్షిప్తం చేసి పీడీఏ మిషన్లను అనుసంధానించి క్షేత్రస్థాయిలో ఉండే ట్రాఫిక్‌ అధికారులు తనిఖీ చేయించాలని భావిస్తున్నారు. అసలు వివరాలు ఇవ్వని, తప్పుడు వివరాలు అందించిన వారిని గుర్తించి అప్పటికప్పుడు అప్‌డేట్‌ చేసేలా చర్యలు తీసుకోవడానికి సన్నాçహాలు చేస్తున్నారు. 

ఆటోల్లో అనేకం ఒకరి పేరుతో రిజిస్ట్రేషన్‌ అయి ఉంటే... వాటిని అద్దెకు తీసుకుని,  పర్మిట్‌ ఆధారంగా నడిపే వారు వేరే వ్యక్తులు ఉంటున్నారు. ఈ నేపథ్యంలోనే డ్రైవర్లు ఆర్సీ వివరాలు, పర్మిట్‌ వివరాలతో వేర్వేరుగా దరఖాస్తులు సమర్పించాలి.  
ఈ దరఖాస్తుతో పాటు ఆర్సీ, డ్రైవింగ్‌ లైసెన్స్, డ్రైవర్‌తో పాటు ఓనర్ల గుర్తింపుకార్డులు సమర్పించాలి.  
ఈ నెల 17 నుంచి గోషామహల్, బేగంపేట టీటీఐల్లో ప్రత్యేక నమోదు కేంద్రాలు పనిచేస్తాయి.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top