జన.. ఘన..నగరాలు!

Hyderabad Is The 24th Most Populous City In The World - Sakshi

ప్రపంచంలో అత్యంత జనసాంద్రత ఉన్నవాటిలో మన ‘మెట్రో’లు

మొదటి స్థానంలో ముంబై.. రెండో స్థానంలో కోల్‌కతా

8వ స్థానంలో చెన్నై, 13వ స్థానంలో ఢిల్లీ... 24వ స్థానంలో హైదరాబాద్‌

ఇప్పటికే మన మెట్రో సిటీల్లో అధిక కరోనా కేసులు.. మరిన్ని పెరిగే ప్రమాదం

లాక్‌డౌన్‌ కొనసాగింపే మేలంటున్న నిపుణులు

సాక్షి, హైదరాబాద్‌: గుంపులు.. సమూహాలుగా జన సంచారం.. ఇసుకేస్తే రాలనంత జనం... మాల్‌ అయినా.. హోటల్‌ అయినా ఎటు చూసినా ఇదే పరిస్థితి. ప్రపంచంలో అత్యంత జన సాంద్రత కలిగిన నగరాలన్నీ మన దేశంలోనే ఉన్నాయి. కరోనా మహమ్మారి మానవాళికి పెనుసవాలు విసురుతున్న ఈ తరుణంలో మన మెట్రో నగరాల్లో ఒక్కసారిగా లాక్‌డౌన్‌ ఎత్తేస్తే... అంత మంది జనాన్ని అదుపుచేసే యంత్రాంగం... వైరస్‌ను కట్టడిచేసే వ్యూహం... కరోనా రక్కసికి చిక్కి విలవిల్లాడే వారికి సకాలంలో వైద్య సదుపాయాలు అందించే పరిస్థితి మనకుందా అన్నది ఇప్పుడు సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. ఈ మాయదారి వైరస్‌ అదుపులోకి వచ్చే వరకు దశలవారీగా లాక్‌డౌన్‌ కొనసాగిస్తేనే మేలని వైద్యనిపుణులు అభిప్రాయపడుతున్నారు. ప్రస్తుతం మన మెట్రో నగరాల్లో రోజురోజుకూ పదుల సంఖ్యలో కరోనా కేసులు పెరుగుతుండటంపై ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

కరోనా కరాళ నృత్యమే...
సిటీ మేయర్స్‌ సంస్థ గణాంకాల ప్రకారం.. ప్రపంచంలో అత్యంత జనసాంద్రత ఉన్న నగరం ముంబై. ఇది 484 చదరపు కిలోమీటర్ల పరిధిలో విస్తరించింది. ప్రతి చదరపు కిలోమీటర్‌కు ఉన్న జనసాంద్రత 29,650. ఇక రెండో స్థానంలోని కోల్‌కతా విస్తీర్ణం 531 చ.కి.మీ. కాగా.. జనసాంద్రత 23,900. ఇక మన పొరుగునే ఉన్న చెన్నై ఈ జాబితాలో 8వ స్థానంలో ఉంది. ఈ సిటీ విస్తీర్ణం 414 చ.కి.మీ. కాగా జనసాంద్రత 14,350. దేశ రాజధాని ఢిల్లీది ఈ జాబితాలో 13వ స్థానం. ఈ నగర విస్తీర్ణం 1295 చ.కి.మీ. కాగా జనసాంద్రత 11,050. ఇక 19వ స్థానంలోని బెంగళూరు సిటీ విస్తీర్ణం 534 చ.కి.మీ. కాగా జనసాంద్రత 10,100. ఈ జాబితాలో 24వ స్థానంలో ఉన్న గ్రేటర్‌ హైదరాబాద్‌ నగరం విస్తీర్ణం 625 చ.కి.మీ. కాగా జనసాంద్రత 9,100. అంటే ప్రపంచంలో అత్యంత జన రద్దీ సిటీలుగా మన నగరాలే అగ్ర ర్యాంకుల్లో ఉన్నాయి. ఈ నేపథ్యంలో లాక్‌డౌన్‌ ఒక్కసారిగా ఎత్తేస్తే జనబాహుళ్యంలో కరోనా వైరస్‌ కరాళ నృత్యం చేస్తుందన్న ఆందోళనలు వ్యక్తమౌతున్నాయి.

పెరుగుతోన్న వైరస్‌ కేసులు...
ఇక మెట్రో నగరాల్లో లాక్‌డౌన్‌ కట్టుదిట్టంగా అమలు చేస్తున్నప్పటికీ కరోనా కేసులు రోజురోజుకూ పెరుగుతూనే ఉన్నాయి. జిల్లాలతో పోలిస్తే మహా నగరాలకే వైరస్‌ ముప్పు పొంచి ఉందని ఈ విషయం స్పష్టం చేస్తోంది. పలు చోట్ల లాక్‌డౌన్‌ నిబంధనలను ఆయా నగరాల్లో సిటిజన్లు తరచూ ఉల్లంఘిస్తుండటం, అవసరమైన జాగ్రత్తలు తీసుకోకపోవడమే దీనికి ప్రధన కారణం. ఇక, కరోనా కేసులు అత్యధికంగా నమోదవుతున్న మెట్రో సిటీల్లో ఢిల్లీ, ముంబై, హైదరాబాద్, చెన్నై అగ్రస్థానంలో ఉండగా, పుణే, కోల్‌కతా, బెంగళూర్‌ తరువాత స్థానాల్లో ఉన్నాయి.

అదుపులోకి వచ్చే వరకు లాక్‌డౌన్‌..
కరోనా కట్టడి అయ్యే వరకు లాక్‌డౌన్‌ కొనసాగించాలి. కేసులు అత్యధికంగా నమోదైన రెడ్‌జోన్‌ ప్రాంతాలను గుర్తించి ఏప్రిల్‌ 14 తరవాత మరింత కట్టుదిట్టంగా లాక్‌డౌన్‌ అమలు చేయాలి. పారిశ్రామిక వాడలను మినహాయిస్తే ఉత్పాదకత పెరుగుతుంది. ప్రభుత్వంపై భారం తగ్గుతుంది. కొరియాలో ఈ విధానాన్నే అమలు చేస్తున్నారు. – పద్మనాభ రెడ్డి, ఫోరం ఫర్‌ గుడ్‌ గవర్నెన్స్‌

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top