
సాక్షి, హైదరాబాద్: నిత్యం లక్షన్నరకుపైగా వాహనాల రాకపోకలు సాగించే ఔటర్ రింగ్‌రోడ్డు (ఓఆర్‌ఆర్) మార్గంలో ట్రాఫిక్ వెతలు లేని సాఫీ ప్రయాణంపై హైదరాబాద్ మహానగరాభివృద్ధి సంస్థ (హెచ్‌ఎండీఏ) దృష్టి సారించింది. ఇప్పటికే ఫాస్ట్‌టాగ్ సేవలను అమలు చేస్తున్న అధికారులు మరో కొత్త విధానాన్ని ఏప్రిల్ ఒకటి నుంచి అమలు చేయనున్నారు. ఒక లేన్‌పై ఏ సమయంలోనైనా 20కి మించి వాహనాలుంటే టోల్ రుసుము తీసుకోకుండానే క్లియర్ చేయాలని శుక్రవారం నుంచి టోల్ రుసుము వసూలు బాధ్యతలు చేపట్టనున్న ఈగల్ ఇన్‌ఫ్రా ఇండియా లిమిటెడ్‌ను ఆదేశించింది. దీంతోపాటు నానక్‌రామ్‌గూడ, శంషాబాద్ టోల్ ప్లాజాలోని లేన్ల సంఖ్యను పెంచి వాహనదారుల ప్రయాణాలకు ఇబ్బంది కలగకుండా ఉండే చర్యలను చేపట్టింది. అలాగే టోల్‌ప్లాజాల పరిసరాల పరిశుభ్రత, భద్రతా చర్యలపై దృష్టి సారించింది.
రోజుకు లక్షన్నర వాహనాల రాకపోకలు...
హైదరాబాద్ శివారు ప్రాంతాల ప్రజలతోపాటు విజయవాడ, నిజామాబాద్, వరంగల్, కరీంనగర్ జిల్లావాసులు నగరంలోకి వచ్చేందుకు ఓఆర్‌ఆర్ మార్గాన్ని వినియోగించుకుంటున్నారని హెచ్‌ఎండీఏ అధికారులు చెబుతున్నారు. ఓఆర్‌ఆర్ అందుబాటులోకి రావడంతో వాహన చోదకుల ప్రయాణం మరింత సులభమైందని అంటున్నారు. ఎనిమిది లేన్ల ఓఆర్‌ఆర్‌లో 19 యాక్సెస్ పాయింట్లు ఉన్నాయి. రెండు లేన్లతో సర్వీసు రోడ్లను కూడా అభివృద్ధి చేశారు. అయితే ఓఆర్‌ఆర్ మార్గంలో ముఖ్యంగా నానక్‌రామ్‌గూడ, శంషాబాద్ మార్గంలో రాకపోకలు సాగించే వాహనాలు ఎక్కువగా ఉండటంతో తరచూ ట్రాఫిక్ సమస్యలు తలెత్తుతున్నాయి. దీంతో ఆ టోల్‌ప్లాజాలో లేన్ల సంఖ్యను పెంచాలని ఓఆర్‌ఆర్ అధికారులు నిర్ణయం తీసుకున్నారు. అలాగే పాత సంస్థ ఐఆర్‌బీ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్స్ లిమిటెడ్ వాహనదారులకు జారీ చేసిన నెలవారీ పాసులను సమర్పించి కొత్త ఏజెన్సీ ఈగల్ ఇన్‌ఫ్రా ద్వారా జారీ చేసే పాసులను తీసుకోవాలని వాహనదారులకు సూచిస్తున్నారు. ఈజీ జర్నీ కోసం ఫాస్ట్‌టాగ్ సేవలు వినియోగించుకునేలా వాహనదారుల్లో అవగాహన కలిగిస్తామని ఓఆర్‌ఆర్ సీజీఎం ఇమామ్ తెలిపారు.