హైవే పనులకు బ్రేక్‌

Highway Road Works Pending In Khammam - Sakshi

పాల్వంచరూరల్‌ (ఖమ్మం): జాతీయ రహదారి నిర్మాణ పనులు మూడేళ్లుగా నత్తనడకన సాగుతున్నాయి. దీంతో రాకపోకలకు తీవ్ర అంతరాయం కలుగుతోంది. పనులు అస్తవ్యస్తంగా చేపట్టడంతో ప్రమాదకరంగా మారాయి. గత మార్చి నాటికి పనులు పూర్తిచేయాల్సి ఉండగా కాంట్రాక్టర్, అధికారుల నిర్లక్ష్యం కారణంగా జాప్యం జరుగుతోంది. గత పక్షం రోజులుగా పనులు పూర్తిగా నిలిచిపోయాయి. 30వ జాతీయ రహదారి నిర్మాణంలో భాగంగా మూడో ప్యాకేజీ కింద సారపాక నుంచి రుద్రంపూర్‌ వరకు 42 కిలోమీటర్ల పనులు మూడేళ్ల క్రితం చేపట్టారు. నాలుగు వరుసలుగా నిర్మిస్తున్నారు. అయితే రోడ్డుకు ఒకవైపు కూడా రహదారి పనులు పూర్తికాలేదు. రోడ్డు పక్కన డ్రెయినేజీ పనులను అస్తవ్యస్తంగా చేపట్టారు. పాల్వంచ మండలంలోని కేవశవాపురం నుంచి ఇందిరానగర్‌ కాలనీ వరకు ఇటీవల వరకు నిర్మాణ పనులు కొనసాగాయి. ఆరోగ్యమాత చర్చ నుంచి సీ కాలనీ గేటు, బస్టాండ్‌ సెంటర్‌ నుంచి అంబేడ్కర్‌ సెంటర్‌ వరకు ఒక వైపు నిర్మాణం జరిపారు.

కానీ అసంపూర్తిగా చేపట్టారు. కల్వర్టులపై స్లాబ్‌లు నిర్మాణం చేయకుండా అర్ధంతరంగా వదిలేశారు. ఒకవైపు రోడ్డు ఎత్తుగా మరోవైపు తక్కువ ఎత్తు ఉండటంతో వాహనదారులకు ప్రమాదకరం మారింది. పెద్దమ్మగుడి సమీపంలోని జగన్నాథపురంలో ఒకవైపు రోడ్డు నిర్మాణం కోసం గుంతలు తవ్వి నిర్లక్ష్యంగా వదిలేశారు. నిర్మాణం జరిగే మార్గంలో కనీసం హెచ్చరిక బోర్డులను కూడా ఏర్పాటు చేయలేదు. కొన్నిచోట్ల ఇసుక బస్తాలను, మరికొన్ని చోట్ల డ్రమ్‌లను ఏర్పాటు చేసి చేతులు దులుపుకున్నారు. రాత్రి వేళల్లో వాహనాల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడుతోంది. నవభారత్‌ నుంచి ఇల్లెందు క్రాస్‌ రోడ్డు వరకు కూడా రోడ్డు పరిస్థితి ఇలాగే ఉంది. హైవేకు ఇరువైపులా నిర్మించిన డ్రెయినేజీ అసంపూర్తిగా ఉంది. డివైడర్‌ మధ్యలో అక్కడ అక్కడ నిర్మాణ పనులు నాసిరకంగా ఉన్నాయి. వర్షాలు ప్రారంభమైన తర్వాత జూలై నుంచి హైవే పనులు నత్తనడకన సాగగా, ఇటీవల పూర్తిగా నిలిచిపోయాయి. అయినా సంబంధితశాఖ అధికారులు పట్టించుకోవడంలేదనే ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి.

వర్షాల కారణంగా పనులు నిలిచిపోయాయి  
వర్షాల వల్ల జాతీయ రహదారి పనులు పక్షం రోజులుగా నిలిచిపోయాయి. కాంట్రాక్టర్‌కు నోటీసులు జారీ చేశాం. కొత్తగూడెం పట్టణంలో 6 కిలోమీటర్ల మేరకు వాటర్‌ పైపులైన్‌ తొలగించకపోవడం వల్ల పనులు చేయలే ని పరిస్థితి నెలకొంది. మూ డుచోట్ల కల్వర్టు పనులు కూడా వర్షంలోనే చేపట్టాం. వర్షాలు తగ్గితే డిసెంబర్‌ నెలాఖరుకు పాల్వంచ, కొ త్తగూడెం పట్టణాల పరిధి లో పనులు పూర్తి చేస్తాం. నాసిరకం పనులు నిర్వస్తే చర్యలు తీసుకుంటాం. మళ్లీ నిర్మా ణం చేయిస్తాం. –పద్మారావు, ఎన్‌హెచ్‌ ఈఈ

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top