సచివాలయ భవనాల్ని కూల్చొద్దు

High Court Says To State Not Demolish Secretariat - Sakshi

తదుపరి ఉత్తర్వులిచ్చేవరకు అలాగే ఉంచాలి

రాష్ట్ర ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశం

ప్లాన్లు, డిజైన్ల ఖరారులో ఆలస్యం ఎందుకని ప్రశ్న

సాక్షి, హైదరాబాద్‌: తాము తదుపరి ఉత్తర్వులు ఇచ్చేవరకు సచివాలయ భవనాలను కూల్చొద్దని రాష్ట్ర ప్రభుత్వానికి హైకోర్టు స్పష్టంచేసింది. ఈ మేరకు లిఖితపూర్వక మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. గతంలో మౌఖికంగా ఈ ఆదేశాలు ఉండగా.. ఇప్పుడు రాతపూర్వకంగా వాటిని వెలువరించింది. సచివాలయ భవనాలను కూల్చొద్దంటూ కాంగ్రెస్‌ పార్టీ ఎంపీ ఎ.రేవంత్‌రెడ్డి, ఎమ్మెల్సీ టి.జీవన్‌రెడ్డి, ప్రొఫెసర్‌ కేఎల్‌ విశ్వేశ్వర్‌రావు తదితరులు దాఖలు చేసిన ప్రజాహిత వ్యాజ్యాలను ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ రాఘవేంద్రసింగ్‌ చౌహాన్, న్యాయమూర్తి జస్టిస్‌ ఎ.అభిషేక్‌రెడ్డిలతో కూడిన ధర్మాసనం బుధవారం మరోసారి విచారించింది. కొత్తగా నిర్మాణాలు చేసేందుకు ప్రభుత్వం ఇంకా ప్లాన్‌లు రూపొందించలేదని, ఈ మేరకు అఫిడవిట్‌ దాఖలు చేసినట్లు ప్రభుత్వం తరఫున అదనపు అడ్వొకేట్‌ జనరల్‌ జె.రామచంద్రరావు తెలిపారు. దీనిపై ధర్మాసనం స్పందిస్తూ.. కొత్తగా రూపొందించే ప్లాన్‌లను మంత్రివర్గ సమావేశం ఆమోదించే వరకూ ప్రస్తుత సచివాలయ భవనాల్ని కూల్చవద్దని, తామిచ్చే తుది ఉత్తర్వుల వరకూ వాటిని అలాగే ఉంచాలని పేర్కొంది.

కొత్తగా సచివాలయ భవనాల్ని నిర్మించాలని మంత్రివర్గం నిర్ణయం తీసుకున్న తర్వాత ప్లాన్‌లు, డిజైన్లను తయారుచేసి వాటిని ఖరారు చేయడానికి ఎందుకు ఆలస్యం చేస్తున్నారని ప్రశ్నించింది. వాటిని సిద్దం చేయకుండా కొత్తగా నిర్మాణాలు ఎలా చేయగలరని అడిగింది. ప్లాన్‌లు, డిజైన్లు చేసేందుకు ఇంజనీర్లు కష్టపడాల్సి వచ్చేదని, ఇప్పుడు అంతా కంప్యూటరీకరణ కదా, ఇంకా వాటి విషయంలో ఎందుకు జాప్యం చేస్తున్నారని నిలదీసింది. నిర్మాణాలపై ప్రభుత్వం తుది నిర్ణయం తీసుకోకముందే, అపరిపక్వత దశలోనే పిల్స్‌ దాఖలు చేశారని అదనపు ఏజీ బదులిచ్చారు. దీనిపై ధర్మాసనం స్పందిస్తూ.. మంత్రివర్గం నిర్ణయం తీసుకుంది కదా, పిల్స్‌ అపరిపక్వత ఎలా అవుతాయని ప్రశ్నించింది. అనంతరం తదుపరి ఉత్తర్వులు ఇచ్చేవరకు సచివాలయ భవనాలు కూల్చొద్దని ఆదేశాలు జారీచేసింది.

పిల్స్‌ కొట్టేయాలి..
‘కొత్తగా నిర్మించబోయే సచివాలయ భవనాల డిజైన్‌ రూపొందించే బాధ్యత వివిధ ఆర్కిటెక్టŠస్‌ సంస్థలకు ఇచ్చాం. అవి నమూనా ప్లాన్‌లే ఇచ్చాయి. కొత్త నిర్మాణం 8 నుంచి 9 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణం ఉంటుంది. అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా చేసే నిర్మాణంలో అదే స్థాయి నిపుణులను భాగస్వామ్యం చేస్తాం. దీనికి రూ.300 కోట్ల నుంచి రూ.400 కోట్ల వరకూ ఖర్చవుతుంది. ఇప్పుడు 32 శాఖలకు 4.45 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలోనే భవనాలు ఉన్నాయి. పాలనాపరంగానే కాకుండా రక్షణపరంగా కూడా అవి యోగ్యంగా లేవు. అగ్ని ప్రమాదం జరిగితే నివారణ చర్యలు తీసుకునే విధంగా కూడా లేవు. వేర్వేరు చోట్ల విడివిడిగా భవనాలు ఉన్నాయి.

కొత్త భవనాలు నిర్మించిన తర్వాతే అవే 32 శాఖలకు ఎంత విస్తీర్ణం కేటాయించాలో నిర్ణయిస్తాం. గ్రీన్‌ జోన్, పార్కింగ్‌లపై ఆర్కిటెక్టŠస్‌ ఇచ్చిన తర్వాతే కేబినెట్‌ ఆమోదిస్తుంది. అంచనా ప్రతిపాదన విషయంలోనే కేబినెట్‌ నిర్ణయం తీసుకుంది. ఇందుకు భిన్నంగా ఉన్నతమైన నిర్ణయం తీసుకునే అవకాశాలు కూడా ఉన్నాయి. అందుకే తుది ప్రణాళికను హైకోర్టుకు నివేదించలేకపోతున్నాం. పిల్స్‌ను కొట్టేయాలి’అని రోడ్లు, భవనాల శాఖ ముఖ్య కార్యదర్శి సునీల్‌ శర్మ అదనపు కౌంటర్‌ పిటిషన్‌లో హైకోర్టును కోరారు.  

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top