పురపోరుకు సిద్ధం

High Court Gives Green Signal To Municipal Elections In Medak - Sakshi

మున్సిపల్‌ ఎన్నికలకు హైకోర్టు గ్రీన్‌ సిగ్నల్‌ 

పాత నోటిఫికేషన్‌ రద్దు.. కొత్త నోటిఫికేషన్‌ జారీకై ఆదేశం 

సాక్షి, రామాయంపేట(మెదక్‌): ఎట్టకేలకు మున్సిపల్‌పోరుకు చిక్కులు వీడాయి. తప్పుల తడకగా వార్డుల విభజన, ఓటరు జాబితా రూపొందించారని.. ఇష్టానుసారంగా ఈ ప్రక్రియ చేపట్టారని ఆరోపిస్తూ పలువురు హైకోర్టును ఆశ్రయించిన సంగతి విధితమే.. పలు వాయిదాల అనంతరం హైకోర్టు గురువారం తుదితీర్పు వెలువరించింది. రాష్ట్రవ్యాప్తంగా 73 మున్సిపాలిటీలపై స్టే ఎత్తివేయగా, ఇందులో జిల్లాలోని మెదక్, రామాయంపేట, నర్సాపూర్, తూప్రాన్‌ మున్సిపాలిటీలున్నాయి. గత జూలైలో జారీ అయిన నోటిఫికేషన్, వార్డులు, ఓటర్‌లిస్టును రద్దుచేస్తూ, మళ్లీ మొదటి నుంచి ఈ ప్రక్రియ చేపట్టాలని కోర్టు ఆదేశించింది. 14 రోజులోపు ఈప్రక్రియ పూర్తిచేయాలని కోర్టు ఆదేశాలు జారీచేసింది. కోర్టు తీర్పు నేపథ్యంలో మళ్లీ వార్డులు, ఓటర్‌ లిస్టు తయారీకై మున్సిపాలిటీ అధికారులు సమాయత్తమవుతున్నారు.

ఇప్పటికే పూర్తిసమాచారం సేకరించిన అధికారులు.. ఆదేశాలు జారీకాగానే రంగంలోకి  దిగనున్నారు. 14 రోజుల్లో అభ్యంతరాలు, సవరణలు పూర్తిచేసి తుదిజాబితా ప్రదర్శించనున్నారు. దీంతోపాటు కొత్తగా ఏర్పాటైన వార్డులకు సంబంధించి సమీక్ష నిర్వహించనున్నారు. అనంతరం వార్డుల వారీగా తుదిజాబితా రూపొందించి కార్యాలయాల్లో ప్రదర్శించనున్నారు. అనంతరం రాజకీయ పక్ష్యాలతో సమావేశం ఏర్పాటు చేసిన అనంతరం మార్పులు, చేర్పుల తరువాతనే కొత్త జాబితా విడుదల కానుంది. మెదక్‌లో గతంలో 27 వార్డులుండగా అది 32కు పెరిగింది. దీంతో పాటు తూప్రాన్‌ లో 11 నుంచి 16, నర్సాపూర్‌లో 9 నుంచి 15, రామాయంపేటలో 9 నుంచి 12 వరకు వార్డులు పెరగగాయి. వీటిలో ఓటర్‌ లిస్టుతో పాటు వార్డులు, పోలింగ్‌ కేంద్రాల్లో మార్పులు జరుగనున్నాయి.  

ఆశావహుల సంతోషం.. 
కోర్టు తీర్పు నేపథ్యంలో ఆశావహులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. జిల్లాలోని నాలుగు మున్సిపాలిటీల్లో ఓటర్లు ప్రజల వద్దకు వెళ్తున్నారు. రామాయంపేటలో బీజేపీతోపాటు కాంగ్రెస్‌ పార్టీకి చెందిన కార్యకర్తలు ఆందోళన రూపంగా ప్రజలవద్దకు వెళ్తూ వార్డుల్లో నెలకొన్న సమస్యలను ప్రస్తావిస్తున్నారు. ఇటీవలనే బీజేపీ కార్యకర్తలు వార్డుల్లో పాదయాత్ర చేపట్టి సమస్యలను గుర్తించగా, కాంగ్రెస్‌ నాయకులు వార్డుల వారీగా దెబ్బతిన్న రహదారులు, మురుగుకాలువల మరమ్మతు విషయమై పలుమార్లు వినతిపత్రాలు అందజేశారు.

ఆదేశాల మేరకు నడుచుకుంటాం 
ప్రభుత్వ ఆదేశాల మేరకు ఈ ప్రక్రియ చేపడుతాం. ఇప్పటి వరకు మాకు ఎలాంటి ఉత్తర్వులు అందలేదు. ఓటర్‌లిస్టు, వార్డుల విభజనలో మా ర్పులు, చేర్పులు జరిగే అవకాశం ఉంది. ఈ మేరకు తాము ఎల్లవేళలా సిద్ధంగా ఉంటాం. – రమేశ్, మున్సిపల్‌ కమిషనర్, రామాయంపేట 
 

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top