చెన్నమనేనికి హైకోర్టులో ఊరట

High Court Given Stay on Chennamaneni Citizenship - Sakshi

సాక్షి, హైదరాబాద్‌ : వేములవాడ ఎమ్మెల్యే చెన్నమనేని రమేష్‌ పౌరసత్వం రద్దు చేస్తూ కేంద్ర హోంశాఖ ఇచ్చిన ఉత్తర్వులపై తెలంగాణ హైకోర్టు స్టే విధించింది. ఈ కేసు విషయమై శుక్రవారం హైకోర్టులో విచారణ జరుగగా, చెన్నమనేని తరపున సీనియర్‌ న్యాయవాది వేదల వెంకటరమణ వాదనలు వినిపించారు. చెన్నమనేని రమేష్‌ జర్మనీలో అగ్రికల్చర్‌ ఎకనామిక్స్‌లో పీహెచ్‌డీ చేశాడని తెలిపారు. 2008 జనవరిలో భారత పౌరసత్వం కోసం దరఖాస్తు చేసుకోగా, 2009లో పౌరసత్వం వచ్చిందని వెల్లడించారు. తర్వాత ఎన్నికల కమిషన్‌ గుర్తింపు కార్డు జారీ చేసిందని వివరించారు. చెన్నమనేని రమేష్‌ 2009లో ఎమ్మెల్యేగా గెలుపొందగా, 2010 ఉప ఎన్నికల్లోనూ విజయం సాధించారని తెలిపారు. తర్వాత 2014, 2019 ఎన్నికల్లోనూ గెలిచి ప్రజాసేవ చేస్తున్నాడని కోర్టు దృష్టికి తీసుకొచ్చారు.

అంతకు ముందు ఈ కేసులో ప్రతివాది అయిన ఆది శ్రీనివాస్‌ తరపు న్యాయవాది రవి కిరణ్‌ రావు మాట్లాడుతూ.. భారతీయ పౌరుడు కాని చెన్నమనేని రమేష్‌ తప్పుడు అఫిడవిట్‌ పెట్టి ఎమ్మెల్యేగా గెలుపొందారని వాదించారు. చట్టాలను మోసం చేసే వాళ్లు చట్టసభల్లో ఎలా ఉంటారని ప్రశ్నించారు. ఇదే విషయాన్ని గతంలో సుప్రీంకోర్టు, హైకోర్టు, ఇప్పుడు హోంశాఖ చెప్పిందని గుర్తు చేశారు. చెన్నమనేని రమేష్‌కు జర్మనీ పౌరసత్వం ఉందని అనేక ఆధారాలు ఉన్నందున హోంశాఖ ఇచ్చిన ఉత్తర్వులను అమలు చేయాలని కోరారు. ఇరు వైపుల వాదనలు విన్న హైకోర్టు స్టే విధించి తదుపరి విచారణను నాలుగు వారాలకు వాయిదా వేసింది.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top