ఎన్ని చెట్లు కొట్టేశారు.. ఎన్ని నాటారు?  

High Court fires on State Govt about Haritha Haram - Sakshi

పూర్తి వివరాలను మా ముందుంచండి

రాష్ట్ర ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశం

అందాన్నిచ్చే మొక్కలు నాటడం బ్యూటీపార్లర్‌కు వెళ్లడం లాంటిది

వాటి వల్ల ప్రయోజనం ఉండదు

స్పష్టం చేసిన ధర్మాసనం 

సాక్షి, హైదరాబాద్‌:  అభివృద్ధి పేరుతో తెలంగాణవ్యాప్తంగా ఇప్పటివరకు ఎన్ని చెట్లు కొట్టేశారు.. ఎంత విస్తీర్ణంలో కొట్టేశారు.. వాటిస్థానంలో ఎన్ని చెట్లను నాటారు.. ప్రస్తుతం వాటి వయసు ఎంత.. అవి ఏ స్థితిలో ఉన్నాయి.. తదితర వివరాలను తమ ముందుంచాలని హైకోర్టు శనివారం రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. పెద్ద, పెద్ద చెట్లను కొట్టేసి, వాటిస్థానంలో చిన్న, చిన్న పూలమొక్కలను నాటడాన్ని అభివృద్ధిగా పరిగణించలేమని అభిప్రాయపడింది. భారీ చెట్లస్థానంలో పూలమొక్కలు నాటడం బ్యూటీపార్లర్‌కు వెళ్లి అందానికి మెరుగులు దిద్దుకోవడం లాంటిదని వ్యాఖ్యానించింది. చెట్లను కూల్చివేస్తున్న ప్రాంతాల్లో మళ్లీ వాటి స్థానంలో మొక్కలు నాటే విషయంలో పెద్దగా పురోగతి లేదని పేర్కొంది.

గతంలో రోడ్ల వెంట చింత చెట్లు ఉండేవని, వాటి ద్వారా ఆయా గ్రామపంచాయతీలకు ఆదాయం వచ్చేదని, అయితే ప్రస్తుతం చింతచెట్లు కనుమరుగయ్యాయని తెలిపింది. తాము కోరిన వివరాలను తమ ముందుంచాలంటూ తదుపరి విచారణను వచ్చే వారానికి వాయిదా వేసింది. ఈ మేరకు ప్రధాన న్యాయమూర్తి(సీజే) జస్టిస్‌ తొట్టతిల్‌ బి.రాధాకృష్ణన్, న్యాయమూర్తి జస్టిస్‌ ఎస్‌.వి.భట్‌ల ధర్మాసనం ఉత్తర్వులు జారీ చేసింది. ఇబ్రహీంపట్నం–నాగార్జునసాగర్‌ జాతీయ రహదారి వెంబడి వందల సంఖ్యలో ఉన్న భారీ చెట్లను కొట్టేస్తుండటంపై న్యాయవాది తేరా రజనీకాంత్‌రెడ్డి 2016లో హైకోర్టుకు లేఖ రాశారు. ఈ లేఖను పిల్‌గా పరిగణించిన హైకోర్టు, దీనిపై విచారణ జరుపుతున్న సంగతి తెలిసిందే. దీనిపై సీజే నేతృత్వంలోని ధర్మాసనం శనివారం మరోసారి విచారణ జరిపింది. 

అన్ని శాఖలతో సమన్వయం చేసుకోండి... 
గతవారం ధర్మాసనం ఆదేశించిన మేరకు రహదారులు, భవనాల శాఖ(ఆర్‌ అండ్‌ బీ) ఇంజనీర్‌ ఇన్‌ చీఫ్‌ రవీంద్రరావు, నల్లగొండ డివిజనల్‌ అటవీ అధికారి (డీఎఫ్‌వో)లు శనివారం కోర్టు ముందు హాజరయ్యారు. ఈ సందర్భంగా ధర్మాసనం స్పందిస్తూ 2016లో కొట్టేసిన చెట్ల స్థానంలో ఎందుకు మళ్లీ చెట్లు నాటలేదని ప్రశ్నించింది. దీనికి అదనపు అడ్వొకేట్‌ జనరల్‌(ఏఏజీ) జె.రామచంద్రరావు వాదనలు వినిపిస్తూ రహదారుల పనులు ఇంకా పూర్తి కాలేదన్నారు. పనులు కొనసాగుతున్న నేపథ్యంలో నాటిన మొక్కలు దెబ్బతినే అవకాశం ఉందని తెలిపారు. ఎక్కడైతే పనులు పూర్తయ్యాయో అక్కడ మొక్కలు నాటి వాటి సంరక్షణకు చర్యలు తీసుకుంటున్నామని వివరించారు.

హరితహారం కార్యక్రమం ద్వారా విస్తృతస్థాయిలో మొక్కలు నాటుతున్నామని చెప్పారు. ఈ సమయంలో ధర్మాసనం జోక్యం చేసుకుంటూ ఇప్పటికే పనులు పూర్తయిన చోట్ల ఎన్ని మొక్కలు నాటారని ప్రశ్నించింది. మిగిలిన శాఖలతో సమన్వయం చేసుకుంటూ నాటిన మొక్కల వివరాలు, వాటి ప్రస్తుత పరిస్థితిని వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా తెలుసుకోవడం పెద్ద సమస్య కాదంది. పెద్ద, పెద్ద చెట్లను కొట్టేసి వాటిస్థానంలో అందాన్నిచ్చే చిన్న, చిన్న మొక్కలను నాటడం వల్ల ప్రయోజనం ఉండదని పేర్కొంది. రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటివరకు ఎంత విస్తీర్ణం మేర ఎన్ని చెట్లను కొట్టేశారు.. వాటిస్థానంలో ఎన్ని మొక్కలు నాటారు.. వాటి వయస్సు.. వాటి ప్రస్తుత స్థితి తదితర వివరాలను ఓ అఫిడవిట్‌ రూపంలో తమ ముందుంచాలని ప్రభుత్వాన్ని ఆదేశించిన ధర్మాసనం తదుపరి విచారణను వచ్చేవారానికి వాయిదా వేసింది.  

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top