న్యాయాధికారుల విభజనలో హైకోర్టుకు పాత్ర లేదు

The High Court does not have role in the division of judges - Sakshi

సుప్రీంకోర్టులో తెలంగాణ జడ్జెస్‌ అసోసియేషన్‌ వాదన

సాక్షి, హైదరాబాద్‌: ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల మధ్య న్యాయాధికారుల (జిల్లా జడ్జిలు, సీనియర్‌ సివిల్‌ జడ్జిలు, సివిల్‌ జడ్జిలు) విభజన ప్రక్రియలో హైకోర్టుకు పాత్ర లేదని తెలంగాణ జడ్జెస్‌ అసోసియేషన్‌ సుప్రీం కోర్టులో వాదించింది. బుధవారం రెండో రోజు కూడా సంబంధిత పిటిషన్‌పై జస్టిస్‌ జాస్తి చలమేశ్వర్‌ నేతృత్వంలోని ధర్మాసనం విచారణ జరిపింది. ఈ సందర్భంగా తెలంగాణ జడ్జెస్‌ అసోసియేషన్‌ తరఫున న్యాయవాది ఇందిరా జైసింగ్‌ వాదనలు వినిపించారు.

సుప్రీం మధ్యంతర ఉత్తర్వుల మేరకు కేంద్రం హైకోర్టు సాయంతో ముసాయిదా మార్గదర్శకాలను రూపొందించి హైకోర్టుకు పంపిస్తే హైకోర్టు వాటిని మార్చేసిందని నివేదించారు. క్లాజ్‌ 5లో కేంద్రం న్యాయాధికారుల విభజన స్థానికత ఆధారంగా జరగాలని సూచించగా.. దానిని హైకోర్టు మార్చివేసి సీనియారిటీ ప్రాతిపదికన జరగాలని పేర్కొందన్నారు. వాస్తవానికి హైకోర్టే తొలుత రూపొందించిన ముసాయిదా మార్గదర్శకాల్లో స్థానికతను ప్రాతిపదికగా తీసుకోగా కేంద్రం దానికి సమ్మతించిందని ఇప్పుడు కేంద్రం రూపొందించిన ముసాయిదా మార్గదర్శకాన్ని హైకోర్టు ఏ ప్రాతిపదికన మార్చిందని ఆక్షేపించారు.

అలాగే న్యాయాధికారుల విభజనపై నిర్ణయం తీసుకోవడానికి కేంద్ర సిబ్బంది, శిక్షణశాఖ కార్యదర్శి నేతృత్వంలో సలహా కమిటీ ఏర్పాటు చేయాల్సి ఉండగా.. హైకోర్టు సీనియర్‌ న్యాయమూర్తి చైర్మన్‌గా ఉంటారని ఇప్పుడు హైకోర్టు ప్రతిపాదించడంపై అభ్యంతరం వ్యక్తంచేశారు. రాష్ట్ర విభజన లక్ష్యాన్ని గమనంలోకి తీసుకోవాలని కోరారు. న్యాయాధికారుల విభజనలో హైకోర్టుకు అధికారం లేదంటూ అందుకు సంబంధించి గతంలో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పులను ప్రస్తావించారు. ఈ నేపథ్యంలో ధర్మాసనం విచారణను గురువారానికి వాయిదా వేసింది.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top