సీజ్‌ చేసిన ఈవీఎంలను వాడుకోండి | Sakshi
Sakshi News home page

సీజ్‌ చేసిన ఈవీఎంలను వాడుకోండి

Published Sat, Mar 16 2019 3:25 AM

The High Court allowed the use of EVMs - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: ఇటీవలి అసెంబ్లీ ఎన్నికల్లో సీజ్‌ చేసిన ఆలేరు, నాగర్‌ కర్నూల్‌ నియోజకవర్గాల ఈవీఎంలను ఉపయోగించుకునేందుకు హైకోర్టు శుక్రవారం కేంద్ర ఎన్నికల సంఘానికి అనుమతినిచ్చింది. ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్‌ షమీమ్‌ అక్తర్‌ ఉత్తర్వులు జారీ చేశారు. ఆలేరు నియోజకవర్గం నుంచి గొంగిడి సునీత ఎన్నికను సవాలు చేస్తూ ఆ నియోజకవర్గానికి చెందిన సతీష్‌కుమార్‌ హైకోర్టులో ఎన్నికల పిటిషన్‌ (ఈపీ) దాఖలు చేశారు. సునీత తన ఎన్నికల అఫిడవిట్‌లో తన పేరు మీద, తన భర్త పేరు మీద ఉన్న పలు ఆస్తుల వివరాలను దాచిపెట్టారని పేర్కొన్నారు. ఆమె భర్తకు యాదగిరి మండలం పరిధిలో పెద్ద ఎత్తున ఉన్న ఆస్తుల వివరాలనూ చెప్పలేదన్నారు. కుమార్తె పేరు మీద ఉన్న ఆస్తుల వివరాలు వెల్లడించలేదన్నారు. ఆమె తన అఫిడవిట్‌లో ఆస్తుల పూర్తి వివరాలు, వాటి మార్కెట్‌ ధరలనూ వివరించలేదని తెలిపారు.

అందువల్ల ఆమె నామినేషన్‌ తాలూకు రికార్డులన్నింటినీ పరిశీలించి, నామినేషన్‌ను చెల్లనిదిగా ప్రకటించాలని కోరారు. ఇదిలా ఉంటే నాగర్‌ కర్నూలు నుంచి మర్రి జనార్దన్‌రెడ్డి ఎన్నికను సవాలు చేస్తూ నాగం జనార్దన్‌రెడ్డి ఎన్నికల పిటిషన్‌ దాఖలు చేశారు. ఎన్నికల్లో మర్రి పలు అక్రమాలకు పాల్పడ్డారని ఆరోపించారు. ఆయన ఎన్నికను రద్దు చేసి, నాగర్‌ కర్నూలు నుంచి తాను ఎన్నికైనట్లు ప్రకటించాలని కోర్టును కోరారు. రెండు వ్యాజ్యాలపై న్యాయ మూర్తి జస్టిస్‌ షమీమ్‌ అక్తర్‌ విచారణ జరుపుతున్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో సీజ్‌ చేసిన ఈవీఎంలను రానున్న పార్లమెంటు ఎన్నికలకు ఉపయోగించుకునేందుకు అనుమతినివ్వాలని కోరుతూ ఈసీ 2 అనుబంధ పిటిషన్లు వేసింది. ఈ వ్యాజ్యాలపై జస్టిస్‌ షమీమ్‌ అక్తర్‌ శుక్రవారం విచారణ జరిపారు. సతీష్‌కుమార్‌ తరఫు న్యాయవాది  స్పందిస్తూ, గొంగిడి సునీత నామినేషన్‌ దాఖలుపై అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నామని, ఈవీఎంలపై అభ్యంతరాలు లేవని, వాటిని వినియోగించుకునేందుకు తమకు ఇబ్బంది లేదని కోర్టుకు వివరించారు. అలాగే నాగం జనార్దన్‌రెడ్డి తరఫు న్యాయవాది కూడా ఇదే విషయం చెప్పారు.

Advertisement
Advertisement