కేన్సర్‌ బాధితులకు కేశాల దానం

Hair Donation Camp For Cancer Patients in Hyderabad - Sakshi

హెయిర్‌ డొనేషన్‌పై నగర యువత ఆసక్తి

అమ్మాయిల ముఖ వర్ఛస్సుకు జుట్టు ఎంత అవసరమో తెలియంది కాదు. అందుకేఅబ్బాయిల తరహాలో గుండుతో కనిపించే అమ్మాయిలను చూడడమే అరుదు. మరోవైపు కేశాలంకరణ కోసమే వేల రూపాయలు ఖర్చు చేసే వారు కోకొల్లలు. అయితే అందరికీ తెలిసిన మహిళల శైలికిభిన్నంగాముఖ సౌందర్యం కన్నా మానసిక సౌందర్యం మిన్న అని నమ్ముతున్నారు కొందరు. కేన్సర్‌ బాధితుల కోసం శిరోజాలను దానం చేస్తూ...స్ఫూర్తిని అందిస్తున్నారు.

సాక్షి, సిటీబ్యూరో: పెరుగుతున్న కాలుష్యం, మారుతున్న ఆహారపు అలవాట్లు, నిత్యావసర ఉత్పత్తుల్లో మితిమీరిన కేన్సర్‌ కారక రసాయనాల వాడకంతో చిన్నా పెద్దా తేడా లేకుండా  కేన్సర్‌ మహమ్మారి బారిన పడుతున్నారు. ఈ వ్యాధికి చికిత్సగా అందించే కీమోథెరపి కారణంగా జుట్టు మెత్తం రాలిపోవడం, తద్వారా ఆత్మనూన్యతకు గురికావడం కనిపిస్తోంది. అలాంటి బాధితుల్లో చిన్నారుల కోసం  కొన్ని స్వచ్చంద సంస్థలు  దాతల శిరోజాలతో కృత్రిమ విగ్స్‌ తయారు చేసి వ్యాధిగ్రస్త పిల్లలకు ఉచితంగా అందిస్తున్నాయి. ఈ క్రతువులో నగర మహిళలు ఎందరో మేము సైతం అంటున్నారు. 

బాధితుల కోసం..
నగరంలోని ఓ హెయిర్‌ సెలూన్‌లో  స్టైలిస్ట్‌గా పనిచేసే శివ యాదవ్‌  కేన్సర్‌ భాధితులకు ఉచితంగా విగ్స్‌ తయారు చేసి అందించే మదత్‌  ట్రస్ట్‌ గురించి తెలుసుకున్నాడు. దీనికి తన వంతు సాయం చేయాలనే ఆలోచనతో..  హేర్‌ డొనేషన్‌ ఫర్‌ కేన్సర్‌ పేషెంట్స్‌ ప్రారంభించాడు. అలా సేవా తత్పరత కలిగిన వారి నుంచి జుట్టుని సేకరించి ట్రస్ట్‌కి పంపుతున్నాడు. ‘‘ఒక విగ్‌ తయారీకి కనీసం 5, 6గురి నుంచి  జుట్టు అవసరం అవుతుంది.. అలాగే దాతల కేశాల పొడవు కనీసం 12 అంగుళాలు ఉండాలి. అందుకే అమ్మాయిలు జుట్టు మాత్రమే ఉపకయోగపడుతుంది. ఓ ప్రత్యేకమైన పద్ధతిలో ఆ జుట్టుని కత్తిరించి సేకరించిన అనంతరం దాతలకి ట్రస్ట్‌ తరపున ప్రశంసా పత్రం అందిన్తాం. ఉద్యోగంతో పాటు ఓ మంచి పని చేస్తున్నాననే ఆలోచన మరింత ఉత్సాహన్నిస్తోంది’’ అని సంతోషాన్ని వ్యక్తం చేశాడు శివ.

జుట్టు లేకుండా తిరుగుతున్నా...
నేను పని చేస్తున్న రంగంలో అందానికి ప్రాధాన్యత ఎక్కువ.  గుండుతో బ్యూటీ ట్రైనర్‌గా కొనసాగడం సామాన్యమైన విషయం కాదు. అయినా సరే కేన్సర్‌ భాధిత చిన్నారుల్లో చిరునవ్వు చూడడం కోసం నా శిరోజాలను దానం చేశాను. అంతేకాదు.. దీని గురించి ప్రతి ఒక్కరిలో అవగాహన పెంచాలనుకుని  క్యాప్‌ లేకుండానే తిరుగుతూ...ప్రశ్నించిన ప్రతి ఒక్కరికీ వివరంగా చెప్తున్నా. అందులో కొందరు తాము  కూడా  డొనేషన్‌కి ముందుకు రావడం మరింత ఆనందంగా అనిపిస్తోంది.  – బిందు, బ్యూటీ ట్రైనర్‌

సకుటుంబసమేతంగా....
కేన్సర్‌ మహమ్మారితో కుదేలైన పిల్లల్ని చూసినప్పుడు ఎంతో బాధ అనిపించేది. వీరి గురించి మనమేం చేయలేమా అనుకునేదాన్ని. అలాంటి సమయంలోనే  కేన్సర్‌ బాధితులకు హేర్‌ డొనేషన్‌ తెలిసింది. నాతో పాటు పిల్లలకు చిన్నప్పటి నుంచే సామాజిక, నైతిక విలువలు నేర్పించాలనే ఉద్దేశ్యంతో మా కుమార్తెలు శరణ్య, నూతన కేశాలు కూడా డొనేట్‌ చేశాను. నా ఆలోచనను  నా భర్త పూర్తిగా ప్రోత్సాహించారు.  – లత, ఎస్‌.ఆర్‌ నగర్‌

అమెరికా టు ఇండియా..
అమెరికాలో ఉంటూ ఇండియా వచ్చినప్పుడల్లా తిరుమలలో తలనీలాలను ఇవ్వడం  ఆనవాయితి. అమ్మాయిలే కాదు అబ్బాయిలు కూడా వెంట్రుకలను డొనేట్‌ చేయొచ్చు అని నిరూపించాలనుకున్నా. నా భార్య సలçహా మేరకు ప్రత్యేకంగా డొనేషన్‌కి సరిపోయేంత పొడవు వెంట్రుకలను పెంచా. గత డిసెంబర్‌లో ఇండియా వచ్చి కేశాలను దానం చేశా.  – భరత్‌

నేటి నుంచి కేన్సర్‌పై అవగాహన
గచ్చిబౌలి: కేన్సర్‌ను ప్రాథమిక దశలోనే గుర్తిస్తే  ప్రాణాపాయం తప్పుతుందని కొండాపూర్‌ అపోలో క్లినిక్‌ డాక్టర్‌ విజయ్‌ కరణ్‌రెడ్డి తెలిపారు.   సోమవారం కొండాపూర్‌ అపోలో క్లినిక్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ప్రపంచ కేన్సర్‌ దినోత్సవాన్ని పురస్కరించుకొని మంగళవారం నుంచి అవగాహన కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు ప్రకటించారు.   వారం రోజుల పాటు ‘ఐయామ్‌ ఐ విల్‌’ పేరిట  ఫేస్‌బుక్, ట్విట్టర్, వాట్సాప్‌ల ద్వారా అవగాహన కార్యక్రమం చేపడుతున్నట్లు పేర్కొన్నారు. ప్రతి ఒక్కరు కేన్సర్‌పై తీసుకుంటున్న జాగ్రత్తలు, దురలవాట్లను విడనాడటం తదితర అంశాలను జోడించి ప్రతిజ్ఞ చేస్తూ సోషల్‌ మీడియాలో పోస్టింగ్‌ చేస్తారని తెలిపారు. 50 వేల మందికి పోస్టింగ్‌లు పంపే లక్ష్యంగా కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు.  

ముందుగా గుర్తిస్తే పూర్తిస్థాయి చికిత్స
ఖైరతాబాద్‌:  రోజు రోజుకూ పెరుగుతున్న లివర్‌ కేన్సర్‌ పై అవగాహన కల్పించడంతో పాటు ఆధునిక లివర్‌ శస్త్రచికిత్సలపై అవగాహన కల్పించాల్సిన అవసరం ఎంతైనా ఉందని గ్లెనిగల్స్‌ గ్లోబల్‌ హాస్పిటల్స్‌ చైర్మన్‌ సీనియర్‌ కన్సల్టెంట్, సర్టికల్‌ గ్యాస్ట్రోఎంట్రాలజిస్ట్‌ డాక్టర్‌ కె.రవీంద్రనా«థ్‌ సోమవరాం తెలిపారు. వరల్డ్‌ కేన్సర్‌ డే సందర్భంగా ఆయన మాట్లాడుతూ... మన శరీరంలో అతి పెద్ద అవయవం...ఎక్కువ క్రియలు నిర్వర్తించేది లివర్‌(కాలేయం) అన్నారు. కొంత కాలంగా లివర్‌ కేన్సర్ల బాధితుల సంఖ్య పెరుగుతుండటం ఆందోళన కలిగిస్తోందన్నారు. ఫ్యాటీ లివర్‌ సిర్రోసిస్‌గా మారి లివర్‌ కేన్సర్‌కు దారితీయడం, ఆల్కహాల్‌ ఎక్కువగా తీసుకోవడం ఇలా అనేక కారణాల వల్ల లివర్‌ దెబ్బతిని లివర్‌ కేన్సర్‌కు కారణమవుతున్నాయన్నారు. ఎలాంటి కారణం లేకుండా బరువు తగ్గడం, ఆకలి లేకపోవడం, జాండీస్‌ రావడం వంటి లక్షణాలుంటే నిపుణులైన గ్యాస్ట్రోఎంట్రాలజిస్ట్, లివర్‌స్పెషలిస్ట్‌ను సంప్రదించాలన్నారు.  ప్రస్తుతం లివర్‌ కేన్సర్‌కు ఆధునిక చికిత్సలు అందుబాటులో ఉన్నాయి. ముందుగానే గుర్తిస్తే లివర్‌ కేన్సర్‌ను చాలా వరకు పూర్తిగా నయం చేయవచ్చన్నారు.

కరోనాపై అవగాహన
ఖైరతాబాద్‌: కరోనా వైరస్‌ హై అలర్‌ నేపథ్యంలో గ్లెనిగల్స్‌ గ్లోబల్‌ హాస్పిటల్స్‌లో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై మైక్రోబయాలజీ అండ్‌ ఇన్‌ఫెక్షన్‌ డిసీజ్‌ సీనియర్‌ కన్సల్టెంట్‌ డాక్టర్‌ రంగనాథ్‌ ఎన్‌ అయ్యర్‌ సోమవారం అవగాహనా కార్యక్రమం నిర్వహించారు. హాస్పిటల్‌ సిబ్బంది, నర్సింగ్‌ స్టాఫ్, క్రిటికల్‌ కేర్‌ సిబ్బందికి జాగ్రత్తలపై పవర్‌ పాయింట్‌ ప్రజెంటేషన్‌ ద్వారా అవగాహన కల్పించారు. ప్రాణాంతకమైన కరోనా వైరస్‌ లక్షణాలతో ఎవరైనా ఆస్పత్రికి వచ్చినప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ముఖ్యంగా నర్సింగ్‌ స్టాఫ్, క్రిటికల్‌ కేర్‌ సిబ్బంది తరచూ చేతులు వాష్‌ చేసుకోవడం, తుమ్మినప్పుడు, దగ్గినప్పుడు అడ్డుగా కడ్‌చీప్‌లు, ఎన్‌ 95 మాస్క్‌లు ఉపయోగించాలన్నారు. వైరస్‌ సోకిన వ్యక్తి లాలాజలం, ఇతరత్రా ద్రవాలను తాకడం, ఆ చేతులను తిరిగి మనం ముఖంపై పెట్టుకోవడం వల్ల కరోనా వైరస్‌ ఒకరి నుంచి మరొకరికి వ్యాపిస్తుందని తెలిపారు. దీనికంటూ ప్రత్యేక చికిత్స ఏమీ ఉండదని, అవసరమైతే నగరంలో అందుబాటులో ఉన్న కరోనా వైరస్‌ పరీక్షలు చేయించాలన్నారు. ప్రతి ఒక్కరూ వ్యక్తిగత పరిశుభ్రత పాటించడం, దగ్గు, జలుబు ఉన్నవారితో దగ్గర సంబంధాలను కొనసాగించరాదని, జనసంచారం ఉన్న ప్రదేశాల్లో జాగ్రత్తలు పాటించడం, శ్వాసకోస ఇబ్బందులుంటే వెంటనే డాక్టర్‌ను సంప్రదించి తగిన పరీక్షలు చేయించుకోవాలని ఆయన సూచించారు. కార్యక్రమంలో హాస్పిటల్‌ క్రిటికల్‌ కేర్‌ స్పెషలిస్ట్‌ డాక్టర్‌ మనీందర్, ఇతర సిబ్బంది పాల్గొన్నారు.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top