జగిత్యాల...కేరాఫ్‌ గల్ఫ్‌

Gulf Migrant Labour Votes  Makes Difference In Telangana Elections - Sakshi

గల్ఫ్, ముంబయి వలస కుటుంబాలపై అభ్యర్థుల దృష్టి

కార్మికులను ప్రసన్నం చేసుకునేందుకు పాట్లు

ఇప్పటి నుంచే బయటిదేశాలకు ఫోన్‌కాల్స్‌

ముంబయి టు జగిత్యాలకు రవాణా ఖర్చులు

జిల్లావ్యాప్తంగా సుమారు లక్ష మంది ఓటర్లు

కాంగ్రెస్‌ మేనిఫెస్టోలో గల్ఫ్‌ బాధిత టుంబాలకు రూ. 5లక్షలు

జగిత్యాల.. గల్ఫ్, ముంబాయి వలసలకు కేరాఫ్‌గా పేరొందిన జిల్లా.. ఈ జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి సుమారు 40వేల మంది పొట్టకూటి కోసం బయటిదేశాలకు వెళ్లారు. సుమారుగా అంతేమంది జిల్లా నుంచి ముంబాయికి వలసవెళ్లారు. అవసరాలు, పరిస్థితులను బట్టి అప్పుడప్పుడు తమతమ స్వగ్రామాలకు వచ్చి వెళ్తుంటారు. ఏళ్లతరబడి ఈ రాకపోకల పరంపర కొనసాగుతోంది. అయితే.. వచ్చే నెల ఏడో తేదిన వీరి రాక కోసం వివిధ పార్టీలకు చెందిన ముఖ్యనేతలు ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. ఆరోజు జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో వీరితోపాటు వీరి కుటుంబ సభ్యుల ఓట్లు తమకే పడేలా చర్యలు తీసుకుంటున్నారు.

సాక్షి, జగిత్యాల: మేం గెలిస్తే.. మా పార్టీ అధికారంలోకి రాగానే అపరిష్కృతంగా ఉన్న గల్ఫ్‌ సమస్యలు పరిష్కరిస్తాం.. ఇక్కడ ఏ అవసరమొచ్చినా మీ కుటుంబాలకు అండగా ఉంటాం.అంటూ వాగ్దానాలు గుప్పిస్తున్నారు. తమతమ పార్టీల మేనిఫెస్టోల్లో అందుకు తగ్గట్టు హామీలను పొందుపర్చేందుకు సిద్ధమవుతున్నారు. తమ పార్టీ అధికారంలోకి వస్తే.. గల్ఫ్‌లో చనిపోయిన వారి కుటుంబాలకు రూ.5లక్షల ఆర్థిక సాయం చేస్తామని కాంగ్రెస్‌ పార్టీ ఇప్పటికే మేనిఫెస్టోలో పొందుపర్చింది. అందుకు తగ్గట్టు ప్రచారమూ జోరుగా నిర్వహిస్తోంది.

కాంగ్రెస్‌ మేనిఫెస్టోకు ఆకర్షితులై సుమారు 200 మంది గల్ఫ్‌ బాధిత కుటుంబాలు ఈనెల 4న.. జగిత్యాల మహాకూటమి అభ్యర్థి జీవన్‌రెడ్డిని కలిసి మద్దతు తెలిపారు. ఇటు టీఆర్‌ఎస్‌ సైతం ఇప్పటికే ప్రవాస పాలసీ అమలుపై చర్యలు తీసుకుంది. ఇప్పటికే నిజామాబాద్‌ ఎంపీ కల్వకుంట్ల కవిత తన పార్లమెంటు పరిధిలోని అన్ని అసెంబ్లీ సెగ్మెంట్లలో గల్ఫ్‌ సమస్యలపై స్పందించారు. ఈ క్రమంలో పరాయిదేశంలో చిక్కుకున్న, మృతిచెందిన వారికి తనవంతుగా సహాయం అందించారు. అన్ని పార్టీల అభ్యర్థులు తమ గెలుపునకు కలిసొచ్చే ఏ అవకాశాన్నీ వదులుకోకుండా జాగ్రత్తపడుతున్నారు.

జిల్లా నుంచి 40వేలకు పైగా..
జిల్లా పరిధిలోని జగిత్యాల, రాయికల్, కోరుట్ల, మెట్‌పల్లి, మల్లాపూర్, కథలాపూర్, మేడిపల్లి, సారంగాపూర్, ధర్మపురి, గొల్లపల్లి, ఇబ్రహీంపట్నం మండలాల్లోని అనేక గ్రామాల్లో ఇంటికి ఒకరిద్దరి చొప్పున సుమారు 40వేలకు పైగా మంది సౌదీఅరేబియా, దుబాయ్, షార్జా, మస్కట్, ఒమన్, కువైట్, ఖతర్‌ దేశాల్లో ఉంటున్నారు. ఎక్కువగా సౌదీ, దుబాయి, అబుదాబి, ఖతర్, షార్జాకు వెళ్తుంటారు. వీరిలో మంచి హోదాలో ఉన్నవారు 4వేలకు మించి ఉండరు.

మిగిలిన వారందరూ భవన నిర్మాణ కార్మికులుగా, వివిధ కంపెనీల్లో కూలీలుగా, సెక్యూరిటీ గార్డులుగా, హోటళ్లలో పనిచేస్తున్నారు. వీరందరూ చాలీచాలని వేతనాలతోపాటు అనేక సమస్యలతో సతమతమవుతున్నారు. వీరి సంక్షేమం కోసం ఎన్నో ఏళ్ల నుంచి అనేక హామీలు ఇస్తున్న ప్రభుత్వాలు.. అమలు చేయడంలో మాత్రం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నాయి.

ప్రవాసుల డిమాండ్లు ఇవి..!
రాష్ట్రంలో ప్రత్యేకంగా ప్రవాసీ సంక్షేమ మంత్రిత్వ శాఖను ఏర్పాటు చేయాలి.
సచివాలయంలో ఉన్న ఎన్నారై సెల్‌ను అందరికీ అందుబాటులో ఉండేలా బయట ఏర్పాటు చేయాలి. జిల్లా కేంద్రాల్లో హెల్ప్‌డెస్క్‌లు ఏర్పాటు చేయాలి.
విదేశాల్లో చనిపోయిన వారి కుటుంబాలను ఆర్థికంగా ఆదుకోవాలి.
విమానాశ్రయంలోనూ సహాయ కేంద్రం ఏర్పాటు చేయాలి.
తెల్లరేషన్‌కార్డు ఉంటేనే.. మృతదేహాలను విమానాశ్రయం నుంచి వారి ఇళ్లకు చేర్చే నిబంధనను సడలించాలి.
గల్ఫ్‌కు వలస వెళ్లిన వారి వివరాలు సేకరించాలి. వలసల కారణాలు..?ఏయే జిల్లాల నుంచి వలసలు ఉన్నాయి..? తెలుసుకోవాలి.
కేరళ తరహాలో ప్రవాసీల రక్షణకు ప్రత్యేక ఇన్సురెన్స్‌ పథకాన్ని ప్రవేశపెట్టాలి. వలస కార్మికులకు పునరావాసం కల్పించాలి. వలస వెళ్లిన కార్మికుల పేర్లను రేషన్‌కార్డుల నుంచి తొలగించొద్దు.
వివిధ కారణాలతో విదేశాల్లోని జైళ్లలో మగ్గుతున్న వారి విడుదలకు కృషి చేయాలి.

కేంద్రం చేయాల్సినవి
ఎంబసీలలో తెలుగు అధికారులను నియమించాలి.  

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top