ఆత్మహత్యలను తొక్కిపెడుతున్న టీడీపీ

ఆత్మహత్యలను తొక్కిపెడుతున్న టీడీపీ - Sakshi

  • మాజీ ఎంపీ అనంత వెంకట్రామిరెడ్డి

  •  ‘పచ్చ’ పత్రికల తీరు దారుణం

  •  అనంతపురం జిల్లా నేతలతో వైఎస్ జగన్ సమీక్షా సమావేశం

  • సాక్షి, హైదరాబాద్: అనంతపురం జిల్లాలో 60 మంది రైతులు ఆత్మహత్యకు పాల్పడితే బయటి ప్రపంచానికి తెలియకుండా టీడీపీ ప్రభుత్వం, దాని అనుకూల పత్రికలు తొక్కి పెడుతున్నాయని మాజీ ఎంపీ అనంత వెంకటరామిరెడ్డి విమర్శించారు. రాష్ట్ర విభజన తరువాత కనీవినీ ఎరుగని రీతిలో కరువు సంభవించినందున అనంత జిల్లాలో గ్రామాలకు గ్రామాలు ఖాళీ అవుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు.



    అనంతపురం జిల్లా వైఎస్సార్‌సీపీ నేతలతో అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి సోమవారం హైదరాబాద్‌లో సమీక్షా సమావేశం నిర్వహించారు. అనంతరం మీడియాతో మాట్లాడిన అనంత టీడీపీ ప్రభుత్వ వైఖరిని దుయ్యబట్టారు. సమస్యలతో సతమతమవుతున్న రైతులు బలవన్మరణాలకు పాల్పడు తుంటే జిల్లా మంత్రి ఆత్మహత్యలు లేనేలేవని ప్రకటనలు చేస్తున్నారని విమర్శించారు.



    జగన్ సమక్షంలో జరిగిన జిల్లా సమీక్షలో పార్టీ నిర్మాణం గురించి ప్రధానంగా చర్చించామని పార్టీ జిల్లా అధ్యక్షుడు ఎం. శంకరనారాయణ తెలిపారు. కదిరి ఎమ్మెల్యే అత్తారు చాంద్‌బాష, మాజీ ఎమ్మెల్యేలు బి.గురునాథరెడ్డి, కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డి, ఇతర నేతలు బోయ తిప్పేస్వామి, తోపుదుర్తి ప్రకాశ్‌రెడ్డి, నవీన్ నిశ్చల్, ఏ.సాంబశివారెడ్డి,  సోమశేఖర్‌రెడ్డి, శ్రీధర్‌రెడ్డి, వి.ఆర్.రామిరెడ్డి, రమేష్‌రెడ్డి, వై.వెంకట్రామిరెడ్డి సమీక్షా సమావేశంలో పాల్గొన్నారు.  

     

    తెలుగు మహిళ నేత చేరిక



    తెలుగు మహిళ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఉషారాణి సోమవారం జగన్ సమక్షంలో వైఎస్సార్ కాంగ్రెస్‌లో చేరారు. ఆమెకు జగన్ పార్టీ కండువా వేసి ఆహ్వానం పలికారు.

     

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top