గ్రావిటీ కాల్వ రెడీ!

Gravity Canal Is Ready For Usage - Sakshi

కన్నెపల్లి పంప్‌హౌస్‌ నుంచి అన్నారం వరకు..

13.341 కిలోమీటర్ల కాల్వ నిర్మాణం పూర్తి

దానికి ఇరువైపులా రోడ్డు ఏర్పాటు

ఖరీఫ్‌కు 2 టీఎంసీల నీరు తరలింపే లక్ష్యం

కాళేశ్వరం: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన కాళేశ్వరం ప్రాజెక్టులోని నీటిని తరలించే అతి ముఖ్యమైన గ్రావిటీ కాల్వ నిర్మాణం పూర్తయింది. జయశంకర్‌ భూపాలపల్లి జిల్లా మహదేవపూర్‌ మండలం కన్నెపల్లి పంపుహౌస్‌ నుంచి అడవి మార్గంలో 13.341 కిలోమీటర్ల దూరం రూ.800 కోట్ల వ్యయంతో నిర్మించిన గ్రావిటీ కాల్వ ద్వారా ఈ ఖరీఫ్‌ నుంచి రోజుకు 2 టీఎంసీల నీటిని తరలించనున్నారు. ఈ గ్రావిటీ కాల్వ నిర్మాణాన్ని 30 స్ట్రక్చర్లతో అత్యాధునిక టెక్నాలజీని వినియోగించి అతి తక్కువ సమయంలో పూర్తి చేశారు. వచ్చే నెల నుంచి రాష్ట్రంలోని 37లక్షల ఎకరాలకు ఈ కాల్వ ద్వారా సాగునీరు సరఫరా కానుంది. భవిష్యత్‌లో 3 టీఎంసీల సాగునీరు తరలించేలా కాల్వ నిర్మాణం చేపట్టారు. ప్రస్తుతం కన్నెపల్లి పంపుహౌస్‌లో 7 మోటార్ల బిగింపు పూర్తి కాగా మరో 2 నిర్మాణ దశలో, మరో రెండు పురోగతిలో ఉన్నాయి.  

అనతి కాలంలోనే పనులు పూర్తి
కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణానికి 2016, మే 2న ముఖ్యమంత్రి కేసీఆర్‌ భూమి పూజ చేయగా.. అనతి కాలంలోనే పనులన్నీ పూర్తి చేసి నీటిని తరలించడానికి సిద్ధం చేశారు. కాళేశ్వరం వద్ద గోదావరి, ప్రాణహిత జలాలను వినియోగించి రాష్ట్రంలోని 37 లక్షల ఎకరాలకు సాగు నీరందించడానికి ఈ ప్రాజెక్టును రూపకల్పన చేయగా అటవీ, పర్యావరణ శాఖ అనుమతులకు సంబంధించి అడ్డంకులు త్వరగా తొలగిపోవడంతో గ్రావిటీ కెనాల్‌ (కాల్వ) పనులు పూర్తయ్యాయి. మేడిగడ్డ బ్యారేజీ వద్ద గోదావరికి అడ్డుకట్ట వేసి నిలిపిన నీటిని అప్రోచ్‌ కెనాల్‌ ద్వారా కన్నెపల్లి పంప్‌హౌస్‌లో అమర్చిన 11 మోటార్ల సాయంతో రివర్స్‌ పంపింగ్‌ ద్వారా తరలించడానికి సన్నాహాలు జరుగుతున్నాయి. పంప్‌హౌస్‌ నుంచి 1.5 కిలోమీటర్ల దూరం పైపులైన్‌ పూర్తయింది. ఈనెల 4న సీఎం కేసీఆర్‌ పనులను క్షేత్రస్థాయిలో పరిశీలించిన సందర్భంగా జూలై నుంచి నీటిని తరలించడానికి సమన్వయంతో పనిచేయాలని కాంట్రాక్టర్లు, ఇంజనీర్లకు మార్గనిర్దేశం చేశారు. దీంతో పనుల్లో వేగం మరింత పెరిగింది.  

పర్యాటక అభివృద్ధికి అడుగులు 
ఈ గ్రావిటీ కాల్వ పొడవునా అందమైన రిసార్ట్సు, గెస్ట్‌హౌస్‌ల నిర్మాణానికి పర్యాటక శాఖ అడుగులు వేస్తుంది. ఇప్పటికే ఓ ప్రత్యేక బృందం హైదరాబాద్‌ నుంచి వచ్చి పరిశీలించి ప్రణాళికలు తయారు చేసింది. త్వరలో బోటింగ్‌ పాయింట్స్‌ కూడా పెట్టనున్న ట్లు తెలిసింది. దీనికి అనుగుణంగా పర్యాటకులకు ఆ హ్లాదాన్ని అందించడానికి ప్రభుత్వం ఆలోచిస్తుంది.

కాల్వ నిర్మాణం ఇలా..

కన్నెపల్లి పంప్‌హౌస్‌ నుంచి అన్నారం వరకు 13.341 కిలోమీటర్ల వరకు అడవిలో కాల్వ 150–250 మీటర్ల వెడల్పు.. అడుగు భాగంలో 76 మీటర్లతో నిర్మాణం చేపట్టారు. రోజుకు 2 టీఎంసీల నీటిని తరలిస్తే కాల్వలో 5.5 మీటర్ల నీరు ప్రవహిస్తుంది. అదే 3 టీఎంసీలు తరలిస్తే 7.5 మీటర్ల నీరు వెళ్లేలా కాల్వ లైనింగ్‌ పూర్తి చేశారు.  

అధునాతన పద్ధతులతో 30 స్ట్రక్చర్లు 

గ్రావిటీ కాల్వలో 30 స్ట్రక్చర్లు నిర్మాణం చేపట్టారు. ప్రత్యేకమైన ఏడు పద్ధతులతో దీనిని నిర్మించారు. ఇందులో డీఎల్‌ఆర్‌ వంతెనలు 4, అండర్‌ టన్నెల్‌ వంతెనలు 8, ఎకో వంతెనలు 5, సూపర్‌స్పాసేజ్‌ వంతెనలు 5, ఇన్‌లెట్‌ వంతెనలు 6, పైపులైన్‌ వంతెన 1, డ్రాప్స్‌ వంతెన ఒకటి నిర్మించారు. 

  •   సూపర్‌ స్పాసేజ్‌ వంతెనల ద్వారా అడవుల నుంచి, వాగుల ద్వారా పారే కాల్వ ల నీటిని ఇతర చెరువులకు తరలిస్తారు.  
  •   అండర్‌ టన్నెల్‌ వంతెనల ద్వారా కాల్వ కింద ఉన్న బెడ్‌ నుంచి నీటిని తరలిస్తారు.  
  •   ఇన్‌లెట్‌ వంతెనల ద్వారా చిన్న వర్షాలకు వచ్చే నీటిని యథావిధిగా కాల్వ గుండా తరలిస్తారు.  
  •   ఎకో వంతెనలు అడవుల్లోని వన్యప్రాణులు ఇటు నుంచి అటు తిరగడానికి వీలుగా నిర్మించారు. వాటికి అనుగుణంగా అక్కడక్కడా చెట్ల పెంపకం చేపట్టనున్నారు.  
  •   కాల్వను పరిశీలించడానికి ఇరువైపుల రోడ్డు నిర్మాణం జరుగుతోంది. ఎడమ వైపు 5.5, కుడి వైపు 1.8 కిలోమీటర్లు పూర్తయింది.   
Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top