‘కాళేశ్వరం’ చంద్రశేఖర్‌రావు!

Governor Narasimhan names CM KCR in Kaleshwaram project visit - Sakshi

సీఎం కేసీఆర్‌పై గవర్నర్‌ ప్రశంసలు

ప్రాజెక్టు న భూతో న భవిష్యత్‌

హరీశ్‌ తనువంతా కాళేశ్వరమే.. చరిత్రలో నిలిచిపోతాడు

‘కాళేశ్వరం’తో అన్ని రంగాల్లో తెలంగాణ అభివృద్ధి

ప్రాజెక్టు సందర్శనలో గవర్నర్‌ నరసింహన్‌

సాక్షి ప్రతినిధి, కరీంనగర్‌ :  ‘కాళేశ్వరం ఎత్తిపోతల పథకంపై రెండేళ్ల క్రితం ముఖ్యమంత్రి చంద్రశేఖర్‌రావు ప్రజెంటేషన్‌ ఇచ్చారు. అది చూసి.. కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావా..? కలల చంద్రశేఖర్‌ రావా..? అనిపించింది. ఇప్పుడు ప్రాజెక్టు చూశాక అభిప్రాయం మారింది. కేసీఆర్‌.. కాళేశ్వరం చంద్రశేఖర్‌రావుగా మారిపోయారనిపిస్తోంది. కాళేశ్వరం ప్రాజెక్టు న భూతో న భవిష్యత్‌’ అని కేసీఆర్‌పై గవర్నర్‌ నరసింహన్‌ ప్రశంసల వర్షం కురిపించారు. మంత్రి హరీశ్‌రావు పేరు కూడా కాళేశ్వర్‌రావుగా చరిత్రకెక్కుతుందని కితాబిచ్చారు.

కాళేశ్వరం ప్రాజెక్టు ఓ అద్భుతమని.. రాష్ట్ర ప్రజల ఆశలు, ఆకాంక్షలు నెరవేర్చేలా రూపుదిద్దుకుంటున్న ఈ ప్రాజెక్టు పూర్తయితే వ్యవసాయ, పారిశ్రామిక రంగాలతోపాటు ఆర్థికాభివృద్ధి జరుగుతుందని, తాగునీరూ అందుతుందని పేర్కొన్నారు. భారీ నీటిపారుదల శాఖ మంత్రి హరీశ్‌రావుతో కలసి కాళేశ్వరం ప్రాజెక్టు పనులను శనివారం గవర్నర్‌ పరిశీలించారు. జయశంకర్‌ భూపాలపల్లి జిల్లా కన్నెపల్లి మొదలుకుని కరీంనగర్‌ జిల్లా రామడుగు మండలం లక్ష్మీపూర్‌ అండర్‌ టన్నెల్, సర్జ్‌పూల్‌ వరకు పరిశీలన సాగింది.

ఈ సందర్భంగా లక్ష్మీపూర్‌ ప్రాజెక్టు వద్ద విలేకరులతో గవర్నర్‌ మాట్లాడారు. రెండేళ్ల కిందట అంకురార్పణ జరిగిన ఈ ప్రాజెక్టు చూడాలని ఇటీవల సీఎం కేసీఆర్, మంత్రి హరీశ్, నీటి పారుదల శాఖ ఉన్నతాధికారులకు చెప్పానని.. ఆ క్రమంలోనే ప్రాజెక్టు సందర్శనకు వచ్చానని చెప్పారు.
 
గుప్త నదిగా గోదావరి
ఇప్పటి వరకు మ్యాప్‌ల ద్వారానే కాళేశ్వరం గురించి తెలుసుకున్నానని.. కానీ క్షేత్రస్థాయి పరిశీలనలో పనులు జరుగుతున్న తీరుకు ఆశ్చర్యపోయానని గవర్నర్‌ అన్నారు. ‘ప్రాజెక్టు ప్రతి భాగాన్ని పరిశీలించా.. దేనికదే అద్భుతం.. ప్యాకేజీ–6లో గోదావరి నదినే అంతర్వాహినిగా పట్టుకొచ్చారు. సర్జ్‌పూల్‌ చూసినప్పుడు అదొక ఇంజినీరింగ్‌ అద్భుతం అనిపించింది. ఇంతకాలం సరస్వతి నది మాత్రమే గుప్త నదిగా ఉండేది. ఇప్పుడు గోదావరినీ వీళ్లు గుప్త నదిగా మార్చారు’ అని గవర్నర్‌ కితాబిచ్చారు. కాళేశ్వరం ప్రాజెక్టులోని అన్ని ప్యాకేజీల పనులూ క్షుణ్నంగా పరిశీలించానని, జూన్‌ నాటికి మొదటి దశ పనులు పూర్తవుతాయని ఆశిస్తున్నానని పేర్కొన్నారు.  

8 గంటల పాటు పరిశీలన..
భూపాలపల్లి జయశంకర్, పెద్దపల్లి, కరీంనగర్‌ జిల్లాల్లో కాళేశ్వరం పనులను మంత్రి హరీశ్‌తో కలసి 8 గంటల పాటు గవర్నర్‌ దంపతులు పరిశీలించారు. శనివారం ఉదయం 9 గంటలకు హెలికాప్టర్‌ ద్వారా కాళేశ్వరం చేరుకున్న గవర్నర్‌ నరసింహన్, ఆయన సతీమణి విమలా నరసింహన్‌.. కాళేశ్వరం ఆలయంలో పూజలు నిర్వహించారు. అక్కడి నుంచి కన్నెపల్లికి చేరుకుని పనులు పరిశీలించారు.

అనంతరం కాళేశ్వరం ప్రాజెక్టులో కీలకమైన మేడిగడ్డ ప్రాంతాన్ని హెలికాప్టర్‌ నుంచి తిలకించారు. కన్నెపల్లి నుంచి లక్ష్మీపూర్‌ వరకు ఒక్కో పనిని చూపిస్తూ, దాని ప్రాధాన్యత, ఆవశ్యకత, అవసరాలను గవర్నర్‌కు హరీశ్‌ వివరించారు. మేడిగడ్డ వద్ద ప్రాణహిత, గోదావరి నదులు కలవడం వల్ల ఏడాది పొడవునా నీళ్లుంటాయని, రోజుకు 2 టీఎంసీల చొప్పున 90 రోజుల పాటు 180 టీఎంసీల నీళ్లు ఎత్తిపోసి, రైతులకు సాగునీరందిస్తామని తెలిపారు.

హరీశ్‌రావు.. కాళేశ్వర్‌రావు
‘మంత్రి హరీశ్‌రావు తనువంతా కాళేశ్వరం ప్రాజెక్టే.. ఆయన ధ్యాసంతా కాళేశ్వరం తప్ప మరోమాట లేదు. హరీశ్‌రావును కాళేశ్వర్‌రావు అని పిలిస్తే బాగుంటుంది’అంటూ హరీశ్‌ను గవర్నర్‌ ప్రశంసించారు. నీటిపారుదల శాఖ కార్యదర్శి ఎస్‌.కె.జోషి చాలా జోష్‌గా పని చేస్తున్నారని.. ఆయన పనితీరు బాగుందన్నారు.

బిహార్, జార్ఖండ్‌ రాష్ట్రాల కార్మికులకు ప్రాజెక్టు ద్వారా ఉపాధి కలుగుతోందని, వారితోనూ మాట్లాడానని చెప్పారు. వాళ్లెలా ఉంటున్నారు..? ఎక్కడ ఉంటున్నారు..?భోజనం, వసతి ఎలా ఉంది..? వైద్యం అందుతోందా, ప్రావిడెంట్‌ ఫండ్‌..? అన్నింటిపై ఆరా తీశానని, వారు సంతృప్తి వ్యక్తం చేశారన్నారు. ‘మీ (మీడియా) ఆశీర్వాదం ఉంటే అన్నీ పూర్తవుతాయి’అని గవర్నర్‌ వ్యాఖ్యానించారు.  

మళ్లీ టన్నెల్‌లోకి మంత్రి
ధర్మారం (ధర్మపురి): ఉదయం నుంచి సాయంత్రం వరకు గవర్నర్‌ దంపతులతో కాళేశ్వరం ప్రాజెక్టుల నిర్మాణ పనులు సందర్శించిన మంత్రి హరీశ్‌ గవర్నర్‌తోపాటే వెళ్లిపోతారని అధికారులు భావించారు. అనూహ్యంగా గవర్నర్‌ దంపతులను హైదరాబాద్‌ పంపించిన మంత్రి.. రాత్రి 8 నుంచి అర్ధరాత్రి వరకు ధర్మారం మండలంలో కొనసాగుతున్న ప్యాకేజీ 6, 7 టన్నెల్‌లో దిగి నిర్మాణ పనులు పర్యవేక్షించారు. రాత్రి 12 గంటలకు సాయంపేట నవయుగ క్యాంపు కార్యాలయంలో ఇంజనీరింగ్‌ అధికారులతో రివ్యూ సమావేశం ఏర్పాటు చేయనున్నట్లు సమాచారం. నీటిపారుదల ముఖ్యకార్యదర్శి జోషి, ఇంజినీర్‌ ఇన్‌ చీఫ్‌ మురళీధర్‌రావు భేటీలో పాల్గొనేందుకు వచ్చినట్లు తెలిసింది.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top