భారతరత్న, మాజీ రాష్ట్రపతి డాక్టర్ అబ్దుల్ కలాం మానవత్వానికి నిలువుటద్దమని ఉభయ రాష్ట్రాల గవర్నర్ ఈఎస్‌ఎల్ నరసింహన్ కొనియాడారు.
హైదరాబాద్ : భారతరత్న, మాజీ రాష్ట్రపతి డాక్టర్ అబ్దుల్ కలాం మానవత్వానికి నిలువుటద్దమని ఉభయ రాష్ట్రాల గవర్నర్ ఈఎస్‌ఎల్ నరసింహన్ కొనియాడారు. దేశం ముందు.. తర్వాతే అన్నీ అని ఆచరణలో చూపించిన యోధుడు కలాం అని చెప్పారు. ఆయనతో కలసి పనిచేయటం ఈ జన్మలో చేసుకొన్న అదృష్టమని గుర్తు చేసుకొన్నారు. వందేమాతరం ఫౌండేషన్ ఆధ్వర్యంలో గురువారం డాక్టర్ అబ్దుల్ కలాం జయంతి సందర్భంగా ఇన్నోవేషన్ ఫెస్టివల్ నిర్వహించారు. ఈ సందర్భంగా గవర్నర్ చేసిన స్ఫూర్తి దాయకమైన ప్రసంగం విద్యార్థులను విశేషంగా ఆకట్టుకొంది. ఈ సందర్భంగా గవర్నర్ మాట్లాడుతూ...రాష్ట్రప్రతి భవన్‌ను ప్రజా భవన్‌గా మార్చిన మహానుభావుడు కలాం అని కొనియాడారు.
ఆయన్ను ఆదర్శంగా తీసుకుని విద్యార్థులు, యువత జ్ఞానాన్ని సంపాదించుకోవాలని సూచించారు. విద్య మానవ విలువలు పెంచేదిగా ఉండాలన్నారు. నేటి విద్య సంపాదనకు, విదేశీ పర్యటనల కోసం ఉపయోగపడేది ఉందని తెలిపారు. చిన్న వయస్సులోనే తల్లిదండ్రులు, గురువులు విద్యార్థుల్లో జాతీయ స్ఫూర్తి నింపాలని చెప్పారు. ఆయన జయంతి సందర్భంగా ఉన్నతమైన విలువలు పెంపొందించుకొంటే, కలాం ఆశయాలకు అందరం పునరంకితమైనట్లేనని తెలిపారు. 'బడికి పోదాం..కలాం కలలు నెరవేరుద్దాం' అంటూ వందేమాతరం ఫౌండేషన్ తీసుకొన్న కార్యక్రమం పాఠశాల విద్యార్థుల్లో స్ఫూర్తిని నింపాలని కోరారు. వందేమాతరం ఫౌండేషన్ మంచి మంచి కార్యక్రమాలు నిర్వహిస్తోందని చెప్పారు. అనంతరం కౌన్సిల్ ఫర్ గ్రీన్ రెవల్యూషన్ చైర్మన్ లీలా లక్ష్మారెడ్డి, కేర్ హాస్పిటల్ ఫౌండర్ కృష్ణారెడ్డి, రాష్ట్రపతి అవార్డు గ్రహీత, ఉత్తమ ఉపాధ్యాయురాలు ఉషా రెడ్డి మాట్లాడారు.