పండిద్దాం.. తినేద్దాం..

Government Trying To Implement Vegetable Colonies In Khammam - Sakshi

జిల్లాలో క్రాప్‌ కాలనీలపై దృష్టి 

8 మండలాల్లో కూరగాయల కాలనీల ఏర్పాటు 

1,700 ఎకరాల్లో రూ.4కోట్లతో ప్రతిపాదనలు 

సాక్షి, ఖమ్మం: జిల్లాలోనే కూరగాయలు పండించి.. అమ్ముకునే విధంగా ప్రభుత్వం కొత్త ఆలోచనలకు శ్రీకారం చుట్టింది. బయటి మార్కెట్‌లో ప్రస్తుతం కూరగాయల ధరలు మండిపోతుండడం.. సామాన్యుడు కొని.. తినలేని పరిస్థితులు నెలకొనడంతో ప్రభుత్వం ఉద్యానవన శాఖ ఆధ్వర్యంలో కూరగాయల కాలనీల ఏర్పాటుకు పూనుకుంది. అన్ని రకాల కూరగాయలు పండించేలా చర్యలు చేపట్టింది. వీటితోపాటు పండ్ల తోటల పెంపకం కోసం రైతులకు రాయితీలు ఇచ్చేందుకు ప్రతిపాదనలు సిద్ధం చేస్తోంది. ఇవన్నీ అమలులోకి వస్తే బహిరంగ మార్కెట్‌లో అన్ని రకాల కూరగాయలు అందుబాటులో ఉండడంతోపాటు చౌక ధరలకు లభ్యమవుతాయి.  

క్రాప్‌ కాలనీలను ఏర్పాటు చేయడంలో భాగంగా ఉద్యానవన శాఖ ద్వారా ప్రతిపాదనలు రూపొందించి.. అమలు చేయాలని ప్రభుత్వం సంకల్పించింది. ఇందులో భాగంగా ఆ శాఖ జిల్లాలోని 8 మండలాలను క్రాప్‌ కాలనీల కోసం ఎంపిక చేసింది. ప్రస్తుతం ఖమ్మం నగరానికి రోజుకు 15 నుంచి 20 టన్నుల కూరగాయలు అవసరం కాగా.. ఇందులో అత్యధిక భాగం ఇతర జిల్లాల నుంచి దిగుమతి చేసుకునే పరిస్థితి ఉంది. జిల్లాలో పండించే కూరగాయలు.. నగర ప్రజల అవసరాలతోపాటు జిల్లా ప్రజల అవసరాలను పూర్తిస్థాయిలో తీర్చలేకపోతున్నాయి.

దీంతో ఖమ్మం నగరానికి కూరగాయలను తాజాగా.. తెల్లవారుజాము వరకు తెచ్చే రవాణా సౌకర్యం ఉండే ప్రాంతాలను, నగరానికి అత్యంత సమీపంలో ఉండే ప్రాంతాల్లో కూరగాయల కాలనీలు ఏర్పాటు చేసి అక్కడ అన్ని రకాల కూరగాయలను ఉత్పత్తి చేసేందుకు సిద్ధమవుతున్నారు.  

1,700 ఎకరాల్లో సాగు.. 
జిల్లాలోని 1,700 ఎకరాల్లో కూరగాయల కాలనీలు ఏర్పాటు చేసి.. అందులో సాగు చేపట్టేందుకు ఉద్యానవన శాఖ సమాయత్తమవుతోంది. కూరగాయల కాలనీలను ఏర్పాటు చేసేందుకు మొత్తం 8 మండలాలను ఎంపిక చేశారు. ఇక్కడ పండించిన పంటలను ఖమ్మం కార్పొరేషన్‌తోపాటు రైతుబజార్‌లో.. ఇతర ప్రాంతాల్లో విక్రయించుకునే వీలుంటుంది. అయితే క్రాప్‌ కాలనీల ఏర్పాటు కోసం రూ.4కోట్ల నిధులు అవసరం ఉంటాయని ప్రతిపాదనలు పంపించింది. పంట సాగు, విత్తనాలు, ఎరువులు, సూక్ష్మసేద్యం, మల్చింగ్, పందిళ్లు, పండించిన కూరగాయలను నిల్వ చేసుకునేందుకు గదుల నిర్మాణం తదితర వాటి కోసం ఈ నిధులు అవసరం ఉంటాయని ఉద్యానవన శాఖ ప్రతిపాదనల్లో పేర్కొంది. ఇక కూరగాయల కాలనీల్లో 1,705 మెట్రిక్‌ టన్నులను ఉత్పత్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు.  

పండ్ల తోటల సాగుకు రాయితీ.. 
కూరగాయల కాలనీతోపాటు తాజా పండ్లను తక్కువ ధరకు ప్రజలకు అందించాలనే లక్ష్యంతో ప్రభుత్వం సమగ్ర ఉద్యాన మిషన్‌ పేరుతో పండ్ల తోటలను సాగు చేసేందుకు సిద్ధమవుతోంది. ఇందులో భాగంగా జిల్లాలో పండ్ల తోటలను సాగు చేసేందుకు ముందుకొచ్చే రైతులకు రాయితీ అందించాలని నిర్ణయించారు. మూడేళ్ల కాలంలో మొక్కలకు, ఎరువులకు, సాగుకు సంబంధించి రాయితీలు ఉంటాయి. ఇందులో భాగంగా మామిడిని 47 ఎకరాల్లో, నిమ్మ 16, జామ 43, దానిమ్మను 14 ఎకరాల్లో పండించాలని ఉద్యానవన శాఖ అధికారులు ప్రతిపాదనలు సిద్ధం చేశారు.  

అధిక ధరలతో.. 
కూరగాయలు బహిరంగ మార్కెట్‌లో అధిక ధర పలుకుతున్నాయి. సీజన్‌లో కొన్ని కూరగాయలు ఇతర జిల్లాల నుంచి దిగుమతి చేసుకోవాల్సి ఉండడంతో వాటి ధరలు సామాన్యులకు అందుబాటులో ఉండడం లేదు. వర్షాకాలంలో కొంత తక్కువగా ఉండే ధరలు.. వేసవిలో మాత్రం చుక్కలను అంటుతున్నాయి. వేసవిలో సామాన్యులు కూరగాయలు కొనుగోలు చేయలేని పరిస్థితి. కిలో రూ.80 నుంచి రూ.100 కూడా పలికిన సందర్భాలు ఉంటున్నాయి. కొంతకాలంగా జిల్లాలో కూరగాయ పంటల సాగు గణనీయంగా తగ్గింది.

దీంతో వీటి ధరలు కూడా విపరీతంగా పెరిగాయి. ఈ క్రమంలో జిల్లా ప్రజల అవసరాలను తీర్చేందుకు పెద్ద ఎత్తున కూరగాయల సాగు చేపట్టాలని ఉద్యానవన శాఖ నిర్ణయించింది. కూరగాయల కాలనీలు అందుబాటులోకి వస్తే వేసవి కాలంలోనూ కూరగాయల ధరలు సామాన్యులకు అందుబాటులో ఉండే అవకాశం ఉంది.  
 
ప్రయోజనకరం.. 
క్రాప్‌ కాలనీల కోసం ప్రణాళికలు సిద్ధం చేశాం. ప్రభుత్వం అనుమతి ఇచ్చిన తర్వాత కార్యాచరణ ప్రారంభిస్తాం. తక్కువ విస్తీర్ణంలో కూరగాయల పంట సాగు చేసుకుని విక్రయించుకోవడం ద్వారా రైతులకు ప్రయోజనం ఉంటుంది. నగర పరిసరాల్లోని మండలాల్లో కూరగాయల పంటలు సాగు చేసుకోవడం ద్వారా ఆయా రైతులు నగరంలో పంటను విక్రయించుకునే అవకాశం ఉంది. ప్రభుత్వ ఆదేశాల మేరకు క్రాప్‌ కాలనీలకు తగిన చర్యలు తీసుకుంటాం.  
– జి.అనసూయ, జిల్లా ఉద్యాన, పట్టు పరిశ్రమాభివృద్ధి శాఖ అధికారి 

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top