వలస కూలీలకు అండగా ప్రభుత్వ టీచర్లు 

Government Teachers Helping Migrant Workers At Nizamabad District - Sakshi

నిజామాబాద్‌ జిల్లా పెర్కిట్, ముప్కాల్, పోచంపాడ్‌ల వద్ద అన్నదాన కేంద్రాలు

మూడు షిఫ్టులుగా పని చేస్తున్న ఉపాధ్యాయులు

వీరి సేవలను గుర్తించి ముందుకు వస్తున్న దాతలు 

ఆర్మూర్‌: లాక్‌డౌన్‌ వేళ పొట్ట చేత పట్టుకొని చిన్న పిల్లలను చంకన ఎత్తుకొని ఇతర రాష్ట్రాలలోని తమ స్వగ్రామాలకు కాలి నడకన వెళుతున్న వలస కార్మికులకు అండగా మేమున్నామంటూ.. నిజామాబాద్‌ జిల్లా బాల్కొండ, ముప్కాల్, మెండోర మండలాలకు చెందిన ప్రభుత్వ ఉపాధ్యాయులు ముందుకు వచ్చారు. ఈ మూడు మండలాల విద్యాధికారి బట్టు రాజేశ్వర్‌ ఆధ్వర్యంలో సుమారు వంద మంది ఉపాధ్యాయులు స్వచ్ఛందంగా కొంత మొత్తాన్ని పోగు చేసుకున్నారు. గత నెల 16 నుంచి 44వ నంబర్‌ జాతీయ రహదారిపై ఆర్మూర్‌ పట్టణం పెర్కిట్‌ శివారుతోపాటు ముప్కాల్, పోచంపాడ్‌ చౌరస్తాల్లో వలస కార్మికులకు భోజనాన్ని అందిస్తున్నారు.

దాతల సహకారంతో కొనుగోలు చేసిన వంట సామగ్రితో ముప్కాల్, మెండోర కేజీబీవీలలో అన్నం, కూరగాయలు వండిస్తున్నారు. అలాగే రొట్టెలను కూడా తయారు చేయిస్తున్నారు. ఉపాధ్యాయులు ఈ వంటకాలను మూడు కేంద్రాల్లోకి తరలించి.. మూడు షిఫ్టులుగా పనిచేస్తూ జాతీయ రహదారి వెంట కాలినడకన, లారీలు, ఇతర వాహనాల్లో వెళుతున్న వలస కార్మికులకు భోజనంతోపాటు చల్లని నీళ్లు, మజ్జిగ, గ్లూకోజ్, పండ్లు అందిస్తున్నారు. ఇలా ప్రతిరోజూ 500 పైగా కార్మికులకు భోజనాన్ని అందిస్తున్నారు. పెర్కిట్‌ శివా రులోని అన్నదాన కేంద్రం నిర్వహణకు రూ.40 వేలు, ముప్కాల్, పోచంపాడ్‌ చౌరస్తా కేంద్రాల్లో రూ.12 వేల చొప్పున ప్రతి రోజు ఖర్చవుతోంది. ఉపాధ్యాయుల సేవలను గుర్తించిన చాలామంది దాతలు ముందుకు వచ్చి ఆర్థిక సహాయాన్ని అందజేస్తున్నారు. ఉపాధ్యాయులు ప్రతిరోజూ ఉదయం 9 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు జాతీయ రహదారిపై ఉంటూ వలస కార్మికుల కడుపులు నింపుతున్నారు.

సమష్టి కృషితో సాధిస్తున్నాం.. 
బాల్కొండ, ముప్కాల్, మెండోర మండలాలకు చెందిన ప్రభుత్వ ఉపాధ్యాయుల సమష్టి కృషితో ఈ కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహిస్తున్నాం. దాతలు కూడా ముందుకు రావడం చాలా తోడ్పాటుగా ఉంది. ఉపాధ్యాయులు ఇలాంటి సేవా కార్యక్రమాల్లో నిస్వార్థంగా పాల్గొనడం అభినందనీయం. కాలి నడకన వెళుతున్న కార్మికుల వెతలు చూడలేక మేము ప్రారంభించిన ఈ కార్యక్రమంలో ప్రతి రోజూ 500 మందికి పైగా భోజనాన్ని అందిస్తున్నాం. – బట్టు రాజేశ్వర్, ఎంఈవో, బాల్కొండ

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top