
యార్డులో కందులను కొనుగోలు చేస్తున్న దృశ్యం
జైనథ్(ఆదిలాబాద్) : మండల కేంద్రంలోని మార్కెట్ యార్డులో కందుల కొనుగోలు కేం ద్రం ప్రారంభమైన నేపథ్యంలో రైతులు అంతా మార్కెట్‌పై ఆశలు పెట్టుకున్నారు. ఇంకా మండలంలో పూర్తి స్థాయిలో కందులు చేతికి రాకపోవడంతో, రైతులు కోత కార్యక్రమాల్లో బిబీబిజీగా ఉన్నారు. ప్రభుత్వం క్వింటాల్‌కు రూ. 5250 కనీస మద్దతు ధరకు రూ. 200 బోనస్ కలిపి రూ. 5450 చెల్లించి కొనుగోలు చే స్తుండటంతో అందరి దృష్టి మార్కెట్‌పై పడిందని చెప్పవచ్చు. జైనథ్ మండలంలోని సరిహద్దు గ్రామాల నుంచి మహారాష్ట్ర కందులు భారీగా వచ్చే అవకాశం ఉండటంతో అధికారులు కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటున్నారు. ఈ మధ్యనే రెవెన్యూ, వ్యవసాయ శాఖ అధి కారులు గ్రామాల వారీగా కంది రైతుల నిర్ధారణకు సర్వే సైతం నిర్వహించారు. సర్వేలో గుర్తించిన రైతులకు మాత్రమే కూపన్లు ఇస్తామని అధికారులు చెబుతున్నారు. కాగా ఇప్పటికే మండల కేంద్రమైన జైనథ్‌తో పాటు సరి హద్దు గ్రామాల్లో భారీగా మహారాష్ట్ర కందులు డంపు అయినట్లు పుకార్లు వినిపిస్తున్నాయి. దీని కి తోడు అధికారులు చేపట్టిన సర్వేలో తేలిన దిగుబడి లక్ష్యం మేరకు మాత్రమే మార్కెట్‌లో కొనుగోలు చేసే అవకాశం ఉండటంతో మండల రైతులు తమ కందులు చేతికొచ్చే వరకు మార్కెట్ సజావుగా కొనసాతుందా? మహారాష్ట్ర కందులతో కొనుగోలు లక్ష్యం పూర్తి అయితే తమ పరిస్థితి ఏంటని రైతులు వాపోతున్నారు. దీనిపై సాక్షి కథనం..
కంది రైతుల నిర్ధారణకు ప్రత్యేక సర్వే
మండల కేంద్రంలోని మార్కెట్ యార్డులో గతేడాది సైతం కందుల కొనుగోళ్లు ప్రారంభించగా, క్వింటాళ్‌కు రూ. 5050 చెల్లించి కందుల కొనుగోళ్లు చేపట్టారు. అయితే రైతుల ముసుగులో భారీగా దళారులు మహారాష్ట్ర నుంచి తక్కువ ధరకు కొనుగోలు చేసి జైనథ్ మార్కెట్‌లో అధిక ధరకు అమ్ముకున్నట్లు విమర్శలు వచ్చాయి. లారీల లోడ్లకు లోడ్లు సరిహద్దు గ్రామాల్లో డంపు చేసి, రైతుల పేర్లతో విక్రయించినట్లు పుకార్లు వినిపించాయి. ఈ నేపథ్యంలో ఈ ఏడాది మాత్రం మహారాష్ట్ర కందులను నివారించేందుకు, దళారులకు అడ్డుకట్ట వేసేందుకు వ్యవసాయ, రెవెన్యూ అధికారులు ప్రత్యేక సర్వే నిర్వహించారు. మూడు రోజుల పాటు గ్రామాల్లో నిర్వహించిన ఈ సర్వేలో కందులు వేసుకున్న రైతులను గుర్తించడంతో పాటు సాగు విస్తీర్ణం, అంచనా దిగుబడి కూడా నమోదు చేసుకున్నారు. కాగా ప్రస్తుతం ఈ సర్వే రికార్డుల ఆధారంగానే కూపన్లు జారీ చేయాలని, వీఆర్వోలు, ఏఈవోలకు అధికారుల ఆదేశాలు జారీ చేశారు. కూపన్లు తీసుకున్న రైతులు మాత్రమే మార్కెట్‌లో కందులు విక్రయించే అవకాశం ఉండటంతో మహారాష్ట్ర కందులను నివారించవచ్చనే దిశగా అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. దీంతో ఈ సర్వే ద్వారా అనుకున్న స్థాయిలో ప్రభావం చూపకపోవచ్చని చెబుతున్నారు.
అక్కడ రూ.4వేలు..ఇక్కడ రూ.5450
మహారాష్ట్రలో కందులు క్వింటాళ్‌కు రూ. 4000 నుంచి 4500 వరకు చెల్లించి కొనుగోలు చేసిన దళారులు జైనథ్ మార్కెట్‌లో రూ. 5450తో అమ్ముకునేందుకు పావులు కదుపుతున్నారు. దీని కోసం ఇప్పటి సరిహద్దు గ్రామాల్లో రైతుల ఇళ్లలో, గోదాముల్లో కందులు డంపు చేసినట్లు రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. జైనథ్ మండల కేంద్రంలో ఒకే వ్యక్తి ఇంట్లో 600 క్వింటాళ్ల కందులు డంపు అయినట్లు మండల వాసులు చర్చించుకుంటున్నారు. అయితే మహారాష్ట్రలో కొన్న కందులు ఇక్కడ అమ్ముకుంటే కనీసం తక్కువలో తక్కువ అంటే క్వింటాళ్‌కు రూ. 1000 లాభం వచ్చే అవకాశం ఉంది. దీంతో దళారులు ఇదే అదునుగా రైతుల పేర్లతో మార్కెట్‌లో కందులను విక్రయించేందుకు అవసరమైన కూపన్లు తీసుకోవడానికి ప్రయత్నాలు చేస్తున్నట్లు సమాచారం. దీంతో కూపన్ల జారీ ప్రక్రియను కొంత కఠినతరం చేయడంతో నిరక్ష్యరాస్యులైన సామాన్య రైతులు ఇబ్బందులు పడుతున్నారు. కూపన్ల కోసం మండల కేంద్రంలోని రెవెన్యూ, వ్యవసాయ శాఖ కార్యాలయాల చుట్టూ తిరుగుతున్నారు. ఏదేమైనప్పటికీ సా మా ్డన్య రైతులకు ఇబ్బందులు కలగకుండా, దళారులను గుర్తించేందుకు ప్రత్యేక చర్యలు తీసుకుంటూ.. లక్ష్యం మేరకు కందుల కొనుగోలు చేపట్టాలని రైతులు కోరుతున్నారు.
కూపన్ల అధారంగానే కొనుగోళ్లు
వ్యవసాయ శాఖ, రెవెన్యూ అధికారులు ధ్రువీకరించిన కూపన్ల ఆధారంగా రైతుల నుంచి కందులు కొనుగోలు చేస్తున్నాం. కూపన్లు లేకుండా వచ్చిన వారి నుంచి కొనుగోలు చేపట్టం. రైతులు దళారులను నమ్మకుండా, నేరుగా తాము పండించిన కందులను తామే అమ్ముకోవాలి. తేమ శాతం 12కు మించకుండా ఉండేటట్లు చూసుకోవాలి. రైతులు ఆందోళన చెందవద్దు.. ప్రభుత్వం నుంచి ఆదేశాలు వచ్చే వరకు కొనుగోలు కేంద్రాన్ని కొనసాగిస్తాం. – గౌరి నాగేశ్వర్, డీఎం, మార్క్‌ఫెడ్