అమ్ముకోలేక అప్పులపాలు!

Godowns Stack Was Becomes Loss To Government In Telangana - Sakshi

మార్క్‌ఫెడ్‌లో మూలుగుతున్న ఆహార ధాన్యాలు 

గోదాముల్లో ఉన్న మొక్కజొన్నకు పురుగులు

  4.41 లక్షల టన్నుల జొన్నలు కొనే దిక్కు లేదు  

కందులు, ఎర్రజొన్నలు, మినుములదీ ఇదే తీరు 

సర్కారుకు రూ. రెండు వేల కోట్ల మేర నష్టం!

సాక్షి, హైదరాబాద్‌ : రైతుల నుంచి మద్దతు ధరకు మార్క్‌ఫెడ్‌ సేక రించిన లక్షలాది మెట్రిక్‌ టన్నుల ఆహార ధాన్యాలు గోదాముల్లో మూలుగుతున్నాయి. కొనుగోలు చేసి వెంటనే విక్రయించకపోవడంతో రూ. 2 వేల కోట్ల విలువైన ఆహార ఉత్పత్తులు పాడైపోతున్నాయి. పైగా రైతుల నుంచి కొనుగోలు చేసేందుకు చేసిన అప్పులు, దానిపై వడ్డీ, గోదాముల అద్దె, నిర్వహణ భారం.. అంతా కలసి సర్కారుకు భారీగా నష్టం వాటిల్లే పరిస్థితి తలెత్తింది. గత ఖరీఫ్, రబీ సీజన్లలో కొనుగోలు చేసిన మొక్కజొన్న, కంది, ఎర్రజొన్న, మినుములన్నీ గోదాముల్లో మూలుగుతున్నాయని.. అన్నీ కలిపి దాదాపు రూ. 2 వేల కోట్ల విలువ ఉంటుందని అధికారులు చెబుతున్నారు. కల్వకుర్తి, జడ్చర్ల, పెద్దేరు, వనపర్తి.. ఇలా రాష్ట్రవ్యాప్తంగా గోదాముల్లో ఉంచిన మొక్కజొన్నకు పురుగు పడుతోందంటున్నారు. దీంతో గోదాముల సమీపంలో నివసించే ప్రజలు పురుగులతో సతమతమవుతున్నారు. కల్వకుర్తి వంటి చోట్ల ప్రజలు ధర్నాలకు దిగుతున్నారంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. ఇక ఎర్రజొన్నకు మార్కెట్లో గణనీయంగా ధర పడిపోయింది. మార్క్‌ఫెడ్‌ అధికారుల నిర్లక్ష్యం వల్లే ఈ పరిస్థితి తలెత్తిందని.. కొనుగోలు చేసిన నెల రోజుల్లో విక్రయించి ఉంటే ఈ పరిస్థితి ఉండేది కాదని, కావాలనే ఇలా చేస్తున్నారని ఆరోపణలు వినిపిస్తున్నాయి. 

మొక్కజొన్న 4.41 లక్షల టన్నులు 
గత ఖరీఫ్, రబీల్లో పండించిన మొక్కజొన్నను రైతుల నుంచి మద్దతు ధరకు మార్క్‌ఫెడ్‌ కొనుగోలు చేసిన విషయం తెలిసిందే. 4.41 లక్షల టన్నుల మొక్కజొన్నను సేకరించిన ప్రభుత్వం.. ఆ మేరకు రైతులకు రూ. 629 కోట్లు చెల్లించింది. ఆ మొత్తాన్ని గోదాముల్లో ఉంచింది. ఖరీఫ్‌ మొక్కజొన్న విక్రయాలు ప్రారంభించింది. అయితే ఖరీఫ్, రబీ మొక్కజొన్న రెండూ ఒకేచోట ఉండటం.. ఇప్పటికే నెలలు గడుస్తుండటంతో అనేక చోట్ల పురుగు పడుతోందని, ఆ పురుగులు ఇళ్లలోకి వస్తుండటంతో వాటి తాకిడి చుట్టుపక్కల వారు తట్టుకోలేకపోతున్నారని మార్క్‌ఫెడ్‌ వర్గాలు చెబుతున్నాయి. ఇప్పటివరకు ఖరీఫ్‌ మొక్కజొన్నే పూర్తిగా విక్రయించలేదని, రబీ జొన్నను ఇప్పటికిప్పుడు వదిలించుకోవడం అసాధ్యంగా కనిపిస్తోందని అధికారులు అంటున్నారు. ఇదే జరిగితే మార్క్‌ఫెడ్‌కు రూ. కోట్లలో నష్టం మిగలనుంది. అంతేకాదు గోదాముల్లో ఉంచడం వల్ల అద్దె భారం, నిర్వహణను ప్రైవేటుకు అప్పగించడంతో ఆ భారం కలసి తడిసి మోపెడవనుంది. గత ఖరీఫ్, రబీ సీజన్ల మొక్కజొన్న ఉండగానే మరోవైపు ప్రస్తుత ఖరీఫ్‌ కొనుగోలుకు మార్క్‌ఫెడ్‌ సన్నద్ధం కావాల్సిన పరిస్థితి నెలకొంది. 

ఎర్రజొన్నలు కొనే దిక్కులేదు 
గత ఫిబ్రవరిలో మార్కెట్లో క్వింటా ఎర్రజొన్న ధర రూ. 1,800 వరకే పలికింది. దీంతో రైతులు ఆందోళనలు చేయడంతో ప్రభుత్వం వాటిని రూ. 2,300 చొప్పున 51,749 టన్నులు కొనుగోలు చేసింది. అందుకోసం రైతులకు మార్క్‌ఫెడ్‌ రూ. 119 కోట్లు చెల్లించింది. ఆ ఎర్రజొన్నలను ఆయా జిల్లాల్లోని గోదాముల్లో నిలువ చేశారు. కానీ తిరిగి విక్రయించడంలో అధికారులు ఆలస్యం చేశారు. దీంతో ఎర్రజొన్నలూ పురుగులు పట్టే స్థితికి చేరుకున్నాయని అధికారులు చెబుతున్నారు. ఇప్పుడు కనీసం క్వింటా రూ. 1,000కి కూడా కొనే వారు లేకుండా పోయారు. అవి అమ్ముడవకపోతే మార్క్‌ఫెడ్‌కు రూ. 119 కోట్లు నష్టం వాటిల్లనుంది.  

మినుములు, శనగలు కూడా.. 
ఇవిగాక 1.86 లక్షల టన్నుల కందులు గోదాముల్లో ఉన్నట్లు అధికారులు చెబుతున్నారు. కందిని క్వింటా రూ. 5,450 మద్దతు ధరతో కొనుగోలు చేసి ఆ మేరకు రైతులకు రూ. 646 కోట్లు చెల్లించారు. విక్రయించడంలో అధికారులు ఆలస్యం చేసి చివరకు పాడయ్యే పరిస్థితికి వచ్చాక కొంత కమీషన్‌ తీసుకొని వదిలించుకుంటున్నారని ఆరోపణలున్నాయి. మరోవైపు 2 వేల మెట్రిక్‌ టన్నుల మినుములు, 17 వేల మెట్రిక్‌ టన్నుల శనగలు, 3,500 మెట్రిక్‌ టన్నుల జొన్నలూ గోదాముల్లో ఉన్నాయి. వీటన్నింటినీ ఏం చేయాలో అర్థంగాక అధికారులు తల పట్టుకుంటున్నారు. రూ. 2 వేల కోట్లు రుణాలు తెచ్చి రైతులకు మద్దతు ధరకు కొనుగోలు చేసిన మార్క్‌ఫెడ్, వాటిని విక్రయించకుంటే తీవ్ర నష్టాల్లోకి వెళ్లే ప్రమాదం ఉంది. 

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top