
అభిప్రాయం
ఆంధ్రప్రదేశ్‌లో ఖరీఫ్ సీజన్ మొదలైంది. సేద్యానికి కావా ల్సిన సాగు నీరు, నాణ్యమైన విత్తనాల లేమి, పంట రుణాలు – గిట్టుబాటు ధరలు అందక పోవడం, ప్రకృతి సృష్టించే పంట నష్టాలు వంటి సమస్యలు మళ్లీ రైతాంగం కోసం సిద్ధంగా కాచుకొని ఉన్నాయి.
తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమి అధికారంలోకి వచ్చి, జూన్ నాటికి ఏడాది అవుతోంది. ఈ కాలమంతా కూటమి ప్రభుత్వం రైతాంగ వ్యతిరేక విధానాలనే అమలు జరిపింది. రైతాంగానికి ప్రధానంగా కావాల్సింది సాగు నీరు. ప్రస్తుతం ఏ ఆయ కట్టూ చివరి భూమి వరకూ నీరందించే పరిస్థితి లేక రైతాంగం తీవ్రంగా నష్టపోతోంది. రూ. 100 నుంచి రూ. 200 కోట్ల ఖర్చుతో పూర్తి అయ్యే పథకాలు ఉన్నాయి. వెలిగొండ, హంద్రీ – నీవా, వంశధార, నాగావళి; గుంటూరు ఛానల్ పొడిగింపు, ఇంకా చిన్న, మధ్య తరహా నీటి పథకాలు ఇటువంటివే. వీటిని పూర్తి చేయలేదు.
హంద్రీ–నీవా, గాలేరు–నగరి వంటి ప్రాజెక్టుల ప్రధాన కాల్వల్లో నీరు ప్రవహిస్తున్నా, పిల్ల కాలువల నిర్మాణం లేక రైతుల పొలాలకు నీరు చేరటం లేదు. అతి తక్కువ ఖర్చుతో పూర్తయ్యే వీటిని 2014 నుంచి 2019 వరకు పరిపాలించిన చంద్రబాబు చేపట్టలేదు. కారణం పంట కాల్వలు తవ్వరాదు అన్న ప్రపంచ బ్యాంకు షరతు. ఆ భూముల్లో ఆరు తడి పంటలు, ఉద్యానవన పంటలు పండిస్తూ, నీటిని విదేశీ కంపెనీలకు మళ్ళించాలన్నదే ప్రపంచ బ్యాంకు ఉద్దేశం. దీనికి అనుగుణంగానే ఆ నాటి టీడీపీ ప్రభుత్వం 2015 ఫిబ్రవరిలో జీఓ 22 తెచ్చింది.
వెయ్యి లిఫ్ట్ ఇరిగేషన్ పథకాలు ఉన్నా వీటిని ప్రభుత్వాలు పట్టించుకోక పోవటం వల్ల మూతపడుతున్నాయి. వరదల వల్ల దెబ్బతిన్న సాగునీరు ప్రాజెక్టుల మరమ్మత్తూ సరిగా పూర్తికాలేదు. పోలవరం ప్రాజెక్టు ప్రారంభించి ఇరవై ఏళ్లు గడిచినా ఇంకా పూర్తి కాలేదు. ప్రాజెక్టు కింద వేలాది ఎకరాలు కోల్పోయిన ఆదివాసులకు, గిరిజనేతరులకు ఈ నాటికీ నష్ట పరిహారం అందలేదు. రైతులుగా బతికిన వారు కూలీలుగా వలసలు పోతున్నారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వానికి లొంగిపోయిన టీడీపీ నాయకత్వం పోలవరం ప్రాజెక్టు ఎత్తు తగ్గించటానికి అంగీకరించింది. ఫలితంగా అదనపు సాగు నీరు సాధ్యం కాదు.
చిన్న, సన్నకారు రైతులు పంట పెట్టుబడి కోసం అనేక ఇబ్బందులు పడుతున్నారు. సంస్థాగత రుణాలు 40% మించి అందటం లేదు. పావలా వడ్డీకే పంట రుణాల పథకం అత్యధిక రైతులకు అందటం లేదు. గత వైసీపీ ప్రభుత్వం పంట ఖర్చుల కోసం ముందస్తు పెట్టుబడి పేరుతో కేంద్ర ప్రభుత్వం ఇచ్చే దాన్ని కలుపుకొని ప్రతి సంవత్సరం 13,500 రూపాయలను మూడు విడతలుగా రైతులకు ఇవ్వటం జరిగింది. 2024 ఎన్నికల్లో కూటమి పార్టీలు ప్రతి సంవత్సరం 20 వేలు ఇస్తామని ప్రకటించాయి. అధికారంలోకి వచ్చి సంవత్సరం అయినా రైతు భరోసా పథకం కింద రాష్ట్ర ప్రభుత్వం ఒక్క రూపాయి రైతుకు ఇవ్వలేదు. పంటల బీమా పథకానికి ఇన్సూ్యరెన్స్ కంపెనీలకు చెల్లించాల్సిన వాటాను కూటమి ప్రభుత్వం చెల్లించక పోవటం వలన రైతాంగం పంట నష్ట పరిహారం పొందలేని పరిస్థితి ఏర్పడింది.
కౌలు రైతులు కౌలు భారాలను భరిస్తూ పంటలు పండించినా న్యాయమైన మద్దతు ధరలు లభించక నష్టపోతున్నారు. వారికి ‘అన్నదాతా సుఖీభవ’, పంట నష్ట పరిహారాలు, పంటల బీమా పరిహారం, సంస్థా గత రుణాలు అందటం లేదు. తాము అధికారంలోకి వస్తే పంట ముందస్తు పెట్టుబడి కౌలు రైతులకు కూడా అందిస్తామని కూటమి పార్టీలు ప్రకటించాయి. నేడు చంద్రబాబు ప్రభుత్వం ‘అన్నదాతా సుఖీభవ’ పథకం కౌలు రైతులకు వర్తించదని ప్రకటించి, కౌలు రైతులను వంచించింది.
తాము అధికారంలోకి వస్తే పంటలకు గిట్టుబాటు ధర కల్పించి ప్రభుత్వ సంస్థల ద్వారా కొనుగోలు చేస్తామని, అందుకు ధరల స్థిరీకరణ నిధిని ఏర్పాటు చేస్తామని కూటమి పార్టీలు చెప్పాయి. అధికారంలోకి వచ్చిన తర్వాత ధరల స్థిరీకరణ నిధికి 300 కోట్లు మాత్రమే కూటమి ప్రభుత్వం కేటాయించింది. ఈ నిధితో ధరల స్థిరీకరణ ఎలా సాధ్యమవుతుంది? రైతుల నుంచి ధాన్యం కొనుగోలు చేసిన 48 గంటల్లో వారి బ్యాంకు ఖాతాల్లో డబ్బులు జమ చేస్తామని చెప్పినా ఆచరణలో అమలు జరగలేదు.
చదవండి: ప్రజలే సమాధానం చెబుతారు
చంద్రబాబు సంపదలు సృష్టించటం అబద్ధం. రాష్ట్ర సంపదలను, భూములను మాత్రం దేశ, విదేశీ బడా సంస్థలకు కట్టబెట్టడం వాస్తవం. రాష్ట్ర ప్రభుత్వా లేవీ రైతాంగ సమస్యలు పరిష్కరించే విధానాలు అమలు జరపలేదు. కూటమి ప్రభుత్వం రైతుల సమస్యలు పరిష్కరించదు. ఈ వాస్తవాన్ని రైతాంగం గ్రహించి తాము ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారం కోసం ఉద్యమించాలి.
- బొల్లిముంత సాంబశివరావు
రైతు కూలీ సంఘం (ఆం.ప్ర) రాష్ట్ర కార్యవర్గ సభ్యులు