భద్రత లేకపోతే బాదుడే..

GHMC Seized Without Fire Safety Bars And Restaurants - Sakshi

రంగంలో దిగిన జీహెచ్‌ఎంసీ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ విభాగం

ఫైర్‌ సేఫ్టీలేని ఆరు బార్లు, రెస్టారెంట్లు సీజ్‌  

బంజారాహిల్స్‌: నగరంలో ఫైర్‌సేఫ్టీ నిబంధనలు పాటించని బార్లు, రెస్టారెంట్‌లపై జీహెచ్‌ఎంసీ ఫైర్, ఎన్‌ఫోర్స్‌మెంట్‌ విభాగం కొరడా ఝులిపించింది. నిబంధనలకు విరుద్ధంగా ఉన్న ఆరు బార్లు, రెస్టారెంట్లను ఫైర్, ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టర్‌ సీజ్‌ చేశారు. నగరంలోని బార్లు, పబ్‌లు, రెస్టారెంట్లలో తీసుకోవాలని ఫైర్‌ సేఫ్టీ చర్యలపై నిర్వాహకులు, యజమానులతో గత ఆగస్టు 18న  జీహెచ్‌ఎంసీ ఫైర్, ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టర్‌ ప్రత్యేక సమావేశం నిర్వహించి అవగాహన కల్పించారు. ప్రతి బార్, రెస్టారెంట్లలో ఫైర్‌ సేఫ్టీ పరికరాలను ఏర్పాటు చేయాలని ఇచ్చిన గడువును ముగిసిన అనంతరం పలు నోటీసులు జారీచేసినా వీటిని ఖాతరు చేయని బార్లు, పబ్‌లపై గత రెండు రోజులుగా దాడులు నిర్వహిస్తున్నారు. నిబంధనలు పాటించని వాటిని సీజ్‌ చేశారు.

సీజ్‌ చేసిన రెస్టారెంట్లు...
నగరంలోని  జూబ్లీహిల్స్‌లోని టకీషాక్స్, క్యాలన్‌ గోట్‌ రెస్టోబార్, అర్బనేషియా కిచెన్‌ – బార్, ఈట్‌ ఇండియా కంపెనీ, రాస్తాకేఫ్‌ – బార్‌లను  ఎన్‌ఫోర్స్‌మెంట్, ఫైర్‌ విభాగం  సీజ్‌ చేసింది.  శ్రీనగర్‌ కాలనీలోని శ్రీదుర్గా రెస్టారెంట్‌ – బార్‌ను మూసివేశారు.

అనుమతులు లేకుండా
హైదరాబాద్‌ ఎక్సైజ్‌ సర్కిల్‌ పరిధిలో 148 బార్లు, పబ్‌లు, సికింద్రాబాద్‌ సర్కిల్‌ పరిధిలో 103, రంగారెడ్డి జిల్లాలో 325 బార్లు, పబ్‌లు ఉండగా మరో 138 ఈవెంట్‌  పర్మిషన్‌ పేరుతోనూ బార్లు, పబ్‌లు నిర్వహిస్తున్నారు.  మొత్తం 714 బార్లు, పబ్‌ల జాబితా మాత్రమే జీహెచ్‌ఎంసీ వద్ద ఉండగా అనధికారికంగా మరో 250 పైగా బార్లు, రెస్టారెంట్లు ఉన్నట్లు అంచనా. రికార్డులమేరకు గ్రేటర్‌ పరిధిలోని 750 బార్లు, పబ్‌లు, ఈవెంట్‌ పర్మీషన్‌ల భవనాల యజమానులకు ఫైర్‌ సేఫ్టీ చర్యలలపై జీహెచ్‌ఎంసీ ఎన్‌ఫోర్స్‌మెంట్, విజిలెన్స్, డిజాస్టర్‌ మేనేజ్‌మెంట్‌ విభాగం గతంలో నోటీసులు జారీ చేసింది. దీంతోపాటు ఫైర్‌ సెఫ్టీకి చేపట్టిన వివరాలు పేర్కొనే అప్లికేషన్‌ ఫారాన్ని జీహెచ్‌ఎంసీ వెబ్‌సైట్‌  ఠీఠీఠీ. జజిఝఛి. జౌఠి. జీn  నుండి డౌన్‌ లోడ్‌ చేసుకొని దానిని నింపి జీహెచ్‌ఎంసీ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ విభాగానికి అంద చేయాలని కూడా ఇప్పటికే జీహెచ్‌ఎంసీ ప్రకటించింది. జీహెచ్‌ఎంసీ వెబ్‌ సైట్‌ నుంచి డౌన్‌ లోడ్‌ చేసుకున్న దరఖాస్తులను నింపి పలు బార్లు, రెస్టారెంట్లు, పబ్‌ల యజమానులు జీహెచ్‌ఎంసీకి అందజేశారు. నగర ప్రజల భద్రతను దష్టిలో పెట్టుకొని ప్రతి రెస్టారెంట్, బార్‌లో, ఫైర్‌సేఫ్టీ చర్యలను పాటించాలని జీహెచ్‌ఎంసీ ఓ ప్రకటనలో కోరింది.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top