గర్రెపల్లి చెరువుకు మంత్రి భరోసా

Garrepally Large Works Observation Harish Rao In Karimnagar - Sakshi

సాక్షి, పెద్దపల్లి: జిల్లాలోనే అతిపెద్దదైన గర్రెపల్లి చెరువు అభివృద్ధికి రాష్ట్ర భారీ నీటిపారుదల శాఖ మంత్రి తన్నీరు హరీష్‌రావు భరోసా ఇచ్చారు. సుల్తానాబాద్‌ మండలం గర్రెపల్లి పెద్ద చెరువు దుస్థితిని వివరిస్తూ ‘పెద్ద చెరువుపై చిన్న చూపు’ శీర్షికన ఈ నెల 20న ‘సాక్షి’లో కథనం ప్రచురితమైంది. రెండు వేల ఎకరాల ఆయకట్టు ఉండి, పది గ్రామాల్లో భూగర్భజల మట్టాన్ని పెంచే పెద్దచెరువు దుస్థితికి అద్దం పట్టడంతో ‘సాక్షి’ కథనం జిల్లా వ్యాప్తంగా చర్చకు దారితీసింది. దీంతో శనివారం కరీంనగర్‌ జిల్లా కేంద్రానికి వచ్చిన భారీనీటిపారుదల శాఖ మంత్రి తన్నీరు హరీష్‌రావును సర్పంచ్‌ పడాల అజయ్‌గౌడ్‌ కలిసి వినతిపత్రం అందజేశారు.

గర్రెపల్లి పెద్ద చెరువుకు వరదకాలువ నుంచి నీళ్లివ్వాలని మంత్రిని కోరారు. ప్రభుత్వం కోట్లాది రూపాయల నిధులు చెరువుల అభివృద్ధికి వెచ్చిస్తున్నా.. గర్రెపల్లి చెరువు విషయంలో అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని మంత్రికి సర్పంచ్‌ ఫిర్యాదు చేశారు. రెండు వేల ఎకరాల ఆయకట్టు ఉన్న ఈ చెరువులో నీళ్లు నింపితే, పదిగ్రామాల్లో భూగర్భ జల మట్టం పెరుగుతుందని, 300కుపైగా మత్స్యకారుల కుటుంబాలకు ఉపాధి దొరుకుతుందని తెలియజేశారు. ఇందుకు మంత్రి హరీష్‌రావు సానుకూలంగా స్పందించారు. చెరువులో నీళ్లు నింపేందుకు అవసరమైన మార్గాలను అధికారుల నుంచి తెలుసుకుంటానని హామీ ఇచ్చారు. రైతులకు లాభం చేకూరేలా చర్యలు తీసుకోనున్నట్లు చెప్పారు. కాగా... మంత్రిని కలిసి వారిలో బీసీ యువజన సంఘం రాష్ట్ర కార్యనిర్వాహక అధ్యక్షుడు తంగెళ్లపల్లి రాజ్‌కుమార్, గ్రామస్తులు ఉన్నారు. 

నీళ్లు నింపేందుకు మంత్రి హామీ
జిల్లాలోనే అతిపెద్దదైన గర్రెపల్లి చెరువును నీటితో నింపేందుకు భారీ నీటిపారుదల శాఖ మంత్రి హరీష్‌రావు హామీ ఇచ్చారు. చెరువులో సరిపడా నీళ్లు లేకపోవడంతో ఈ ప్రాంత రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. గతంలో ఎన్నోసార్లు అధికారులకు చెప్పినా, పట్టించుకోవడం లేదు. దీనితో మంత్రి దృష్టికి తీసుకెళ్లాం. రామడుగు మండలం చిప్పకుర్తి దగ్గర వరదకాలువ 99వ కిలోమీటర్‌ వద్ద, ఎస్‌ఆర్‌ఎస్‌పీ మెయిన్‌ కెనాల్‌ (96వ కిలోమీటర్‌ వద్ద)ను కలిపితే, దీని ద్వారా డీ–86 నుంచి 11ఆర్‌తో గర్రెపల్లి చెరువును నింపాలని కోరాం. మంత్రి ఆదేశంతో త్వరలో ఈ సమస్య పరిష్కారమవుతుందని ఆశిస్తున్నాం.
పడాల అజయ్‌గౌడ్, సర్పంచ్, గర్రెపల్లి

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top