ఘాటెక్కిన గరం మసాలా!

Garam Masala Prices Hike in Hyderabad Market - Sakshi

పైపైకి చేరుతున్న ధరలు  

సాక్షి సిటీబ్యూరో: ఇటీవల కాలంలో నగరంలో ఏ శుభకార్యం జరిగినా మాంసాహార వంటలే ఉంటున్నాయి. ఫంక్షన్లతో పాటు హోటల్‌లలో రకరకాల వెజ్, నాన్‌వెజ్‌ వంటకాలు తయారు చేస్తుంటారు. దేశంలో ఎక్కడ లేనన్ని వివిధ రకాల వంటకాలు హైదరాబాద్‌ నగరంలో తయారు అవుతాయి. పెళ్లిళ్లు, శుభకార్యాల సీజన్‌లో హైదరాబాదీ వంటకాలకు ఎంతో ప్రత్యేకత ఉంది.  నగరంలో తయారయ్యే వంటల రుచులను ఆస్వాదించడానికి దేశ, విదేశాల నుంచి వస్తారంటే  అతిశయోక్తి కాదు. వెజ్, నాజ్‌వెజ్‌ వంటకాలు రుచికరంగా తయారీ ప్రక్రియలో గరం మసాలా పాత్ర కీలకం. గరం మసాలా లేనిదే నాన్‌వెజ్‌ వంటకం తయారు కాదు. బిర్యానీ నుంచి మటన్, చికెన్‌తో పాటు పలు రకాల వెజ్‌ వంటకాల్లో గరం మసాలా వేయడం తప్పనిసరి. గత కొన్ని నెలలుగా గరం మసాలా ధరలు ఘాటెక్కాయి. కేరళలో వరదల ప్రభావంతో ఇలాచీతో పాటు విదేశాల నుంచి దిగుమతులు ఇతర మసాలా దిగుమతులు తగ్గడంతో ధరలు విపరీతంగా పెరిగాయి. గత మూడు నెలల్లో దాదాపు అన్నింటి ధరలు విపరీతంగా పెరిగాయని బేగంబజార్‌లోని కశ్మీరీ హౌస్‌ హోల్‌సెల్‌ వ్యాపారి పన్నాలాల్‌ చెబుతున్నారు.  

విదేశాల నుంచి దిగుతులు..
గరం మసాలాగా వినియోగించే ఇలాచీ, లవంగం, దాల్చిన చెక్క, షాజీరాల్లో ఇలాచీ తప్ప మిగతావన్నీ  విదేశాల నుంచే దిగుమతి అవుతున్నాయి. కేరళ, కర్ణాటకల నుంచి నగర మార్కెట్‌కు ఇలాచీ దిగుమతి అవుతోంది. లవంగం సౌతాఫ్రికా జాంబియా నుంచి, దాల్చిన చెక్క వియత్నాం నుంచి, షాజీరా అఫ్గానిస్థాన్‌ నుంచి నగర మార్కెట్‌లకు దిగుమతి అవుతున్నాయి. గరం మసాలాగా వినియోగించే ఇలాచీ తప్ప మిగతా మూడు మసాలాలు విదేశాల నుంచి దిగుమతి అవుతున్నాయి. దేశంలోనే అతి పెద్ద గరం మసాలా మార్కెట్‌తో పాటు, అత్యధికంగా వినియోగించే నగరం కూడా హైదరాబాదే. 

జీలకర్ర, ధనియాలు..
జీలకర్ర, ధనియాలు, మెంతులు, నువ్వుల వినియోగం కూడా ఇతర ప్రాంతాలతో పోలిస్తే నగరంలో ఎక్కువని బేగంబజార్‌ మార్కెట్‌ హోల్‌సేల్‌ వ్యాపారులు చెబుతున్నారు. జీలకర్ర, ధనియాలు, మెంతులు, నువ్వులు, జైఫల్, జాపత్రితో పాటు ఇతర మసాలాలు గుజరాత్, మహారాష్ట్ర, కర్ణాటకలతో పాటు ఇతర రాష్ట్రాల నుంచి నగర మార్కెట్‌కు దిగుమతి అవుతున్నాయి.

గరం మసాలా ధరలు ఇలా..  
గతంలో ఇలాచీ ఫస్ట్‌ క్వాలిటీ ధరలు కేజీ రూ. 2800– 3000 నుంచి ఉండగా.. ప్రస్తుతం కేజీ రూ.4 వేల వరకు పలుకుతోంది. లవంగం కేజీ ధర గతంలో రూ. 500– 600 ఉండగా ప్రస్తుతం రూ. 800– 1000 వరకు ఉంది. షాజీరా గతంలో రూ. 400 ఉండగా ప్రస్తుతం రూ. 600 ఉంది. దాల్చిన చెక్క ధరలు కూడా గతం కంటే పెరిగి కేజీ రూ. 300 నుంచి రూ. 500కు చేరాయి. జైఫల్‌ కేజీ ధర గతంలో రూ. 800 ఉండగా రూ. 1100 అయింది. జాపత్రి ధర రూ. 1500నుంచి రూ. 2400కు చేరింది.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top