మనిషికి లాక్‌డౌన్‌.. పక్షులకు ఫ్రీడం.. | Freedom For Birds in Lockdown time Hyderabad | Sakshi
Sakshi News home page

ఇల.. ఏమి హాయిలే..

Apr 21 2020 8:31 AM | Updated on Apr 21 2020 8:31 AM

Freedom For Birds in Lockdown time Hyderabad - Sakshi

సనత్‌నగర్‌:  చెట్లు.. పక్షులు.. జంతువులు.. ఇలా ప్రకృతిలో భాగమైన వన్యప్రాణులపై ఎప్పటికీ మనిషి ఆధారపడాల్సిందే. వాటి వనరులను మనిషి దోచుకున్నాడేమో గానీ, అవే వన్యప్రాణులు మనుషుల అవసరం లేకుండా స్వేచ్ఛగా జీవనం సాగించగలవన్నది అక్షర సత్యం. లాక్‌డౌన్‌ పుణ్యమా? అని మనిషి ఇంటికే పరిమితం కాగా.. పక్షులు, కొన్ని రకాల వన్యప్రాణులు ఎంచక్కా ఆహ్లాదకర వాతావరణాన్ని ఎం‘జాయ్‌’ చేస్తున్నాయి. ఒక్కమాటలో చెప్పాలంటే కరోనా నియంత్రణకు ప్రభుత్వాలు విధించిన లాక్‌డౌన్‌.. వాటికి వరంగా మారిందనడంలో ఎలాంటి అనుమానం లేదు. అయితే హైదరాబాద్‌ వంటి నగరాల్లో వేసవి రోజుల్లో మనిషి నీరు పోస్తేనే కదా అవి బతికి బట్టకట్టేది.. అన్న సందేహం రాకమానదు. అయితే నిత్యం బిజీగా ఉండే రోడ్లు, కాలుష్యం, నిరంతర ధ్వనులతో భయపడి ప్రయాణం చేయలేని పక్షులు.. ఇప్పుడు చక్కర్లు కొడుతూ నగరం, నగర శివారులోని చెరువుల చెంతకు నిర్భయంగా చేరుకుని ఆనందంగా గడుపుతున్నాయని పర్యావరణవేత్తలు చెబుతున్నారు.

ఏటా 70–80 రకాల వలస పక్షులు రాక..
మొత్తం 280 రకాల పక్షి జాతుల్లో దాదాపు 70–80 వలస పక్షులు ప్రతి సంవత్సరం అక్టోబర్, నవంబర్‌ మాసాల్లో నగరానికి వలస వస్తుంటాయి. ఇందులో ప్రధానంగా ఫ్లెమింగోలోని పలు రకాల పక్షులు, వెర్డిటెర్‌ ఫ్లై క్యాచర్, కామన్‌ స్టోన్‌చాట్, నార్తరన్‌ షోవలర్, బ్లాక్‌ టెయిల్డ్‌ గాడ్‌విట్, ఎల్లో వాగ్‌టెయిల్, హారియర్స్‌లో పలు రకాల పక్షులు, 12 జాతులకు చెందిన డక్స్, ఈగల్స్, వాడర్స్, లిటిల్‌ టెర్న్‌ వంటి ఎన్నో రకాల రంగురంగుల వలస పక్షులు ఉంటాయి. అక్టోబర్‌ నుంచి ఏప్రిల్‌ వరకు వలస పక్షులకు సురక్షితమైన ప్రాంతంగా హైదరాబాద్‌ ఉంటుంది. ఆ సమయంలో పక్షులు తట్టుకునే ఉష్ణోగ్రతలు ఇక్కడ నమోదు కావడంతో పాటు ఆహారానికి కూడా అనువుగా ఉంటాయి. చెరువుల చెంతనే చెట్లపై గూళ్లు కట్టుకోవడానికి అనువైన వాతావరణం ఇక్కడ ఉంటుంది. అలాగే చెరువుల మధ్యలో అక్కడక్కడా రాతి శిలలతో పాటు కృత్రిమంగా ఏర్పాటుచేసిన స్టాండ్‌లు ఉండటం ద్వారా ఫ్లెమింగో వంటి పక్షులు వాటిపై గంటల పాటు గడుపుతూ  చేపలను అన్వేషిస్తుంటాయి. ఇలా తమ ఆహారాన్ని సేకరించుకోవడానికి అనువుగా ఉంటుంది. చేపల జోలికి వెళ్లని కొన్ని రకాల పక్షులు చెరువు ఒడ్డు ప్రాంతంలో సంచరిస్తూ ఆహారాన్ని సమకూర్చుకుంటాయి. అలా పక్షులకు కావాల్సిన అనువైన వాతావరణంతో పాటు వనరులు ఇక్కడ పుష్కలంగా అందుబాటులో ఉండటం వల్ల ఏటా వలస పక్షులు ఇక్కడకు వచ్చి విడిది చేస్తుంటాయి. వలస వచ్చే దాదాపు 80 రకాల వలస పక్షుల్లో సుమారు 60 జాతులకు చెందిన పక్షులు ఏప్రిల్‌ చివరి వరకు విడిది చేస్తుంటాయి. అయితే ప్రస్తుతం నెలకొన్న లాక్‌డౌన్‌ పరిస్థితులు వాటికి మరింత అనూకూల వాతావరణం కలిగిందని పక్షి ప్రేమికులు చెబుతున్నారు.

ఎన్నో అనుకూలాంశాలు..

వలస వచ్చిన కాలంలో చాలావరకు పక్షులు గుడ్లు పెట్టి పొదిగి పిల్లలను జన్మనిస్తుంటాయి. చెరువుల ఒడ్డున తేమ ప్రాంతంలో అవి గుడ్లు పెడుతుంటాయి. రాళ్లతో కలిసిపోయే మాదిరిగానే గుడ్డు ఉండటంతో అక్కడకు వచ్చే సందర్శకులు వాటిని తెలియక తొక్కేస్తుంటారు. కానీ లాక్‌డౌన్‌ నేపథ్యంలో బయట రాకపోకలు పూర్తిగా నిలిచిపోవడంతో పాటు చెరువులు, లేక్‌ల సందర్శనకు వచ్చేవారి సంఖ్య పూర్తిగా నిలిచిపోయింది. దీంతో సందర్శకుల ఆటంకం లేకుండా గుడ్లు పెట్టి పొదిగి పిల్లలను కనగలిగే వాతావరణం ప్రస్తుతం వాటికి లభించింది.
చాలా వన్యప్రాణులు మనిషి చూడకుండానే సుదూరం నుంచే వాసనను పసిగట్టి భయపడి దాక్కునే పరిస్థితులు ఉంటాయి. అలాంటిది నిత్యం నగర రహదారుల రణగొణ ధ్వనులతో మార్మోగుతూనే ఉంటాయి. ఈ నేపథ్యంలో నగరంలోని కేబీఆర్‌ పార్కు, హరిణి వనస్థలి, హెచ్‌సీయూ వంటి ప్రాంతాల్లోని కొన్ని రకాల వన్యప్రాణులు, పక్షులు బయటకు రావాలంటే భయపడే పరిస్థితి ఉంటుంది. అలాంటిది రహదారులన్నీ నిర్మానుష్యంగా మారడంతో పాటు ఎలాంటి శబ్దాలు లేకపోవడంతో హాయిగా విహారానికి వస్తున్నట్లు స్పష్టమవుతోంది.
చెట్లపైనే పండ్లను హాయిగా తింటున్నాయి. గూళ్లు కట్టుకుంటున్నాయి. పువ్వులు ఫలదీకరణ చెందడానికి కొన్ని రకాల పక్షుల అవసరం ఎంతైనా ఉంది. ఈ నేపథ్యంలో ఎలాంటి అంతరాయం లేకుండా పక్షుల ద్వారా పువ్వులు ఫలదీకరణ చెందుతున్నాయి.
పక్షుల ద్వారా ఎన్నో రకాల పండ్ల చెట్లు ఉత్పన్నమవుతాయని తెలుసా.. పండ్లు తినే క్రమంలో వాటి విత్తనాలు(గింజలను) అక్కడక్కడ పడేసుకుంటూ(వెదజల్లుతాయి) వెళ్తాయి. ఈ క్రమంలో ఆ విత్తనాలు మళ్లీ మొలకెత్తి చెట్లుగా మారతాయి. లాక్‌డౌన్‌ సమయంలో ఎలాంటి ఇబ్బందికర పరిస్థితి లేకుండా పండ్లను సేవించడంతో పాటు విత్తనాలను వెదజల్లే అవకాశం దొరికింది.
కాలుష్యం తగ్గి వాతావరణంలో ఉష్ణోగ్రతలు కూడా అంతగా పెరగకపోవడంతో సాధారణంగా ఉండే దానికంటే మరికొన్ని రోజులు వలస పక్షులు ఇక్కడ సేదతీరే అవకాశం లేకపోలేదు.
చాలాచోట్ల చెరువుల్లో రసాయన వ్యర్థ జాలాలు భారీగా వదులుతారు. కానీ ఇప్పుడు అన్నీ బంద్‌ కావడంతో చెరువుల్లోకి వచ్చే వ్యర్థ జలాలు తగ్గిపోయి నీటిలో స్వచ్ఛత శాతం పెరిగింది. దీంతో పక్షులు కూడా కాలుష్య జలాల తాకిడి లేకుండా హాయిగా సేదతీరుతున్నాయని చెప్పవచ్చు.

పక్షులకు  లాక్‌డౌన్‌ ఒక వరమే.. 

వలస పక్షులపై విశ్లేషణ చేయడంతో పాటు ఫొటోలు తీసి బర్డ్స్‌ ఆఫ్‌ గ్రేటర్‌ హైదరాబాద్‌ పుస్తకంలో నేను ప్రస్తావించాను. ఇప్పటివరకు 226 రకాల పక్షుల ఫొటోలను తీస్తే, వాటిల్లో దాదాపు 80 రకాల వలస పక్షులు చలికాలం నగరానికి రావడం గమనించాను. ఏప్రిల్‌ చివరి వరకు ఇక్కడ స్టే చేస్తుంటాయి. లాక్‌డౌన్‌ కారణంగా స్వేచ్ఛగా ఎలాంటి భయం లేకుండా విహారం చేసే అవకాశం దొరికింది. చెరువులతో పాటు వాతావరణంలో కాలుష్యం కూడా తగ్గిపోయింది. మనుషుల సందడి లేదు.. ధ్వనులు లేవు. ఇవి పక్షులకు వరంగా మారాయి.– డాక్టర్‌ వీఏ మంగ,  బర్డ్స్‌ ఆఫ్‌ గ్రేటర్‌ హైదరాబాద్‌ గ్రంథ రచయిత.

మరికొన్ని రోజులు ఎక్కువగా ఉండవచ్చు
లాక్‌డౌన్‌ పుణ్యమా అని సన్‌బర్డ్, ఫ్లై క్యాచర్, టైలర్‌బర్డ్, వడ్రంగి పిట్టలు, చిలుకలు, కోయిల పక్షులు అన్ని ఇంటి దగ్గరే ఇప్పుడు చూస్తున్నాం. వీటిని తమ గ్రూపు సభ్యులు ఈ–బర్డ్‌. ఓఆర్‌జీ లో రికార్డు చేస్తున్నాం. ప్రకృతి శాస్త్రవేత్తలకు పక్షుల గురించి రియల్‌ టైం డేటాను అందిస్తున్నాం. లాక్‌డౌన్‌ వ్యవధిలో ఇప్పుడు తక్కువ కాలుష్యం నమోదవుతోంది. ప్రజలందరూ ఇళ్లలోనే ఉండటం వల్ల కాలుష్యం తగ్గి వాతావరణంలో సాధారణం కంటే తక్కువ ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. వలస పక్షులు ఇంకా కొన్ని రోజులు ఇక్కడే ఉండే అవకాశం ఉంది.  – కళ్యాణ్, బర్డ్స్‌ వాచర్‌క్లబ్‌ సభ్యుడు

పక్షులకు ఇబ్బందికర వాతావరణమే..
నా వద్ద దాదాపు 25 రకాల పక్షులు ఉన్నాయి. లాక్‌డౌన్‌ కారణంగా సాధారణ రోజుల్లో కంటే మరింతగా ప్రశాంత వాతావరణం వాటికి అందుతోంది. వేసవికాలం వచ్చిందంటే వాటి విషయంలో జాగ్రత్తలు తప్పనిసరిగా తీసుకోవాలి. అరగంటకు ఓసారి ఫాగ్‌ చేస్తాం. పైప్‌ద్వారా నీటిని పొగమంచు మాదిరిగా పక్షులపై చిమ్ముతుంటాం. దీని వల్ల పక్షుల శరీరం చల్లబడుతుంది. పక్షులు హీట్‌ను తట్టుకోవాలంటే అనేకమార్లు ఇలాంటి ఫాగ్‌ చేయక తప్పదు. ఇక తాగేందుకు ఎప్పుడూ టబ్‌లో వాటరు పోసి అందుబాటులో ఉంచాలి.      – శ్రీనివాస్, పక్షి ప్రేమికుడు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement