తండాలను రెవెన్యూ గ్రామాలుగా మార్చాలి

Former Minister Ravindra Nayak Wants Tribal Village Panchayats to be Converted Into Revenue Villages - Sakshi

పాలకవీడు (హుజూర్‌నగర్‌) : గ్రామపంచాయతీలుగా మార్చిన తండాలను రెవెన్యూ గ్రామాలుగా మార్చాలని మాజీ మంత్రి రవీంద్రనాయక్‌ అన్నారు. మండలంలోని జాన్‌పహాడ్‌ దర్గా వద్ద జేపీఎస్‌ ఫంక్షన్‌హాల్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. 72ఏళ్ల స్వతంత్ర భారతదేశంలో 10కోట్ల మంది గిరిజనులు ఉన్నారని వీరంతా గోర్బోలీ భాష మాట్లాడుతున్నారన్నారు. అలాగే రాష్ట్రంలో 40లక్షల మంది గిరిజనులు ఉన్నారని అన్నారు. దేశంలోని ఆరు రాష్ట్రాల్లో గిరిజనులను ఎస్టీలుగా గుర్తించారని మిగిలిన రాష్ట్రాల్లో మాత్రంషెడ్యూల్‌ కులాలుగా పరిగణిస్తున్నారన్నారు. దేశంలో 20శాతం ఉన్న ఇతర ఆదివాసీ కులాలను 80శాతం ఉన్న గిరిజనుల్లో వీరిని కలపడం వల్ల గిరిజనులకు అన్యాయం జరుగుతుందన్నారు. దీనిపై సుదీర్ఘ పోరాటం చేపడుతున్నట్లు తెలిపారు. అలాగే 2006 అటవీ హక్కుల చట్టం ప్రకారం అటవీ భూములు సాగుచేసుకుంటున్న గిరిజనులకు పట్టాలు ఇవ్వాలని అన్నారు.

రాష్ట్రంలో ప్రత్యేక ఎస్టీ కమిషన్‌ ను ఏర్పాటు చేయాలన్నారు. అదేవిధంగా గిరిజన యూనివర్సిటీని వెంటనే ప్రారంబించాలని కోరారు. గిరిజన యువకులకు వెంటనే నిరుద్యోగ భృతి అందించి వారు నిస్పృహలకు లోను కాకుండా చూడాలన్నారు. నేటి నుంచి తలపెట్టిన గిరిజన చైతన్య యాత్రను వాయిదా వేస్తున్నట్లు తిరిగి ఆగస్టు 15న ఈ గిరిజన ప్రజాచైతన్య యాత్రను పాలకవీడు మండలం జాన్‌పహాడ్‌ దర్గా నుంచి ప్రారంభిస్తామని తెలిపారు. యాత్రను విజయవంతం చేయాలని ఆయన కోరారు. ఈ సమావేశంలో గిరిజన సంఘాల  రాష్ట్ర, జిల్లా నాయకులు నాగునాయక్, మధునాయక్, పీకేనాయక్, కాంగ్రెస్‌ పార్టీ జిల్లా ఉపాధ్యక్షుడు సుబ్బారావు,  హరియా నాయక్‌ తదితరులు పాల్గొన్నారు.    

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top