ఏబీకే మాల్‌లో అగ్నిప్రమాదం

Fire Accident In ABK Mall In Warangal - Sakshi

సాక్షి, హన్మకొండ : అందరూ నిద్రిస్తున్న వేళ అగ్ని ప్రమాదం చోటు చేసుకున్నా.. ప్రాణనష్టం జరగకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. అయితే, భవనం పూర్తిగా దెబ్బతిని స్లాబ్‌ లోపలి చువ్వలు బయటకు రావడం ప్రమాద తీవ్రతకు అద్దం పట్టింది. షార్ట్‌ సర్క్యూట్‌ కారణంగా ఈ ప్రమాదం చోటు చేసుకుందని భావిస్తుండగా దాదాపు రూ.10 లక్షల వరకు నష్టం వాటిల్లిందని అగ్నిమాపక శాఖ అధికారులు తెలిపారు. హన్మకొండ రాంనగర్‌లోని ఏబీకే మాల్‌లో గురువారం తెల్లవారుజామున జరిగిన ఈ ప్రమాదం వివరాలు నైట్‌ వాచ్‌మెన్‌ అంజనేయులు, ఇతర ప్రత్యక్ష సాక్షులు తెలిపిన మేరకు ఇలా ఉన్నాయి.

ఏబీకే మాల్‌లోని రెండో అంతస్తులో మాక్స్‌ లైఫ్‌ ఇన్సూరెన్స్‌ కార్యాలయం ఏర్పాటుకు అద్దెకు తీసుకున్నారు. కార్యాలయానికి అనువుగా తీర్చిదిద్దుతున్న పనులు చివరి దశకు చేరుకోగా.. కార్మికులు రెండో అంతస్తులో నిద్రించారు. ఇందులో కొందరు తెల్లవారుజామున మూత్రవిసర్జనకు నిద్ర లేవగా మంటలు కనిపించడంతో ఫైర్‌ స్టేషన్‌కే కాకుండా భవనంలోని ఇతర సంస్థల ప్రతినిధులకు ఫోన్‌ చేశారు. దీంతో హన్మకొండ ఫైర్‌ ఆఫీసర్‌ నాగరాజు నేతృత్వంలో సిబ్బంది రెండు ఫైర్‌ ఇంజిన్ల ద్వారా చేరుకుని మంటలు ఆర్పారు. ఈ ఘటనలో పీఎన్‌బీ హౌజింగ్‌ ఫైనాన్స్‌ కార్యాలయంలోని ఏసీల తదితర సామగ్రి దెబ్బతిన్నదని అసిస్టెంట్‌ మేనేజర్‌ బి.రామారావు తెలిపారు. 

అయితే, పై అంతస్తుల్లో ఉన్న కార్యాలయాలకు ఎలాంటి నష్టం జరగకపోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. కాగా, ఈ మాల్‌లో ఇండియన్‌ ఓవర్సీస్‌ బ్యాంక్‌ రీజియన్‌ కార్యాలయం, ఏపీజీవీబీతో పాటు చిట్‌ఫండ్‌ కార్యాలయాలు, మెడికల్‌ షాపులు ఉన్నాయి.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top