ఎట్టకేలకు ఎంపీడీఓలకు పదోన్నతులు 

Finally Promotions to MPDOs - Sakshi

రెండు దశాబ్దాల నిరీక్షణకు తెర..

103 మందికి పదోన్నతులు కల్పిస్తూ ఉత్తర్వులు

సీఎంకు ఎంపీడీవోల సంఘం కృతజ్ఞతలు

సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్రంలోని మండల పరిషత్‌ అభివృద్ధి అధికారుల (ఎంపీడీఓ) సుదీర్ఘ నిరీక్షణ ఫలించింది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ కాలం నుంచి దాదాపు రెండు దశాబ్దాల పాటు పదోన్నతులు లేకుండానే ఒకే పోస్టులో దీర్ఘకాలం పాటు పని చేసిన వారికి ఉపశమనం లభించింది. ప్రస్తుతమున్న నిబంధనలకు మినహాయింపులిస్తూ అడ్‌హాక్‌ తాత్కాలిక పద్ధతుల్లో 103 మంది ఎంపీడీఓ, డీపీఓలకు డిప్యూటీ చీఫ్‌ ఎగ్జిక్యూటివ్‌ ఆఫీసర్‌ పోస్టుల్లో పదోన్నతి కల్పిస్తూ పంచాయతీరాజ్‌ శాఖ ముఖ్య కార్యదర్శి వికాస్‌రాజ్‌ బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు. 1996 తెలంగాణ స్టేట్‌ సబార్డినేట్‌ సర్వీస్‌ రూల్‌ 10 (ఏ) అనుగుణంగా ఎంపీడీఓలు/డీపీఓలను తాత్కాలికంగా జిల్లా పరిషత్‌ డిప్యూటీ సీఈఓ కేడర్‌లో న్యాయస్థానం నిబంధనలకు లోబడి పదోన్నతులు కల్పిస్తున్నట్టు అందులో పేర్కొన్నారు. తదుపరి ఉత్తర్వులు వచ్చే వరకు డిప్యూటీ సీఈఓలుగా పదోన్నతి పొందిన వారు ప్రస్తుతం పనిచేస్తున్న చోటే కొనసాగాల్సి ఉంటుందని తెలిపారు. ఈ విషయంలో పంచాయతీరాజ్‌ శాఖ కమిషనర్‌ అవసరమైన చర్యలు తీసుకోవాలని సూచించారు.  

పదోన్నతులపై హర్షం.. 
దాదాపు 20 ఏళ్లుగా పెండింగ్‌లో ఉన్న అంశంపై ప్రత్యేక శ్రద్ధ తీసుకుని పదోన్నతులు కల్పించినందుకు సీఎం కేసీఆర్‌కు తెలంగాణ మండల పరిషత్‌ అభివృద్ధి అధికారుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు బి.రాఘవేందర్‌రావు, ప్రధాన కార్యదర్శి ఎం.శ్రీనివాస్, అసోసియేట్‌ ప్రెసిడెంట్‌ బి.శేషాద్రి కృతజ్ఞతలు తెలిపారు. పదోన్నతుల కోసం కృషి చేసిన మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావు, సీనియర్‌ నేతలు కేటీఆర్, టి.హరీశ్‌రావు, జి.జగదీశ్‌రెడ్డి, పంచాయతీరాజ్‌ ముఖ్యకార్యదర్శి వికాస్‌రాజ్, కమిషనర్‌ నీతూప్రసాద్, సీఎంఓ కార్యదర్శి స్మితా సబర్వాల్‌కు ధన్యవాదాలు తెలియజేశారు. పదోన్నతుల ఉత్తర్వులు ఇవ్వడం పట్ల రాష్ట్ర పంచాయతీరాజ్‌ మినిస్టీరియల్‌ అసోసియేషన్‌ అధ్యక్షుడు పైళ్ల జయప్రకాశ్‌రెడ్డి, ప్రధానకార్యదర్శి నందకుమార్‌ హర్షం వ్యక్తం చేశారు.  

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top