చెల్లుబాటు ఖాతాకే స్కాలర్‌షిప్‌

Few Changes in Scholarships of Postmetric Student Scholarships - Sakshi

పోస్టుమెట్రిక్‌ ఉపకారవేతనాల పంపిణీలో మార్పులు 

సాక్షి, హైదరాబాద్‌: పోస్టుమెట్రిక్‌ విద్యార్థుల ఉపకారవేతనాల పంపిణీలో కొత్త సంస్కరణలను ఎస్సీ అభివృద్ధి శాఖ తీసుకొస్తోంది. స్కాలర్‌షిప్‌ల పంపిణీలో రివర్స్‌ ట్రాన్సాక్షన్ల సమస్యను అధిగమించేందుకు సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించుకోవాలని నిర్ణయించింది. ఇందుకోసం స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఎస్‌బీఐ)తో అవగాహన ఒప్పందం చేసుకుంది. ఆ ప్రకారం విద్యార్థుల ఖాతాలను పరిశీలించి చెల్లుబాటు ఖాతాలున్న వారికే ఉపకారవేతనాలు విడుదల చేయనున్నారు.
 
ఖాతా సరైనది కాకుంటే.. 
ఒప్పందం ప్రకారం స్కాలర్‌షిప్‌ కోసం విద్యార్థులిచ్చిన ఖాతా సరైనదో కాదో ఎస్‌బీఐ అధికారులు తేల్చుతారు. బ్యాంకు ఖాతా నిర్వహిస్తున్నారా లేక నిర్వహణ లోపంతో ఖాతా స్తంభించిపోయిందా నిర్ధారిస్తారు. అలాంటి ఖాతాలన్నీ సేకరించి సంబంధిత కళాశాలలకు  ఎస్‌ఎంఎస్‌ల ద్వారా సమాచారమిచ్చి ఆయా విద్యార్థులకు తెలియజేస్తారు. ఇతర బ్యాంకు ఖాతాల నిర్వహణను ఎన్‌పీసీఐ (నేషనల్‌ పేమెంట్స్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా) సహకారంతో తేల్చనున్నారు. ఈ మేరకు గత వారం ఎస్సీ అభివృద్ధి శాఖ, ఎస్‌బీఐ, ఎన్‌పీసీఐ అధికారులు సమావేశమై నిర్ణయం తీసుకున్నారు. 

ఏటా 10 శాతం రద్దు 
రాష్ట్రంలో సగటున 13 లక్షల మంది ఉపకార వేతనాలు, ఫీజు రీయింబర్స్‌మెంట్‌కు ఆన్‌లైన్‌ పద్ధతిలో దరఖాస్తు చేసుకుంటున్నారు. వీరిలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ, వికలాంగ విద్యార్థులు 12 లక్షలకు పైమాటే. అయితే సగటున 10 శాతం మంది తప్పుడు వివరాలు నమోదు చేయడం, లావాదేవీలు నిర్వహించకపోవడంతో ఆ ఖాతాలు స్తంభిస్తున్నాయి. దీంతో వారికి ఉపకార వేతనాలు పంపిణీ చేస్తున్నా ఆ మొత్తం తిరిగి ప్రభుత్వ ఖాతాలో జమవుతోంది. దీంతో సంక్షేమాధికారులు వారి ఖాతా నంబర్లను మళ్లీ సేకరించి మళ్లీ బిల్లులు రూపొందించి వాటిని ఖజానా శాఖకు సమర్పించి విడుదల చేయడం ప్రహసనమవుతోంది. దీంతో ఖాతాల పరిశీలనపై పర్యవేక్షణ ఉంటే మేలని భావించిన అధికారులు ఎస్‌బీఐతో అవగాహన కుదుర్చుకున్నారు. ఇందులో భాగంగా ఖాతాల పరిశీలన పూర్తయితేనే సంక్షేమాధికారులు బిల్లులు రూపొందిస్తారని  ఎస్సీ అభివృద్ధి శాఖ సంచాలకుడు కరుణాకర్‌ తెలిపారు.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top