రైల్వే బడ్జెట్‌పై ఆశలు ఆవిరి! | Fare hike may kick in before the Railway budget | Sakshi
Sakshi News home page

రైల్వే బడ్జెట్‌పై ఆశలు ఆవిరి!

Jun 18 2014 2:30 AM | Updated on Sep 27 2018 5:59 PM

రైల్వే బడ్జెట్‌పై ఆశలు ఆవిరి! - Sakshi

రైల్వే బడ్జెట్‌పై ఆశలు ఆవిరి!

రాష్ర్ట విభజనతో కొత్తగా ప్రగతి ప్రయాణం మొదలుపెట్టిన తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలు ఇప్పుడు కీలకమైన రైల్వే ప్రాజెక్టులపై విషయంలో భారీ ఆశలే పెట్టుకున్నాయి.

* తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లకు ప్రయోజనాలు అంతంతే  
* ఈసారి భారీ ప్రతిపాదనలు వద్దంటూ రైల్వే బోర్డు సంకేతాలు
* గత బడ్జెట్ నిధుల్లో దక్షిణ మధ్య రైల్వేకు రూ. 1200 కోట్ల మేర కోత
* కాంట్రాక్టర్లకు పేరుకుపోయిన బకాయిలు
*కొత్త బడ్జెట్‌లో వరాలు తగ్గించి వాటిని చెల్లించాలని నిర్ణయం

 
 సాక్షి, హైదరాబాద్: రాష్ర్ట విభజనతో కొత్తగా ప్రగతి ప్రయాణం మొదలుపెట్టిన తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలు ఇప్పుడు కీలకమైన రైల్వే ప్రాజెక్టులపై విషయంలో భారీ ఆశలే పెట్టుకున్నాయి. ఇందుకు ప్రతిపాదనలనూ సిద్ధం చేసుకుంటున్నాయి. కొత్త రాష్ట్రాల్లో నవ నిర్మాణం జరగాల్సిన తరుణంలో రైల్వే శాఖ కూడా వరాలు కురిపిస్తుందని ఇరు రాష్ట్రాల ప్రభుత్వాలు భావిస్తున్నాయి. కానీ ఆ పరిస్థితి మాత్రం కనిపించడం లేదు. వచ్చే నెలలో పార్లమెంటులో ప్రవేశపెట్టనున్న రైల్వే బడ్జెట్‌లో కేటాయించే నిధులు పాత బకాయిలకే సరిపోయేలా కనిపిస్తోంది.
 
 గత రైల్వే బడ్జెట్ కేటాయింపులకు సంబంధించి యూపీఏ ప్రభుత్వం చేతులెత్తేయడంతో ఈ పరిస్థితి ఏర్పడింది. గత బడ్జెట్‌లో దక్షిణ మధ్య రైల్వేకు కేటాయించిన నిధుల్లో దాదాపు రూ. 1200 కోట్ల మేర విడుదల కాలేదు. కానీ ఆయా అభివృద్ధి పనులను ఆపేసే పరిస్థితి లేకపోవడంతో వాటిని ప్రారంభించిన అధికారులు సంబంధిత చెల్లింపులను మాత్రం నిలిపివేశారు. దీంతో కాంట్రాక్టర్లకు చెల్లించాల్సిన బకాయిలు పెద్దమొత్తంలో పేరుకుపోయాయి. ఈ నేపథ్యంలో వచ్చే బడ్జెట్‌లో ఇచ్చే నిధులను పాత బకాయిల చెల్లింపునకే మళ్లించే అవకాశముంది. ఈ మేరకు రైల్వే శాఖ తాజాగా దక్షిణ మధ్య రైల్వే అధికారులకు పరోక్షంగా స్పష్టం చేసింది. బడ్జెట్‌కు సంబంధించి భారీ ప్రతిపాదనలు పంపొద్దని పేర్కొంది.
 
 నిధుల్లో భారీ కోతే అసలు సమస్య
 గత ఏడాది భారీ వర్షాలు, తుపాన్లతో దేశవ్యాప్తంగా సరుకు రవాణా బాగా మందగించింది. మరోవైపు మార్కెట్ డీలా పడటంతో సిమెంటు రవాణా కూడా భారీగా తగ్గింది. సరుకు రవాణానే ఊపిరిగా నెట్టుకొస్తున్న రైల్వేకు ఇది అశనిపాతంగా మారింది. దీంతో నాటి యూపీఏ ప్రభుత్వం 2013-14 బడ్జెట్ కేటాయింపుల్లో 25 శాతంమేర కత్తెరేసింది.  దక్షిణ మధ్య రైల్వేకు ఆ బడ్జెట్‌లో రూ.12,597 కోట్లను ప్రకటించగా.. ఇందులో ముఖ్యమైన అభివృద్ధి పనులకు సంబంధించి రూ.4,083 కోట్లు కేటాయించింది. వీటితోనే కొత్త లైన్లు, డబ్లింగ్, ట్రిప్లింగ్ పనులు, వంతెనల నిర్మాణం, స్టేషన్ల అభివృద్ధి, రైళ్లలో కొత్త వసతుల కల్పన, ప్రమాదాల నివారణ చర్యలు చేపట్టాల్సి ఉంది.
 
 అయితే ఈ నిధుల్లోనే కోత పెట్టారు. దీంతో అగ్ని ప్రమాదాల నివారణకు సంబంధించిన పనులకు రూ. 155 కోట్లు, రైలే ్వ స్టేషన్‌ల ఆధునికీకరణ, ప్రధాన స్టేషన్‌లలో ఎస్కలేటర్లు, లిఫ్టుల ఏర్పాటు తదితర పనులకు రూ. 275 కోట్లు, కొత్త లైన్ల నిర్మాణానికి రూ. 165 కోట్లు, డబ్లింగ్ పనులకు 110 కోట్లు, లెవల్ క్రాసింగ్‌ల వద్ద గేట్ల ఏర్పాటు, వంతెనల నిర్మాణానికి రూ. 83 కోట్లు, సిగ్నలింగ్ ఆధునికీకరణకు రూ. 50 కోట్లు... ఇలా వివిధ పనులకు సంబంధించి కాంట్రాక్టర్లకు బకాయిలు పేరుకుపోయినట్టు సమాచారం. మరోవైపు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాల నుంచి ఇప్పటికే అనేక విజ్ఞాపనలు వెల్లువెత్తుతున్నాయి. ఎమ్మెల్యేలు, ఎంపీలు కేంద్ర అధికారులను కలిసి పలు ప్రతిపాదనలు వారి ముందు పెడుతున్నారు. వీటిల్లో రైల్వే బోర్డు ప్రత్యేకంగా పరిగణించేవి తప్ప మిగతావి బుట్ట దాఖలయ్యే పరిస్థితి నెలకొంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement