రైలు ప్రయాణాలు ఇప్పట్లో వద్దు | Experts Advise Against Allowing Public Transport In Face Of Corona Virus | Sakshi
Sakshi News home page

రైలు ప్రయాణాలు ఇప్పట్లో వద్దు

Apr 21 2020 1:26 AM | Updated on Apr 21 2020 1:26 AM

Experts Advise Against Allowing Public Transport In Face Of Corona Virus - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: మే మొదటి వారం నాటికి కరోనా పాజిటివ్‌ కేసుల సంఖ్య తగ్గడం ప్రారంభిస్తే లాక్‌డౌన్‌ ఎత్తేసే అవకాశముంది. దేశవ్యాప్తంగా కేంద్రం విధించిన లాక్‌డౌన్‌ మే 3వ తేదీతో పూర్తి కానుంది, తెలంగాణలో మాత్రం 7 వరకు కొనసాగుతుంది. అనుకున్నది అనుకున్నట్లు జరిగితే లాక్‌డౌన్‌ వచ్చే నెల మొదటి వారంతో ముగుస్తుంది. ఒకవేళ అలాగే జరిగినా కూడా వెంటనే రైళ్లు పట్టాలెక్కే పరిస్థితి కనిపించట్లేదు. లాక్‌డౌన్‌ ముగిసినా రైళ్లు నడిపేందుకు రైల్వే బోర్డు సిద్ధంగా లేనట్లు తెలుస్తోంది. ఇదే విషయాన్ని కేంద్రం దృష్టికి తీసుకెళ్లినట్లు సమాచారం. కరోనా మన దేశంలో ప్రారంభమైన కొత్తలో, ఆ వైరస్‌ విస్తరించేందుకు వాహకంగా రైళ్లు పనిచేశాయన్న విషయం తెలిసిందే. మన రాష్ట్రంలో కూడా ఇదే జరిగింది.

ఇండోనేసియా నుంచి కరీంనగర్‌కు వచ్చి స్థానికంగా వైరస్‌ అంటించిన ఇండోనేసియా బృందం ఢిల్లీ నుంచి వచ్చింది కూడా రైళ్లలోనే.. ఇప్పుడు వైరస్‌ వ్యాప్తి తగ్గుముఖం పట్టినా వెంటనే రైళ్లను నడిపితే పరిస్థితి మళ్లీ అదుపు తప్పే ప్రమాదం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఇదే విషయాన్ని రైల్వే బోర్డు కూడా పేర్కొంటున్నట్లు సమాచారం. ఒకేసారి లక్షలుగా స్టేషన్లకు వచ్చే ప్రయాణికుల్లో కరోనా పాజిటివ్‌ వ్యక్తులను గుర్తించటం కష్టమని, వారు బోగీల్లోకి చేరితే, రైలు గమ్యస్థానానికి చేరుకునే లోపు వారి ద్వారా చాలామందికి వైరస్‌ సోకే ప్రమాదం ఉంటుందని హెచ్చరిస్తున్నారు. దీన్ని నియంత్రించే వ్యవస్థ తమకు లేదని రైల్వే దాదాపు చేతులెత్తేసింది. కేంద్రం కూడా దీన్ని తీవ్రంగానే పరిగణిస్తోంది. ప్రస్తుతం దేశవ్యాప్తంగా కరోనా పాజిటివ్‌ కేసుల సంఖ్య శరవేగంగా విస్తరిస్తున్నందున వెంటనే రైళ్లు నడపొద్దని రైల్వే బోర్డు దాదాపు నిర్ణయించినట్లు తెలుస్తోంది. దీన్ని దృష్టిలో ఉంచుకునే ప్రస్తుతం ఆన్‌లైన్‌ రిజర్వేషన్లను రద్దు చేసింది. చదవండి: సడలింపుల పర్వం!

తొలి విడత లాక్‌డౌన్‌ ప్రకటించినప్పుడు, స్టేషన్‌ బుకింగ్స్‌ రద్దు చేసినా.. ఆన్‌లైన్‌లో రిజర్వేషన్లను కొనసాగించింది. లాక్‌డౌన్‌ ముగిసిన రోజు అర్ధరాత్రి నుంచి రైళ్లకు బుకింగ్స్‌ తెరిచి ఉంచింది. కానీ, రెండో విడత లాక్‌డౌన్‌ను ప్రకటించిన తర్వాత మాత్రం రూటు మార్చింది. అప్పటికే పరిస్థితి కొంత అదుపు తప్పేలా ఉండటంతో ముందుజాగ్రత్తగా ఆన్‌లైన్‌ రిజర్వేషన్లను రద్దు చేసింది. వచ్చే నెల మూడో తేదీతో కేంద్రం ప్రకటించిన లాక్‌డౌన్‌ గడువు పూర్తవుతుంది. అంటే అదే రోజు అర్ధరాత్రి దాటిన తర్వాత రైళ్లు ప్రారంభం కావాల్సి ఉంటుంది. కానీ మూడో తేదీ తర్వాత రైళ్లకు సంబంధించి ఆన్‌లైన్‌ రిజర్వేషన్‌ రద్దు చేయడంతో లాక్‌డౌన్‌ను పొడిగించే అవకాశం ఉంటుందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఒకవేళ పొడిగించకుండా, ఆంక్షలతో అమలు చేసినా.. రైళ్లు మాత్రం నడిచే అవకాశం లేదని అధికారులు పేర్కొంటున్నారు.

ఇప్పట్లో ప్రజా రవాణానే వద్దు..
ప్రస్తుతం నెలకొన్న పరిస్థితి కొంత సానుకూలంగా మారి జనం రోడ్లపైకి వచ్చేందుకు ఆంక్షలతో కూడిన అనుమతి వచ్చినా.. ప్రజా రవాణాను మాత్రం ఎట్టి పరిస్థితిలో అనుమతించొద్దని నిపుణులు కేంద్రం దృష్టికి తెచ్చారు. రైళ్లతో పాటు బస్సులను కూడా నడపొద్దని పేర్కొంటున్నారు. లక్షల మంది జనం ఒక ప్రాంతం నుంచి మరో ప్రాంతానికి వెళ్లటం ఇప్పట్లో మంచిది కాదని పేర్కొంటున్నారు. మహారాష్ట్ర, రాజస్తాన్, గుజరాత్, ఢిల్లీతో పాటు తెలంగాణ, ఏపీ, తమిళనాడు తదితర రాష్ట్రాల్లో పాజిటివ్‌ కేసుల సంఖ్య ఎక్కువగా ఉన్నందున, ఈ రాష్ట్రాల్లోని ఇతర ప్రాంతాల ప్రజలు తమ స్వస్థలాలకు వెళ్తారని, అప్పుడు కొత్త ప్రాంతాలకు కరోనా విస్తరించే అవకాశం ఉందని హెచ్చరిస్తున్నారు. లాక్‌డౌన్‌ ఎత్తేసినా, రాష్ట్రాల సరిహద్దులను తెరిచే విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలని, ఏ ప్రాంతం వారు ఆ ప్రాంతంలోనే ఉండేలా చూడాలని పేర్కొంటున్నారు. ఈ నేపథ్యంలో ప్రజా రవాణా విషయంలో ఆచీతూచీ వ్యవహరించే అవకాశం ఉంది.

తెలంగాణ ఆర్టీసీ కూడా బస్సులను నడిపే అవకాశం లేదని సమాచారం. ప్రస్తుతం హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్, సూర్యాపేట, భువనగిరి లాంటి ప్రాంతాల్లో పాజిటివ్‌ కేసుల సంఖ్య ఎక్కువగా ఉంది. మిగతా ప్రాంతాల్లో వాటి సంఖ్య తక్కువగా ఉండటంతో పాటు సిద్దిపేట లాంటి ప్రాంతాల్లో అసలు లేవు. బస్సులు మొదలైతే, పాజిటివ్‌ కేసులు లేని ప్రాంతాలను సురక్షితంగా భావించి.. ఆయా ప్రాంతాలకు కేసులెక్కువ ఉన్న ప్రాంతాల నుంచి జనం రాకపోకలు సాగిస్తే కొత్త ప్రాంతాలకు కరోనా విస్తరించే ప్రమాదం ఉందని ఆర్టీసీ కూడా భావిస్తోంది. ఈ విషయంలో ఇప్పటి వరకు ప్రభుత్వం ఓ నిర్ణయం తీసుకోకున్నా.. బస్సులు నడపకపోవటమే మంచిదన్న అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. లాక్‌డౌన్‌ ముగిసే మే ఏడో తేదీ నాటికి కొత్త కేసుల సంఖ్య తగ్గినా, వైరస్‌ పూర్తిగా పోయినట్లు కాదు. దీంతో బస్సులు నడిపితే పరిస్థితి చేయిదాటి పోయే ప్రమాదం ఉందని వైద్యులు పేర్కొంటున్నారు.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement