ఏఐసీటీఈకి ఇంజనీరింగ్‌ కాలేజీల నివేదికలు 

Engineering Colleges Submitted Reports For AICTE - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: భవన నిర్మాణ అనుమతులు, ల్యాండ్‌ కన్వర్షన్, 111జీవో పరిధిలో ఉన్న 238 ఇంజనీరింగ్‌ కాలేజీల్లో శుక్రవారం వరకు లోపాల సవరణకు చేపట్టిన చర్యలపై యాజమాన్యాలు ఇచ్చిన నివేదికలను అఖిల భారత సాంకేతిక విద్యా మండలి(ఏఐసీటీఈ)కి పంపించాలని ప్రభుత్వం నిర్ణయించింది. రాష్ట్రంలో లోపాలున్న ఈ కాలేజీలకు సంబంధించి సమగ్ర నివేదికలు ఇవ్వాలని ఏఐసీటీఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని అడిగిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ప్రభుత్వం కాలేజీలనుంచి నివేదికలను తీసుకోవాలని జేఎన్‌టీయూ ను ఆదేశించింది.

దీంతో జేఎన్‌టీయూ యాజమాన్యాల నుంచి నివేదికలు కోరగా, 86 కాలేజీలే లోపాల సవరణకు చేపట్టిన నివేదికలను అందజేశాయి. అందులో జేఎన్‌టీయూ పరిధిలోని కాలేజీలు 82 ఉండగా, ఉస్మానియా వర్సిటీ పరిధిలోని కాలేజీలు 4 ఉన్నాయి. శుక్రవారం విద్యాశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి చిత్రా రాంచంద్రన్‌ అధ్యక్షతన జరిగిన సమావేశంలో వీటిపై చర్చించారు.  కాలేజీలకు అనుమతి ఇచ్చేందుకు ఏఐసీటీఈ ఇచ్చిన దరఖాస్తుల గడువు శుక్రవారంతో ముగిసింది. ఆలస్య రుసుముతో దరఖాస్తు చేసుకునే గడువు మార్చి 5 వరకు ఉంది. దీంతో ఆలోగా లోపాల సవరణ నివేదికలను ఏఐసీటీఈకి పంపించాలని సమావేశంలో నిర్ణయించారు.  

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top