ఇంజనీరింగ్ కాలేజీలకు హైకోర్టులో ఊరట | Sakshi
Sakshi News home page

ఇంజనీరింగ్ కాలేజీలకు హైకోర్టులో ఊరట

Published Sat, Jun 13 2015 1:47 AM

ఇంజనీరింగ్ కాలేజీలకు హైకోర్టులో ఊరట - Sakshi

* అనుబంధ గుర్తింపు వ్యవహారంలో వెసులుబాటు
* అప్పీళ్లకు 20వ తేదీ వరకు అవకాశం
* జూలై 6 నుంచి కౌన్సెలింగ్..జూలై 31 కల్లా కౌన్సెలింగ్ ప్రక్రియ పూర్తి కావాలి
* ఆగస్టు 1 నుంచి తరగతులను ప్రారంభించాలి..ఉత్తర్వులు జారీ చేసిన హైకోర్టు

సాక్షి, హైదరాబాద్: అనుబంధ గుర్తింపు ప్రక్రియ విషయంలో జవహర్‌లాల్ నెహ్రూ సాంకేతిక విశ్వవిద్యాలయం (జేఎన్‌టీయూ), హైదరాబాద్ జారీ చేసిన ప్రొసీడింగ్స్‌కు సంబంధించి రాష్ట్రంలో పలు ఇంజనీరింగ్ కాలేజీలకు హైకోర్టులో ఊరట లభించింది.

2015-16 విద్యా సంవత్సరానికి అనుబంధ గుర్తింపునిచ్చే విషయంలో కాలేజీల్లో ఉన్న లోపాలను ఎత్తిచూపిన జేఎన్‌టీయూ, వాటిని సవరించుకునేందుకు రెండు రోజుల గడువునిస్తూ ఈ నెల 9న జారీ చేసిన ప్రొసీడింగ్స్‌పై అప్పీలేట్ అథారిటీ ముందు అప్పీళ్లు దాఖలు చేసుకునే వెలుసుబాటును హైకోర్టు ఇంజనీరింగ్ కాలేజీలకు ఇచ్చింది. ఈ నెల 20వ తేదీకల్లా అప్పీళ్లు దాఖలు చేసుకోవాలని ఇంజనీరింగ్ కాలేజీలను ఆదేశించిన హైకోర్టు, ఆ అప్పీళ్లను ఈ నెల 28కల్లా పరిష్కరించాలని జేఎన్‌టీయూహెచ్ అప్పీలేట్ అథారిటీకి స్పష్టం చేసింది.

అప్పీళ్లను విచారించే సమయంలో 9వ తేదీన జారీ చేసిన ప్రొసీడింగ్స్‌లో లేవనెత్తిన లోపాల వరకే పరిమితం కావాలని అప్పీలేట్ అథారిటీకి తేల్చి చెప్పింది. ఇదే సమయంలో ఈ నెల 18 నుంచి ప్రారంభం కావాల్సిన కౌన్సెలింగ్ షెడ్యూల్‌ను ఇరుపక్షాల న్యాయవాదుల సమ్మతితో హైకోర్టు సవరించింది. మొదటి కౌన్సెలింగ్‌ను జూలై 6న, రెండో కౌన్సెలింగ్ 13న, మూడో కౌన్సెలింగ్‌ను జూలై 20న నిర్వహించాలని ఆదేశాలు జారీ చేసింది. మొత్తం కౌన్సెలింగ్ ప్రక్రియను జూలై 31 కల్లా పూర్తి చేసి, ఆగస్టు 1వ తేదీ నుంచి తరగతులు ప్రారంభమయ్యేలా చర్యలు తీసుకోవాలని స్పష్టం చేసింది.

అలాగే కాలేజీల తనిఖీలు ఆపి, ఇప్పటి వరకు జరిపిన తనిఖీల ఆధారంగా తయారు చేసిన నివేదికలను, నిజనిర్ధారణ కమిటీ రూపొందించిన నివేదికలను వెబ్‌సైట్‌లో ఉంచాలని జేఎన్‌టీయూని ఆదేశించింది. ఇంజనీరింగ్ కాలేజీలు దాఖలు చేసిన వ్యాజ్యాలను పరిష్కరిస్తూ న్యాయమూర్తి జస్టిస్ ఎ.రామలింగేశ్వరరావు శుక్రవారం ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేశారు. 2015-16 విద్యా సంవత్సరానికి అనుబంధ గుర్తింపునిచ్చే విషయంలో కాలేజీల్లో ఉన్న లోపాలను జేఎన్‌టీయూహెచ్ ఎత్తిచూపింది.

ఈ లోపాలను వెంటనే సవరించుకోవాలని, సవరించుకున్న విషయాన్ని తమకు తెలియచేస్తే మరోసారి తనిఖీలు నిర్వహిస్తామంటూ ఈ నెల 9న జేఎన్‌టీయూ ప్రొసీడింగ్స్ జారీ చేసింది. లోపాల సవరణకు రెండు రోజుల గడువునిచ్చింది. ఈ ప్రొసీడింగ్స్‌ను రద్దు చేయడంతో పాటు, తమ కాలేజీలను ఈ నెల 18 నుంచి ప్రారంభమయ్యే కౌన్సెలింగ్ ప్రక్రియలో చేర్చేలా ఆదేశాలివ్వాలంటూ సెయింట్ మేరీస్ గ్రూప్ ఆఫ్ ఇన్‌స్టిట్యూషన్స్, మరికొన్ని కాలేజీలు హైకోర్టును ఆశ్రయించిన విషయం తెలిసిందే.

Advertisement
 
Advertisement
 
Advertisement