గిలగిలా.. పైసా ఎలా?

Empty Funds in GHMC Budget Hyderabad - Sakshi

జీహెచ్‌ఎంసీ ఖజానా ఖాళీ ∙అడ్డదిడ్డంగా  చాంబర్ల పేరిట హంగులు

ఆర్టీసీకి రూ. 339 కోట్లు ∙కార్మికుల వేతనాల పెంపుతో పెరిగిన భారం  

కేటాయింపులు తప్ప ప్రభుత్వం నుంచి నిధుల్లేవు 

వికేంద్రీకరణ పేరుతో పెరిగిన దుబారా

స్టాంప్‌డ్యూటీ బకాయిలు రూ. 500 కోట్లు  

బాండ్ల రుణాల వడ్డీ రూ.90 కోట్లు 

కాంట్రాక్టర్లకు చెల్లించాల్సింది రూ.150 కోట్లు

కొత్త సంవత్సరం జీతాల చెల్లింపులకూ ఇబ్బందులే..

సాక్షి, సిటీబ్యూరో: నాలుగేళ్ల క్రితం నిధుల గలగలలతో కళకళలాడిన జీహెచ్‌ఎంసీ ఖజానా ఇప్పుడు దివాళా తీసింది. గత నాలుగు నెలలుగా ఏనెలకానెల సిబ్బంది జీతాల చెల్లింపులకే ఎవరిని దేబిరించాలా అనే పరిస్థితి ఏర్పడింది. కర్ణుని చావుకు సవాలక్ష కారణాలన్నట్లు ఈ దుస్థితికి కారణాలనేకం. ఆర్థిక స్థితి క్షీణిస్తుండటాన్ని ఆదిలోనే గ్రహించి అడ్డుకట్ట వేస్తే ఈ  పరిస్థితి దాపురించేది కాదు. కానీ.. ఎవరికి వారుగా ఇష్టానుసారం ఖర్చులు పెంచి, ఆదాయం మాత్రం లేకపోవడంతో పరిస్థితి దారుణంగా మారింది. తాజాగా సివిల్‌ ఇంజినీరింగ్‌ పనులు చేసిన కాంట్రాక్టర్లకు చెల్లించాల్సిన బకాయిలు దాదాపు రూ. 150 కోట్ల మేర పేరుకుపోవడంతో వారు ఆందోళనకు దిగారు. డబుల్‌ బెడ్‌రూమ్‌ ఇళ్ల కాంట్రాక్టర్లకు చెల్లించాల్సిన నిధులూ దాదాపు రూ. 400 కోట్లున్నాయి. గత నాలుగు నెలలుగా జీతాల చెల్లింపుల ఇబ్బందులతో పరిస్థి తి బట్టబయలైనప్పటికీ.. మూడేళ్ల క్రితం నుంచే ఖజానా నుంచి భారీగా నిధులు ఖర్చయిపోతున్నాయి. లేని గొప్పల కోసం ఎవరికి వారుగా ఇష్టానుసారం ఖర్చు చేస్తున్నారు. ప్రభుత్వం సైతం పరిపాలన అనుమతులు తప్ప జీహెచ్‌ఎంసీకి తగినన్ని  నిధులివ్వడంలేదు. ఆర్టీసీ నష్టాలను భర్తీ చేసేందుకు జీహెచ్‌ఎంసీ నుంచి రూ.339 కోట్లు చెల్లించారు. ఔట్‌సోర్సింగ్‌ పారిశుధ్య కార్మికుల వేతనాలను మూడు పర్యాయాలు పెంచడంతో ఖజానాపై ఏటా దాదాపు రూ. 277 కోట్ల అదనపు భారం పడింది. గతంలో ప్రభుత్వం నుంచి ఏటా దాదాపు రూ.300–రూ.400 కోట్లు వివిధ రూపాల్లో గ్రాంట్లుగా అందేవి. బడ్జెట్‌లో కేటాయింపులు తప్ప నాలుగేళ్లుగా అవి రావడం లేవు. స్టాంప్‌డ్యూటీ కింద రావాల్సిన మరో రూ.500 కోట్లు రాలేదు. 

పెరిగిన దుబారా..
వచ్చే ఆదాయం లేకపోయినప్పటికీ, అటు అధికారులు, ఇటు పాలకమండలి సభ్యులు పోటీలు పడీ మరీ దుబారా ఖర్చులు చేస్తున్నారు. మేయర్, డిప్యూటీ మేయర్‌లనుంచి అడిషనల్‌ కమిషనర్ల దాకా తమ చాంబర్లకు లక్షలాది రూపాయలతో భారీ హంగులు చేసుకున్నారు. ఆధునీకరణ పేరిట జీహెచ్‌ఎంసీ భవనానికి భారీగా ఖర్చు చేస్తున్నారు. సమావేశాల మందిరాల పేరిట కొత్త హాళ్లు ఏర్పాటు చేస్తున్నప్పటికీ, ప్రైవేట్‌ హాళ్లు, హోటళ్లలో సమావేశాలు నిర్వహిస్తున్నారు. ఒక్కో అధికారి చాంబర్‌కు కనీసం రూ.15 లక్షలకు తగ్గకుండా ఖర్చులు చేసుకున్నారు. ఇక ఫోన్లు, ల్యాప్‌టాప్‌ల వంటివాటికీ లక్షకు తగ్గకుండా ఖర్చుచేసేశారు. అన్నీ లెక్కిస్తే దాదాపు రూ.30 కోట్ల మేర ఇలాంటి ఖర్చులు చేసినట్లు సమాచారం. కార్యాలయాలను ఆధునీకరించుకోవడం తప్పు కాదు కానీ.. ఖజానాను చూసి ఖర్చు చేస్తే విమర్శలు రాకుండా ఉండేవి. 

దుబారా వికేంద్రీకరణ..
అధికారాల వికేంద్రీకరణపేరిట జోనల్‌ , సర్కిళ్లకు అధికారాలివ్వడంతో ఇద్దరు  ముగ్గురు అధికారులు ఒక్కటైతే చాలు అందినకాడికి దండుకుంటున్నారు. జోనల్‌ కమిషనర్ల అధికారం రూ. 10 లక్షల నుంచి రూ. 20 లక్షలకు పెంచడంతో వారు ఆడింది ఆటగా సాగుతోంది. జోన్లు, సర్కిళ్లలో ఏం జరుగుతుందో, ఎంత దుబారా చేస్తున్నారో పట్టించుకుంటున్న వారు లేరు. ప్రధాన కార్యాలయానికి ఎలాంటి అధికారం లేకపోవడమే కాక కనీసం ‘చెక్‌’ కూడా లేకపోవడంతో ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారు. ఔట్‌సోర్సింగ్‌పై దాదాపు 400 మంది ఇంజినీర్లను తీసుకున్నారు. వీరు వచ్చాక నగరంలో పరిస్థితులేమైనా మెరుగయ్యాయా అంటే లేదు. ఏటా దాదాపు రూ. 10 కోట్లు జీతాలుగా చెల్లిస్తున్నారు. వివిధ విభాగాల్లో అవసరమైన చోట మాత్రం అధికారులు లేక నానాతంటాలు పడుతున్నారు. 

బాండ్ల బాట..
ఎస్సార్‌డీపీ పనుల కోసం రెండు విడతల్లో రూ.395 కోట్లు బాండ్ల ద్వారా సేకరించారు. వీటికోసం ఏటా దాదాపు రూ.84 కోట్లు వడ్డీగా చెల్లిస్తున్నారు.  ప్రస్తుతం జీహె చ్‌ఎంసీ ఖజానాలో దాదాపు రూ.25 కోట్లు మాత్రమే ఉన్నాయి. పరిస్థితులిలా ఉన్నప్పటికీ, వాస్తవాలు పట్టించుకోకుండా నడుస్తున్న ఆర్థికసంవత్సరం  రూ. 13,150 కోట్లతో భారీ బడ్జెట్‌కు ఆమోదం తెలిపారు. ప్రభుత్వం నుంచి వస్తాయనుకున్న గ్రాంట్లురూ.7073 కోట్లు వచ్చే పరిస్థితి కనిపించకపోవడంతో సవరణలో రూ.5388 కోట్లకు తగ్గించారు. జీహెచ్‌ఎంసీ ఖజానాకు వచ్చిందీ ఇప్పటి వరకు దాదాపు రూ. 2500 కోట్లే. ఆస్తిపన్ను, అసైన్డ్‌ రెవెన్యూ వంటివి రాకపోవడమే ఇందుకు కారణం. రోడ్ల మరమ్మతులకు పీపీఎం పేరిట, డబుల్‌ బెడ్‌రూమ్‌ ఇళ్లకు ప్రభుత్వమే నిధులు ఇవ్వాల్సి ఉండగా, విడుదల కాలేదు. సివిల్‌ పనులు చేసే కాంట్రాక్టర్లకు రెండున్నరనెలలుగా బిల్లులు చెల్లించకపోవడంతో పేరుకుపోయిన దాదాపు రూ.150 కోట్లు నిలిచిపోయాయి. కమిషనర్‌నుంచి తగిన హామీ రాని పక్షంలో పనులు నిలిపివేసే యోచనలో  ఉన్నారు. గత మూడునాలుగు నెలలుగా ప్రతనెలాఖరులో సిబ్బంది జీతాల కోసం పడరాని తిప్పలు పడుతున్నారు. ఈసారీ అవే ఇబ్బందులు ఎదురవనున్నాయి. డిసెంబర్‌ నెలాఖరున అందరూ విలాసాల్లో మునగనుండగా,  జీహెచ్‌ఎంసీ సిబ్బంది మాత్రం ఆరోజు జీతాలందుతాయా, లేదా అనే అయోమయంలో ఉన్నారు. 

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top