
ఆరాంఘర్ వద్ద ఆర్‌యూబీలు, మిగతా నాలుగుచోట్ల ఫ్లై ఓవర్లు
నిర్మాణాలకు సిద్ధమవుతోన్న జీహెచ్‌ఎంసీ
సాక్షి,హైదరబాద్: ఇప్పటికే గ్రేటర్‌లోని పలు జంక్షన్లలో సిగ్నల్ ఫ్రీ ప్రయాణం కోసం ఫ్లై ఓవర్లు వచ్చాయి. కొత్తగా మరిన్ని ప్రాంతాల్లో ఫ్లై ఓవర్ల కోసం టెండర్ల దశలో ఉన్నాయి. వాటిలో కొన్ని టెండర్లు పూర్తయ్యాయి. అవి అలా ఉండగానే.. నాగార్జునసాగర్ రింగ్ రోడ్ –శంషాబాద్ ఎయిర్‌పోర్ట్ రాకపోకలు సాగించే వారికి సిగ్నల్ ఫ్రీ ప్రయాణం కోసం మరో ఐదు ప్రాంతాల్లో ఫ్లై ఓవర్లు, ఆర్‌యూబీ (రోడ్ అండర్‌బ్రిడ్జి)ల నిర్మాణాలకు జీహెచ్‌ఎంసీ సిద్ధమవుతోంది. ఇవన్నీ కూడా భవిష్యత్‌లో రానున్న ఎయిర్‌పోర్ట్ మెట్రో రైలు మార్గంలో ఉండటంతో మెట్రో వర్గాలతో సమన్వయంతో సదరు ప్రాజెక్టుల డిజైన్లు తదితరాలకు జీహెచ్‌ఎంసీ సిద్ధమవుతోంది. త్వరలోనే ఫీజిబిలిటీ స్టడీ, డీపీఆర్‌లు పూర్తి చేసి పనులు చేపట్టనున్నట్లు సంబంధిత ఇంజినీర్లు తెలిపారు. దాదాపు మూడునెలల్లో ఇవి పూర్తయ్యాక టెండర్లు పిలవనున్నట్లు పేర్కొన్నారు.
పనులు ఇవీ..
1. టీకేఆర్ కాలేజీ జంక్షన్ ఫ్లై ఓవర్: టీకేర్ కాలేజీ జంక్షన్, గాయత్రినగర్ జంక్షన్, మందమల్లమ్మ జంక్షన్‌ల మీదుగా ఆరు లేన్లతో ఫ్లై ఓవర్.
2. ఒమర్ హోటల్ జంక్షన్ ఫ్లై ఓవర్: హఫీజ్‌బాబానగర్ జంక్షన్– బాలాపూర్– చర్చిరోడ్
జంక్షన్ (ఒమర్ హోటల్ నుంచి మెట్రో ఫంక్షన్ హాల్ మీదుగా షోయబ్ హోటల్) వరకు ఆరులేన్ల ఫ్లై ఓవర్.
3. బండ్లగూడ జంక్షన్ ఫ్లై ఓవర్: బండ్లగూడ–
ఎర్రకుంట జంక్షన్ వద్ద ఆరులేన్ల ఫ్లై ఓవర్.
4. మైలార్‌దేవ్‌పల్లి జంక్షన్ ఫ్లై ఓవర్: మైలార్‌దేవ్‌పల్లి, శంషాబాద్ రోడ్, కాటేదాన్ జంక్షన్‌ల వద్ద ఆరులేన్ల ఫ్లై ఓవర్.
5. ఆరాంఘర్ జంక్షన్ ఆర్‌యూబీలు: ఆరాంఘర్ జంక్షన్ వద్ద ప్రస్తుతమున్న ఆర్‌యూబీకి రెండు వైపులా రెండు లేన్లతో మరో రెండు
ఆర్‌యూబీలు.
ఈ పనులను వేటికవి విడివిడిగానే చేయనున్నారు.
పనులు పూర్తయితే సికింద్రాబాద్, ఉప్పల్ సహా వివిధ మార్గాల నుంచి ఎయిర్‌పోర్ట్‌కు రాకపోకలు సాగించే వారికి ట్రాఫిక్ చిక్కులు లేని సాఫీ ప్రయాణంతో ఎంతో సమయం కలిసి వస్తుందని, వ్యయ ప్రయాసలు తగ్గుతాయని అధికారులు చెబుతున్నారు.
డీపీఆర్‌లో భాగంగా టోపోగ్రాఫికల్ సర్వే, ట్రాఫిక్ సర్వే నిర్వహించడంతో పాటు రద్దీ సమయాల్లో సదరు మార్గాల్లో ప్రయాణించే వాహనాలు, కారిడార్‌లో రానున్న మెట్రోరైలు, సీటీఎస్ (కాంప్రహెన్సివ్ ట్రాఫిక్ అండ్ ట్రాన్స్‌పోర్ట్‌స్టడీ) మాస్టర్‌ప్లాన్, బీఆర్‌టీఎస్ (బస్ ర్యాపిడ్ ట్రాన్సిట్ సిస్టమ్)లో రాబోయే ప్రాజెక్టులు తదితర అంశాలు పరిగణనలోకి తీసుకోనున్నారు.
హై సిటీ (హైదరాబాద్ సిటీ ఇన్నోవేటివ్ అండ్ ట్రాన్స్‌ఫార్మేటివ్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్)ప్రాజెక్ట్ కింద ఎల్‌బీనగర్–ఆరాంఘర్ కారిడార్ పనుల్లో భాగంగా వీటిని చేపట్టనున్నారు.
ఢిల్లీ, కోల్‌కతా, బెంగళూర్, చెన్నైల కంటే హైదరాబాద్ మెట్రోపాలిటన్ ఏరియా పెద్దది కావడం, టీసీయూఆర్ (తెలంగాణ కోర్ అర్బన్ రీజియన్) వరకు నగరంలో ఎలాంటి ట్రాఫిక్ సమస్యల్లేకుండా చేయాలనే తలంపుతో ప్రభుత్వం ఉన్నందున ఈ ఫ్లై ఓవర్లు ఎంతో అవసరమని భావిస్తున్నారు. అదే మార్గంలో డీఆర్‌డీఎల్, డీర్‌డీఓ, మిధాని వంటి పరిశోధన సంస్థలు, లే»ొరేటరీలు ఉండటం తెలిసిందే. ఇప్పటికే గ్రేటర్ జనాభా కోటికి పైగా ఉండటమే కాక భవిష్యత్‌లో మరింత పెరగనుండటంతో ట్రాఫిక్ సమస్యలు పెరగకుండే ఉండేందుకు ఇవి అవసరం కానున్నాయి.