టికెట్ల కేటాయింపులో డీ‘ఎస్’ మార్క్! | DS mark in tickets allocation | Sakshi
Sakshi News home page

టికెట్ల కేటాయింపులో డీ‘ఎస్’ మార్క్!

Mar 18 2014 2:52 AM | Updated on Sep 2 2017 4:49 AM

నిజామాబాద్ మున్సిపల్ కార్పొరేషన్‌లో తన ఆధిపత్యాన్ని నిలుపుకునే దిశగా పీసీసీ మాజీ చీఫ్, ఎమ్మెల్సీ డీ. శ్రీనివాస్ పావులు కదిపారు.

నిజామాబాద్‌అర్బన్, న్యూస్‌లైన్ : నిజామాబాద్ మున్సిపల్ కార్పొరేషన్‌లో తన ఆధిపత్యాన్ని నిలుపుకునే దిశగా పీసీసీ మాజీ చీఫ్, ఎమ్మెల్సీ డీ. శ్రీనివాస్ పావులు కదిపారు. బల్దియా బరిలో నిలిచే అభ్యర్థుల జాబితాను సోమవారం ఖరారు చేశారు. ఇందులో పలువురు సీనియర్‌ల పేర్లు గల్లంతు కావడం, మిగతా సీనియర్ నాయకుల ప్రతిపాదనలకు స్థానం లేకపోవడం సిటీలో చర్చనీయాంశంగా మారింది.

 అనుకూలంగా ఉన్నవాళ్లకే
 కార్పొరేషన్‌లో టికెట్ల కేటాయింపులో ఎమ్మెల్సీ డి.శ్రీనివాస్, మాజీ మేయర్ సంజయ్ తమ ఆధిపత్యం నెగ్గించుకున్నారు. తమకు అనుకూలంగా ఉన్నవారికి టికెట్లు ఇప్పించుకున్నట్లు ఆ పార్టీ నేతలు పేర్కొంటున్నారు. టికెట్లు ఆశించిన జెండాగుడి మాజీ చైర్మన్ నాని, సీనియర్ నాయకుడు శ్రీహరికి టికెట్లు రాకపోవడం వెనుక డీఎస్ అనుచరుల హస్తం ఉన్నట్లు విమర్శలు వస్తున్నాయి. మైనార్టీ నాయకుడు అబ్ధుల్‌కు చెందిన వారికీ టికెట్లు కేటాయించలేదు. ప్రతిష్టాత్మకంగా మారిన 50వ డివిజన్‌లో ఇద్దరు బలమైన నాయకులున్నా ఛాగుభాయ్‌కి కేటాయించారు.

 సీనియర్లకు చుక్కెదురు
 కార్పొరేషన్‌లో టికెట్ల కేటాయింపులో ముఖ్యమైన నాయకులకు చుక్కెదురైంది. మాజీ డీసీసీ అధ్యక్షుడు గడుగు గంగాధర్, ప్రస్తుత డీసీసీ అధ్యక్షుడు తాహెర్‌బిన్‌ల పాత్ర నామమాత్రం కూడా లేకుండా పోయింది. వీరు తమ అనుచరులకు టికెట్లు ఇప్పించుకోవడంలో విఫలమయ్యారు. తాహెర్‌బిహన్‌కు తెలియకుండానే టికెట్ల కేటాయింపు జరిగింది. డీఎస్‌కు ముఖ్య అనుచరుడిగా పేరున్న రత్నాకర్, ఆయనకు సన్నిహితంగా మరో విద్యార్థి నాయకుడు తమ వారికి టికెట్లు ఇప్పించుకోవాలని ప్రయత్నాలు చేసి విఫలమయ్యారు. డీఎస్ మరో ముఖ్యఅనుచరుడైన వేణు, ఇతర నాయకులు ప్రతిపాదనలనే టికెట్ల కేటాయింపులో పరిగణనలోకి తీసుకున్నట్లు తెలిసింది.

 సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలోనే
 నిజామాబాద్ అర్బన్ అసెంబ్లీ స్థానాన్ని తిరిగి హస్తగతం చేసుకోవాలన్న లక్ష్యంతోనే డీఎస్ మున్సిపల్ కార్పొరేటర్ అభ్యర్థులను ఎంపిక చేసినట్లు పార్టీ నాయకులు చెబుతున్నారు. సార్వత్రిక ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని టికెట్ల కేటాయింపు చేసినట్లు పేర్కొంటున్నారు. మరోవైపు తమకు, తమ అనుచరులకు టికెట్లు కేటాయించకపోవడంతో పలువురు నాయకులు గుర్రుగా ఉన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement