బడియా.. బారా?!

Drunk and Dropping Bottles of Alcohol in the School Premises - Sakshi

మందుబాబులకు పాఠశాలనే అడ్డా 

ఆ పక్కనే మద్యం విక్రయాలు 

పట్టించుకోని అధికారులు, ప్రజాప్రతినిధులు  

ఖాళీ బాటిళ్లను ఎత్తేస్తున్న ఉపాధ్యాయులు, విద్యార్థులు

నారాయణపేట/ మాగనూర్‌ (మక్తల్‌): అక్కడ పొద్దున ఆ పాఠశాల గేట్లు తెరిస్తే చాలు మద్యం ఖాళీ బాటిళ్లు దర్శనమిస్తున్నాయి. వాటిని తొలగించడం విద్యార్థులు.. ఉపాధ్యాయులకు వంతైంది. ఉదయం శుభ్రంగా ఉంటే రాత్రి మాత్రం మందుబాబులకు అడ్డాగా మారింది. మద్యం తాగి ఖాళీ బాటిళ్లను పడేసిపోతున్నారు. ఈ విషయమై అధికారులు, ప్రజాప్రతినిధులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదని ఉపాధ్యాయులు, విద్యార్థులు వాపోతున్నారు. ఇదీ నారాయణపేట జిల్లాలోని మాగనూర్‌ జెడ్పీహెచ్‌ఎస్‌ పరిస్థితి. ఈ పాఠశాలకు ప్రహరీ, గేటు ఉన్నా వాచ్‌మన్‌ను మాత్రం నియమించలేదు. అలాగే ప్రహరీ ఎత్తు తక్కువగా ఉండటంతో గోడ దూకి రాత్రివేళ మందుబాబులు ఇక్కడికి వచ్చి తమ పని కానిచ్చేస్తున్నారు.

పక్కనే మద్యం విక్రయాలు 
బడి అంటేనే ఓ పవిత్రమైన స్థలం.. అలాంటిది మందుబాబులు తమను ఎవరూ ఏమీ చేయలేరని అనుకుంటున్నారేమో మరి.. ఈ పాఠశాల ఆవరణలో తాగుడు.. మద్యం బాటిళ్లను పడేసుడు.. అంతే! ఖాళీ బాటిళ్లను ఎత్తేసి ఉపాధ్యాయులు, విద్యార్థులు రోజురోజుకూ విసుగు చెందుతున్నారు. గ్రామంలోని బెల్ట్‌ షాపులపై ఎక్సైజ్‌ అధికారులు దాడులు చేస్తున్నా.. వారి కంట పడకుండా ఇలా చీకటి దాందా కొనసాగిస్తున్నట్టు తెలుస్తోంది. మాగనూరులోని ఓ వ్యక్తి గుడి దారిలో బెల్ట్‌ దుకాణం నిర్వహిస్తున్నాడు.. అతనే ఈ పాఠశాల పక్కన ఉన్న తన స్వగృహంలో రాత్రివేళ మద్యం విక్రయిస్తున్నాడు. దీనిపై విద్యార్థి సంఘాలు, గ్రామ యువకులు పలుసార్లు ఆందోళనలు చేపట్టినా అధికారులు, పాలకుల్లో మాత్రం చలనం రావడం లేదు. ఇప్పటికైనా ఉన్నతాధికారులు స్పందించి బాధ్యులపై చర్య తీసుకోవాలని విద్యార్థులు, ఉపాధ్యాయులు కోరుతున్నారు.

మా దృష్టికి రాలేదు
మాగనూర్‌లో బెల్ట్‌ దుకణాలు పెట్టి మద్యం విక్రయిస్తున్నట్లు మాకు ఎలాంటి సమాచారం లేదు. దీనిపై ఎవరూ ఫిర్యాదు చేయలేదు. అలాంటిది మా దృష్టికి వస్తే చట్టారీర్యా చర్యలు తీసుకుంటాం.  – నాగేందర్, ఎక్సైజ్‌ సీఐ, నారాయణపేట 

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top