ముహూర్తం ఖరారు!

District Development Committees In Rangareddy - Sakshi

29న జెడ్పీ స్థాయి సంఘాల కమిటీల ఏర్పాటు అదే రోజు ప్రత్యేకంగా జెడ్పీ పాలకవర్గం భేటీ

ప్లానింగ్‌–ఫైనాన్స్‌ కమిటీలో స్థానం కోసం జెడ్పీటీసీల ఆరాటం 

తమ పరిధి ఎమ్మెల్యేలతో పైరవీలు 

సాక్షి, రంగారెడ్డి: ప్రభుత్వ పథకాల అమలు, అభివృద్ధి పనుల సమీక్షలో కీలకమైన స్థాయి సంఘాల కమిటీల ఏర్పాటుకు ముహూర్తం ఖరారైంది. ఈనెల 29వ తేదీన కమిటీలను నియమించాలని జిల్లా యంత్రాంగం నిర్ణయించింది. ఈ ప్రక్రియను పూర్తి చేసేందుకు జిల్లా పరిషత్‌ పాలకవర్గం ప్రత్యేకంగా భేటీ కానుంది. సర్వసభ్య సమావేశం నిర్వహించి స్థాయి సంఘాల కమిటీలను ఏర్పాటు చేయనున్నారు. మరోపక్క కొత్త జిల్లాలకు అనుగుణంగా ఏర్పాటు చేస్తున్న ఈ కమిటీల కూర్పు రాజకీయ వర్గాల్లో ఆసక్తి రేపుతోంది. ఎమ్మెల్యేలు, జెడ్పీటీసీలు దీనిపై దృష్టి సారించారు. జిల్లాలో 21 జెడ్పీటీసీ స్థానాలు ఉండగా.. ఇందులో 16 స్థానాల్లో అధికార పార్టీ సభ్యులు కొనసాగుతున్నారు. నాలుగు జెడ్పీటీసీలు కాంగ్రెస్‌ చేతికి చిక్కగా.. మరొకటి ఏఐఎఫ్‌బీ దక్కించుకున్న విషయం తెలిసిందే.

కమిటీల కూర్పు ఇలా.. 
జిల్లా పరిషత్‌లో ఏడు స్థాయి సంఘాలు ఉంటాయి. గ్రామీణాభివృద్ధి, విద్య–వైద్యం, వ్యవసాయం, మహిళా శిశు సంక్షేమం, సాంఘిక సంక్షేమం, ప్లానింగ్‌– ఫైనాన్స్, పనుల కమిటీలు ఉంటాయి. జిల్లాలో 21 మంది జెడ్పీటీసీలు, ఇద్దరు కో–ఆçప్షన్‌ సభ్యులు ఉన్నారు. వీరితోపాటు చేవెళ్ల, భువనగిరి, మహబూబ్‌నగర్, నాగర్‌కర్నూల్‌ ఎంపీలు రంజిత్‌ రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, మన్నె శ్రీనివాస్‌రెడ్డి, రాములు, ఎమ్మెల్సీ మహేందర్‌ రెడ్డి, ఆరుగురు ఎమ్మెల్యేలు కలిపి మొత్తం 33 మంది సభ్యులు ఉంటారు. అయితే, కొత్త పంచాయతీ రాజ్‌ చట్టం ప్రకారం సభ్యుల సంఖ్యలో స్వల్ప తేడాలు ఉండే అవకాశం ఉంది. జిల్లా పరిధిలో ఓటు హక్కు ఉన్న ప్రజాప్రతినిధులే జెడ్పీ సభ్యులుగా కొనసాగుతారు. కల్వకుర్తి ఎమ్మెల్యే జైపాల్‌ యాదవ్‌కు నాగర్‌కర్నూల్‌లో ఓటు ఉంది. నాగర్‌కర్నూల్, రంగారెడ్డి జెడ్పీల్లో దేనిలో కొనసాగుతారో ఆయన విచక్షణపై ఆధారపడి ఉంది. ఈ మేరకు స్పష్టత కోసం రంగారెడ్డి జిల్లా జెడ్పీ అధికారులు ఆయనకు ఒకటిరెండు రోజుల్లో లేఖ రాయనున్నారు.

ఎంతో కీలకం..
నూతన పంచాయతీరాజ్‌ చట్టం ప్రకారం జిల్లా పరిషత్‌కు ఎంతో ప్రాధాన్యత ఉంది. జిల్లా స్థాయిలో ప్రజా సమస్యలను, నిధులు అవసరాన్ని, పథకాల్లో లోటుపాట్లను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లడంలో కమిటీల తీర్మానాలు ముఖ్య భూమిక పోషిస్తాయి. అధికారులకు సూచనలు అందజేయడంలోనూ కమిటీల ప్రాధాన్యత ముఖ్యమైంది. జెడ్పీ సర్వసభ్య సమావేశం, స్థాయి సంఘం సమావేశాల్లో సభ్యులు చేసే తీర్మానాలను ఆమోదించి ప్రభుత్వానికి పంపిస్తారు. దీనికి అనుగుణంగా సర్కారు చర్యలు తీసుకుంటుంది. ఇలా కీలకమైన స్థాయి సంఘాల కమిటీల ఏర్పాటుపై ప్రజాప్రతినిధులు దృష్టిసారించారు. ఆయా సంఘాల్లో ఎవరికి ప్రాతినిథ్యం కల్పించాలనే అంశంపై జెడ్పీ చైర్‌పర్సన్‌ డాక్టర్‌ అనితారెడ్డి, ఎంపీ రంజిత్‌రెడ్డి, ఎమ్మెల్సీ పట్నం మహేందర్‌రెడ్డి, ఎమ్మెల్యేలు చర్చలు జరిపినట్లు విశ్వసనీయ సమాచారం.

కమిటీ స్వరూపం ఇలా.. 
సభ్యులందరినీ ఏడు భాగాలుగా విభజించి ఒక్కో స్థాయి సంఘంలో సమానంగా చోటు కల్పిస్తారు. గ్రామీణాభివృద్ధి, విద్య–వైద్యం, ప్లానింగ్‌–ఫైనాన్స్‌ కమిటీలకు జెడ్పీ చైర్‌పర్సన్‌ అధ్యక్షులుగా వ్యవహరించనున్నారు. వ్యవసాయ కమిటీకి జెడ్పీ వైస్‌ చైర్మన్‌ అధ్యక్షుడిగా కొనసాగుతారు. మహిళా శిశు సంక్షేమ కమిటీకి జనరల్‌ మహిళా జెడ్పీటీసీ అధ్యక్షురాలిగా ఉంటారు. సాంఘిక సంక్షేమ కమిటీకి అ«ధ్యక్షురాలిగా ఎస్సీ లేదా ఎస్టీ సామాజిక వర్గానికి చెందిన జెడ్పీటీసీ సభ్యురాలిని అధ్యక్షురాలిగా నియమిస్తారు. ఏడు స్ధాయి సంఘాల్లో ప్లానింగ్‌–ఫైనాన్స్‌ కమిటీ ప్రధానమైంది. ఈ కమిటీలో చోటు కోసం జెడ్పీటీసీ సభ్యులు పోటీ పడుతున్నట్లు తెలిసింది. ఎలాగైనా స్థానం దక్కించుకోవాలని తమ పరిధి ఎమ్మెల్యేల ద్వారా ప్రయత్నాలు ముమ్మరం చేసినట్లు తెలుస్తోంది. చైర్‌పర్సన్‌ అనితారెడ్డి సూచన మేరకు జెడ్పీ అధికారులు స్థాయి సంఘం కమిటీల ఏర్పాటు కోసం కరసత్తు పూర్తి చేస్తున్నారు. ఏ కమిటీలో ఎవరిని సభ్యులుగా చేర్చాలనే అంశంపై గోప్యత పాటిస్తున్నారు. కమిటీల ఏర్పాటు అనంతరం ప్రతి రెండు నెలలకోసారి స్థాయి సంఘ సమావేశాలు నిర్వహించనున్నారు.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top