
అద్దె చెల్లించలేదని పాఠశాలకు తాళం
తన భవనంలో నడుస్తున్న ప్రభుత్వ పాఠశాలకు సంబంధించి అద్దె చెల్లించలేదని ఓ యజమాని భవనానికి తాళం వేసిన సంఘటన పాఠశాల పునఃప్రారంభమైన
మంచిర్యాల సిటీ : తన భవనంలో నడుస్తున్న ప్రభుత్వ పాఠశాలకు సంబంధించి అద్దె చెల్లించలేదని ఓ యజమాని భవనానికి తాళం వేసిన సంఘటన పాఠశాల పునఃప్రారంభమైన శుక్రవారం రోజు ఆదిలాబాద్ జిల్లా మంచిర్యాల పట్టణంలోని రాళ్లపేటలో జరిగింది. ఇక్కడి మండల పరిషత్ ప్రాథమిక పాఠశాల భవనానికి యజమాని ఎండీ సర్వర్ శుక్రవారం తాళం వేశాడు. 2011లో సర్వర్ సొంత భవనాన్ని మండల పరిషత్ ప్రాథమిక పాఠశాల నిర్వహించేందుకు అద్దెకిచ్చాడు.
అప్పటి ప్రధానోపాధ్యాయుడు నెలకు రూ.3,600ల చొప్పున కిరాయి చెల్లించేందుకు ఒప్పందం చేసుకున్నారు. అద్దె సకాలంలో రాకపోవడంతో జనవరి 31, 2012లో ఒకసారి బడికి తాళం వేశాడు. దీంతో అధికారులు రూ.36,000 మంజూరు చేశారు. ఆ తర్వాత రెండు దఫాలుగా రూ.27 వేలు ఇచ్చారు. నాలుగేళ్ల కాలంలో రూ.1,72,800 అద్దె రావాల్సి ఉండగా.. ఇప్పటివరకు రూ.63 వేలు మాత్రమే ఇచ్చారు. దీంతో ఆ యజమాని శుక్రవారం బడికి తాళం వేశాడు.