ఉచిత ‘బియ్యం’ అందేనా!

Delay on Free Ration Rice Distribution in Hyderabad - Sakshi

జూన్‌ నెలపై నిర్ణయం తీసుకోని ప్రభుత్వం

సరిపడా కోటాతో పౌర సరఫరాల శాఖ సిద్ధం

ఇప్పటికే రెండు నెలల పాటు బియ్యం, నగదు పంపిణీ

సాక్షి, సిటీబ్యూరో: లాక్‌డౌన్‌ కష్టకాలంలో ఆహార భద్రత కార్డుదారులకు ఉచిత బియ్యం పంపిణీ ప్రకియ వచ్చేనెల (జూన్‌)లో కూడా కొనసాగుతుందా.. లేదా? అనేది చర్చనీయంశమైంది. జూన్‌ నెల ఆరంభానికి గడువు మరో ఐదు రోజులు ఉన్నప్పటికీ.. రాష్ట్ర ప్రభుత్వం ఇంకా ఉచిత బియ్యం పంపిణీ ప్రక్రియపై నిర్ణయం తీసుకోలేదు. కేంద్ర ప్రభుత్వం మాత్రం వరసగా మూడో నెలకు సంబంధించిన బియ్యం, కంది పప్పు కోటాను మంజూరు చేసింది. రాష్ట్ర ప్రభుత్వం తమ వాటాను కలుపుకొని జూన్‌ నెల కోటాకు గ్రీన్‌ సిగ్నల్‌ ఇవ్వాల్సి ఉంది. పౌరసరఫరాల శాఖ మాత్రం గత రెండు నెలల మాదిరిగానే సరిపడా బియ్యం, కంది పప్పు కోటాతో సిద్ధంగా ఉంది. ఇప్పటికే ఆన్‌లైన్‌లో కేటాయింపులు సైతం చేసి ప్రభుత్వ ఆదేశాల కోసం ఎదురు చూస్తోంది.

రెండు నెలలుగా..
లాక్‌డౌన్‌లో నిరుపేదలు అకలితో అలమటించకూడదనే ఉద్దేశంతో ఆహార భద్రత కార్డుదారులకు రెండు నెలలు (ఏప్రిల్, మే)గా ఉచిత బియ్యం పంపిణీ చేస్తూ వచ్చింది. సాధారణ కోటాను సైతం రెట్టింపు చేసి ఉచితంగా పంపిణీ చేసింది. అదేవిధంగా నిత్యావసరాల సరుకుల కోసం కూడా నెలకు రూ. 1500 చొప్పున నగదు బ్యాంక్‌ ఖాతాల్లో జమ చేసింది. వరసగా బియ్యం సరుకులు డ్రా చేయని పేదలు సైతం కష్ట కాలంలో తిండి గింజలకు ఇబ్బంది పడకూడదని ఉచితంగా బియ్యం పంపిణీ చేయడంతోపాటు  ఆలస్యంగానైనా నిత్యావసర సరుకుల కోసం నగదు చేయూత అందించింది. తాజాగా లాక్‌డౌన్‌ మినహాయింపులతో వివిధ రంగాల సాధారణ ప్రక్రియ పునఃప్రారంభమై ఉపాధి మెరుగుపడటంతో జూన్‌ నెలలో ఉచితం బియ్యం పంపిణీ చేయాలా.. వద్దా? అని ప్రభుత్వం యోచిస్తోంది.

20 లక్షల కుటుంబాలకు లబ్ధి..
గ్రేటర్‌  పరిధిలో సుమారు 20 లక్షలకుపైగా ఆహార భద్రత కార్డు పేద కుటుంబాలున్నాయి. నగరంలో హైదరాబాద్‌– మేడ్చల్‌– రంగారెడ్డి జిల్లాల పౌరసరఫరాల విభాగాలు ఉండగా, వాటి పరిధిలో 12 పన్నెండు అర్బన్‌ సర్కిల్స్‌తో పాటు శివారు గ్రామీణ ప్రాంతాల్లో కలిపి సుమారు 16 లక్షలపైగా ఆహార భద్రత కార్డులు కలిగిన కుటుంబాలున్నాయి. మరో నాలుగు లక్షల వరకు ఇతర జిల్లాల ఆహార భద్రత కార్డు కలిగిన కుటుంబాలు కూడా ఇక్కడే తాత్కాలిక నివాసం ఏర్పాటు చేసుకొని నివసిస్తున్నాయి. రేషన్‌ పోర్టబిలిటీ స్థానికేతులకు కలిసి వస్తోంది. దీంతో ఇక్కడనే∙రేషన్‌ సరుకులు డ్రా చేస్తుంటారు.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top